logo

నగదు బదిలీ చేయాలంటూ దోపిడీ

దోపిడీ కేసులో రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 01 Apr 2023 05:52 IST

ఇద్దరు రాజస్థాన్‌ వాసుల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ మలికా గార్గ్‌.. చిత్రంలో అదనపు ఎస్పీ(క్రైమ్స్‌) శ్రీధర్‌రావు, ఒంగోలు డీఎస్పీ నాగరాజు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: దోపిడీ కేసులో రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మలికా గార్గ్‌ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సంతనూతలపాడుకు చెందిన గాదంశెట్టి శ్రీనివాసులు అలియాస్‌ శ్రీను చీమకుర్తి ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట గెలాక్సీ నెట్‌ పేరిట దుకాణాన్ని ఏర్పాటుచేసుకుని పాస్‌పోర్టు సైజు ఫొటోల ప్రింటింగ్‌తో పాటు నగదు బదిలీ లావాదేవీలు నిర్వహిస్తుంటారు. మార్చి నాలుగో తేదీ రాత్రి పది గంటల సమయంలో ఇద్దరు యువకులు వచ్చి నగదు బదిలీ చేయాలని కోరారు. వారిచ్చిన ఆధార్‌ కార్డులను పరిశీలించిన అతను అవి ఏ బ్యాంకు ఖాతాకూ సరిపోలడం లేదని తెలిపారు. ఆ తర్వాత వారు ఏటీఎం కార్డు ఇచ్చి నగదు బదిలీ చేయాలని కోరారు. రహస్య సంఖ్యను మూడుసార్లు తప్పుగా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నిందితులు దుకాణం షట్టర్‌ను లోపలి నుంచి మూసివేసి శ్రీనివాసులుపై విచక్షణారహితంగా దాడికి దిగారు. కౌంటర్‌లో నుంచి రూ.15 వేల నగదు తీసుకుని ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు చీమకుర్తి ఎస్సై వి.ఆంజనేయులు కేసు నమోదు చేశారు. ఒంగోలు గ్రామీణ ఇన్‌ఛార్జి సీఐ డి.రంగనాథ్‌ బృందం దర్యాప్తు చేపట్టి రాజస్థాన్‌ రాష్ట్రం నాగోర్‌ జిల్లా నోఖా చందవత గ్రామానికి చెందిన సవర్‌ రాం, సాగర్‌ నాయక్‌లు ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను చీమకుర్తి తూర్పు బైపాస్‌ రోడ్డులో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దోపిడీ సొత్తు రూ.15 వేలతో పాటు, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో విశేషంగా కృషిచేసిన అధికారులతో పాటు చీమకుర్తి కానిస్టేబుల్‌ రాము, మద్దిపాడు కానిస్టేబుల్‌ రాఘవలను ఎస్పీ గార్గ్‌ రివార్డుతో పాటు ప్రశంసాపత్రాలు అందజేశారు.

వలస కార్మికుల వివరాల సేకరణ...: దోపిడీ ఉదంతం నేపథ్యంలో జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న వలస కార్మికుల వివరాలు సేకరిస్తున్నట్టు ఎస్పీ మలికా గార్గ్‌ తెలిపారు. చీమకుర్తి ప్రాంతంలోని గ్రానైట్‌ గనులు, పాలిషింగ్‌ యూనిట్లలో, గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో  పనిచేస్తున్న వారి వివరాలు సేకరిస్తామని చెప్పారు. వేసవి నేపథ్యంలో చోరీలకు అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని