logo

ఫోన్‌ చేసుకుంటానంటూ రూ.98 వేలకు బురిడీ

ఫోన్‌ చేసుకుంటానంటూ చరవాణి తీసుకుని ఓ అపరిచిత వ్యక్తి రూ.98 వేలను వేరే ఖాతాలో తరలించిన సంఘటన కురిచేడులో శుక్రవారం చోటుచేసుకుంది.

Published : 01 Apr 2023 04:12 IST

నిధులు మళ్లించిన అపరిచిత వ్యక్తి

కురిచేడు, న్యూస్‌టుడే: ఫోన్‌ చేసుకుంటానంటూ చరవాణి తీసుకుని ఓ అపరిచిత వ్యక్తి రూ.98 వేలను వేరే ఖాతాలో తరలించిన సంఘటన కురిచేడులో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుడు కాటం కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాటంవారిపల్లెకి చెందిన కాటం కృష్ణారెడ్డి నిత్యావసర వస్తువుల దుకాణంతో ఉపాధి పొందుతున్నారు. శుక్రవారం ఉదయం ఓ అపరిచిత వ్యక్తి వచ్చి నిత్యావసర వస్తువులు తీసుకున్నాడు. తన వద్ద నగదు లేదని, స్నేహితుడు ఆన్‌లైన్‌లో పంపుతాడని చెప్పి ఓ ఫోన్‌ నెంబర్‌ ఇచ్చి దానికి ముందస్తుగా ఓ రూపాయిని ఫోన్‌ పే చేయమని కోరాడు. దీంతో కృష్ణారెడ్డి తన ఫోన్‌పే నుంచి ఆ ఖాతాకు ఓ రూపాయి పంపుతుండగా, అపరిచిత వ్యక్తి అతని పాస్‌వర్డ్‌ గమనించాడు. తర్వాత ఫోన్‌ చేసి స్నేహితుడితో మాట్లాడతానంటూ కృష్ణారెడ్డి చరవాణి తీసుకుని ఫోన్‌పే ద్వారా రూ.98 వేలు వేరే ఖాతాకు మళ్లించాడు. మాయమాటలు చెప్పి వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. అనుమానం వచ్చి కొంతసేపటి తర్వాత కృష్ణారెడ్డి తన ఫోన్‌పేలో నగదు చూసుకోగా, రూ.98 వేలు వేరే ఖాతాకు మళ్లినట్లు గుర్తించారు. ఆ పరిసరాల్లో పరిశీలించగా అపరిచితుడి జాడ లేకపోవడంతో ఖాతా సంఖ్య ఆధారంగా అతని కోసం ఆరా తీస్తున్నారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని