logo

బిల్లులేవి జగనన్నా!

బీసీ మహిళనైన నేను మూడో వార్డు నుంచి వైకాపా తరఫున గెలిచాను. నాయకులు, అధికారుల మాటలు నమ్మి అప్పులు తెచ్చి, ఆపై ఎకరా పొలం అమ్మి అయిదు నెలలపాటు ట్యాంకర్లతో ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయించాను.

Published : 26 May 2023 02:14 IST

నీటి ట్యాంకర్ల సరఫరాకు అప్పులు
రూ. 10 కోట్లకు పైగా బకాయిలు

పట్టణంలోని ఓ కాలనీలో ట్యాంకర్‌ ద్వారా ఇంటింటికీ నీటి సరఫరా (పాత చిత్రం)

కనిగిరి, న్యూస్‌టుడే:శాశ్వత తాగునీటి వనరులు లేని ఓ దుర్భిక్ష ప్రాంతం కనిగిరి. చీమకుర్తి మండలం రామతీర్థం నుంచి వచ్చే జలాలను పట్టణంలోని నాలుగు వార్డులకు సరఫరా చేస్తున్నారు. కుళాయిలు లేని దాదాపు 16 వార్డులకు ట్యాంకర్ల ద్వారానే నీటిని అందించాల్సిన పరిస్థితి. ఇందుకు సంబంధించిన టెండర్లను అధికార పార్టీకి చెందిన నాయకులే అధికశాతం దక్కించుకుని గుత్తేదారుల అవతారం ఎత్తారు. మూడేళ్ల కాలంలో మొత్తం అయిదుగురు మారారు. ఒక్కొకరు రూ. 2 కోట్లకు పైగా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసేందుకు ఖర్చు చేశారు. ఇందుకు సంబంధించిన బిల్లులు నయా పైసా వారికి ఇవ్వలేదు. విసిగివేసారి ఒకానొక సమయంలో నీటి సరఫరా నిలిపివేయడంతో మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి ఇద్దరికి మాత్రం రూ. 80 లక్షలు మంజూరు చేసి చేతులు దులుపుకొన్నారు.

* నమ్మినందుకు ఇదేం అన్యాయం...: ‘ప్రజాప్రతినిధులమైన మాకు ప్రజల దాహార్తి తీర్చాల్సిన బాధ్యత ఉంది. ఇతరులు ముందుకు రాకుంటే టెండర్లు దక్కింకుని ఆపై సొంతంగా ఖర్చు చేసి ట్యాంకర్లతో నీళ్లందించాం. అధికారంలో ఉన్న పార్టీ మాదే కదా అనుకున్నాం. బిల్లులు మంజూరయ్యేలా చూస్తామంటూ నేతలు చెప్పిన మాటలు నమ్మాం. తీరా చూస్తే ఏళ్లుగా మంజూరే లేదు. నమ్మి పనులు చేసినందుకు ఇదేం అన్యాయం’ అంటూ గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘అప్పులు తెచ్చి.. భార్యల పుస్తెలు తాకట్టు పెట్టి, భూములు తనఖా ఉంచి దాహార్తి తీరిస్తే నట్టేట ముంచుతున్నారు. బిల్లుల కోసం మున్సిపాలిటీ గడప తొక్కని రోజు లేదు. జిల్లా అధికారులకూ విన్నవించాం. ఇదిగో అదిగో అంటున్నారే తప్ప నయా పైసా ఇచ్చిందిలేదు’ అని కన్నీటి పర్యంతమవుతున్నారు.

* బీసీ మహిళనైన నేను మూడో వార్డు నుంచి వైకాపా తరఫున గెలిచాను. నాయకులు, అధికారుల మాటలు నమ్మి అప్పులు తెచ్చి, ఆపై ఎకరా పొలం అమ్మి అయిదు నెలలపాటు ట్యాంకర్లతో ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయించాను. ఏడాది అయినా బిల్లులు రాలేదు. అప్పుల వాళ్లేమో ఇంటి చుట్టూ తిరుగుతూ వేధిస్తున్నారు. అసలే అనారోగ్యం.. ఆపై ఆర్థిక ఇబ్బందులు.. బిల్లులు మంజూరు చేయించి నన్ను, నా కుటుంబాన్ని బతికించండి ముఖ్యమంత్రి గారూ...’’ అంటూ కనిగిరి మున్సిపాలిటీ మూడో వార్డు మహిళా కౌన్సిలర్‌ పెన్నా నాగమ్మ చేతులెత్తి మొక్కుతూ ఇటీవల కన్నీటి పర్యంతమయ్యారు.

* నేతల మాటలు నమ్మాం. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా వడ్డీకి తెచ్చి కొందరం.. స్థలాలు అమ్మి, తాకట్టు పెట్టి మరికొందరం ఇంటింటికీ ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేశాం. ఇంతవరకు నయా పైసా ఇవ్వలేదు. అప్పుల వాళ్లేమో ఇళ్ల మీదికొస్తున్నారు. బాకీలు ఎప్పుడు తీరుస్తారంటూ గొడవలకు దిగుతున్నారు. బిల్లులు మంజూరు చేసి మమ్మల్ని ఆదుకోవాలి...’’ ఇవీ కనిగిరి మున్సిపాలిటీలోని పలువురు గుత్తేదారుల ఆవేదన.

తెదేపా హయాంలో ఇచ్చిన  నిధులేమో వెనక్కి...

కనిగిరిలోని నీటి ఎద్దడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెద్ద చెరువును సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుగా మార్చేలా గత తెదేపా ప్రభుత్వం రూ. 200 కోట్ల నిధులు మంజూరు చేసింది. అనంతరం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. స్టోరేజీ నిర్మాణం చేపట్టని కారణంగా ఆ పనులు నిలిపేశారు. మంజూరైన నిధులు వెనక్కి పంపారు. ఆ తర్వాత ఇంటింటికీ కుళాయి ద్వారా నీరందించేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించినట్టు హడావుడి చేశారు. ఆ తర్వాత ఆ పనుల ఊసే లేదు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకుని ఉంటే ప్రజలకు నీటి ఎద్దడి తప్పేదని పలువురు పట్టణ వాసులు చెబుతున్నారు.

మంజూరు కాకుంటే మేమేమి చేసేది...

నీటి సరఫరాకు సంబంధించి మున్సిపాలిటీలో మూడేళ్లుగా గుత్తేదారులకు బిల్లులు ఇవ్వాల్సి ఉంది. ఇందుకు సంబంధించి సుమారు రూ. 10 కోట్లకు పైగా బకాయిలున్న మాట వాస్తవమే. పైనుంచి నిధులు మంజూరు కావడం లేదు. అలాంటప్పుడు మేము మాత్రం ఏం చేయగలం. నిధులు రాగానే గుత్తేదారులకు చెల్లిస్తాం.

నారాయణరావు, మున్సిపల్‌ కమిషనర్‌, కనిగిరి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని