logo

విద్వేషం చిమ్ముతున్న అధికారం

ఉత్సవమైనా, విషాదమైనా.. శుభ సందర్భమైనా, అశుభ కార్యమైనా.. ఫ్లెక్సీలకెక్కించి ప్రచారం చేసుకోవడం పరిపాటిగా మారింది.

Updated : 01 Jun 2023 05:57 IST

ఊరూరా వెలుస్తున్న ఫ్లెక్సీలు
నిరసన తెలుపుతున్న విపక్షాలు

ఒంగోలు చర్చి సెంటర్‌లో మోహరించిన వైకాపా, జనసేన కార్యకర్తలు (పాత చిత్రం)

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఉత్సవమైనా, విషాదమైనా.. శుభ సందర్భమైనా, అశుభ కార్యమైనా.. ఫ్లెక్సీలకెక్కించి ప్రచారం చేసుకోవడం పరిపాటిగా మారింది. రాజకీయాల్లో అయితే ఈ ధోరణి మరింత ఎక్కువ. పార్టీ కార్యక్రమం ఏదైనా ఉందంటే అక్కడ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల సంఖ్య, వాటి కొలతల ఆధారంగా అవి ఎంత విజయవంతమయ్యాయో అంచనా వేసుకునేవాళ్లు కొందరు. నిన్నమొన్నటి వరకు తమ గొప్పలను చెప్పుకోవడానికే వీటిని ఎక్కువగా వినియోగించిన రాజకీయ నాయకులు.. ఇప్పుడు ప్రత్యర్థులపై తప్పుడు ప్రచారానికి, విషం వెదజల్లడానికీ వాడుతున్నారు. దీంతో విద్వేషాలు పెరుగుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం తలెత్తుతోంది.

* చేష్టలుడిగిన యంత్రాంగం...:  సమాజంలో శాంతిభద్రతలు అనేవి అత్యంత కీలకం. వీటిని పరిరక్షించడం అధికార యంత్రాంగం ముఖ్య బాధ్యత. అందులో పోలీసు శాఖది అత్యంత పెద్ద పాత్ర. అయితే జిల్లా వ్యాప్తంగా ముఖ్య పట్టణాలు, కొన్ని కీలక ప్రాంతాల్లో వివాదాలకు, విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నది పరిపాలిస్తున్న పార్టీయే కావడం శోచనీయం. దీంతో అధికార యంత్రాగమే కాదు, శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు శాఖ కూడా చేష్టలుడిగి చూస్తుండిపోవాల్సి వస్తోంది.

* ఓ పార్టీకే కొమ్ము కాస్తూ...: విద్వేషపూరిత ఫ్లెక్సీలకు తెర లేపింది అధికార పార్టీయే కావడంతో ఇతర పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఆందోళనలకు దిగుతున్నాయి. అందులో భాగంగానే ఒంగోలులో వైకాపా, జనసేన నాయకుల మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ ఫ్లెక్సీలను తొలగించి పక్కన పడేసిన అధికార పార్టీ చర్యను నిరసిస్తూ జనసేన కార్యకర్తలు వైకాపా వాటిని చించేశారు. ఈ రెండు సంఘటనల్లోనూ పోలీసులే ప్రత్యక్ష సాక్ష్యం. ఇక్కడ అధికార పార్టీ ఆగడాలను చూస్తుండి పోయిన పోలీసులు వారిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అదే సమయంలో జనసేన కార్యకర్తలను మాత్రం స్టేషన్‌కు తీసుకెళ్లి అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడిచి పెట్టారు. ఈ ఉదంతంలో కేసు నమోదు చేయాలా.. వద్దా అనే అంశంపై కూడా ఆ రోజు అర్ధరాత్రి వరకూ తర్జనభర్జనలు సాగడం గమనార్హం. చివరికి అధికార పార్టీ ఒకింత ముందుచూపుతో వెనకడుగు వేసిందనే చర్చ జోరుగా సాగుతోంది.

మార్కాపురం సీఐ భీమానాయక్‌కు ఫిర్యాదు అందిస్తున్న జనసేన నాయకులు

ఫిర్యాదు చేసినా పట్టింపేది...

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై అధికార యంత్రాంగం సీరియస్‌గా స్పందించాల్సి ఉంది. ఒంగోలులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్‌ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందంతో జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కూడా ఈ విద్వేష ప్రచారం ఆగలేదు. మరింత జోరుగా కొనసాగుతోంది. జిల్లాలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ విష ప్రచార సంస్కృతి పాకింది. స్థానిక నేతల సహకారంతో రాత్రికి రాత్రే పలుచోట్ల విస్తృతంగా ఏర్పాటు చేశారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు అధికార యంత్రాంగానికి ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. మార్కాపురంలో మాత్రం స్పందించి కొన్నింటిని తొలగించారు. మిగిలిన చోట్ల ఇంకా దర్శనమిస్తూనే ఉన్నాయి.ఈ తరహా ప్రచారశైలి కేవలం విపక్షాల్లో మాత్రమే కాదు, అన్ని వర్గాల్లోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని