logo

ఏరువాక.. కాగితాలకెక్కిన ప్రణాళిక

ఈ ఏడాది ఖరీఫ్‌కు జిల్లా వ్యవసాయ శాఖ కాగితాలపై ప్రణాళికను సిద్ధం చేసుకుంది. గత అనుభవాలు, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని చూస్తోంది.

Updated : 01 Jun 2023 06:00 IST

ఖరీఫ్‌కు వ్యవసాయ శాఖ సన్నద్ధం ‌
1.90 లక్షల హెక్టార్లలో సాగు లక్ష్యం
పంపిణీకి విత్తనాలు, ఎరువులు సిద్ధం

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: ఈ ఏడాది ఖరీఫ్‌కు జిల్లా వ్యవసాయ శాఖ కాగితాలపై ప్రణాళికను సిద్ధం చేసుకుంది. గత అనుభవాలు, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని చూస్తోంది. వాతావరణం అనుకూలిస్తే గతేడాదికంటే అధికంగా పంటలు సాగు చేస్తారనే అంచనాతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సిద్ధం చేస్తోంది. జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి 2022 ఖరీఫ్‌లో 1,69,825 హెక్టార్లలో సాగయ్యాయి. ఈ ఏడాది మరింత విస్తీర్ణం పెంచి 1,90,042 హెక్టార్లలో సాగు చేయాలని నిర్ణయించింది. ప్రధాన పంటల్లో అత్యధికంగా కంది 80 వేల హెక్టార్లలో, పత్తి 33 వేలు, మిర్చి 28 వేలు, పొగాకు 1,725 హెక్టార్లలో సాగు చేయనున్నట్టు చెబుతోంది. అదే సమయంలో చిరుధాన్యాల సాగును పెంచేలా యోచిస్తున్నారు. మర్రిపూడి, వెలిగండ్ల, తాళ్లూరు, సీఎస్‌పురం, గిద్దలూరు, కొమరోలు మండలాల్లో సజ్జ 14,466, కొర్ర 2,224 హెక్టార్లలో సాగు చేయించేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. కౌలు రైతులకు ఇచ్చే కార్డుల సంఖ్య ఈసారి పది వేలు పెంచారు. బ్యాంకుల నుంచి సాగు, పంట రుణాలు కూడా రూ.5 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆర్బీకేల ద్వారా అందజేత...: 4,200 క్వింటాళ్ల వరి విత్తనాలను ఆర్‌బీకేల్లో రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. క్వింటాకు రూ.500 రాయితీ లభించనుంది. కందులు 1,200, మినుము 1,000, పెసర 300 క్వింటాళ్లను 30 శాతం రాయితీపై రైతులకు అదించనున్నారు. కొర్ర 72, అరికలు 2.80 క్వింటాళ్లు, జీలుగ 1700, పిల్లిపెసర 1,275, పచ్చిరొట్ట 1,275 క్వింటాళ్లు 50 శాతం రాయితీపై ఇస్తారు. ఖరీఫ్‌కు సంబంధించి పత్తి విత్తనాలు 1.50 లక్షల సంచులు, మిరప 17.50 కిలోల విత్తనాలు పది గ్రాముల సంచుల్లో సిద్ధం చేసి అందించనున్నారు.

ఎరువులు ఎంత కావాలంటే...: అన్ని రకాల ఎరువులు 59 వేల టన్నుల వరకు అవసరం అని అంచనా. పాతవి, ఈ నెల 19 వరకు వచ్చిన వాటితో కలిపి మొత్తం 28,995 టన్నులు అందుబాటులో ఉన్నాయి. 3,709 టన్నులు ఇప్పటికే రైతులు కొనుగోలు చేయగా ఇంకా 25,286 టన్నులు ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు నెలల వారీగా ఆయా ఆర్‌బీకేలకు కేటాయించి రైతులకు అందించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందులో యూరియా 6816, డీఏపీ 2,798, ఎంవోపీ 185, ఎన్‌పీకేఎస్‌ 6944, ఎస్‌ఎస్‌పీ 425 టన్నులు రైతులకు అందించనున్నారు.

చిరు ధాన్యాల విస్తీర్ణం పెంచుతాం...  

గతేడాది కంటే ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో సాగు విస్తీర్ణం పెరగనుంది. ప్రధాన పంటల స్థానంలో చిరుధాన్యాల సాగును పెంచేలా కార్యాచరణ రూపొందించాం. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తాం. అవసరం అయిన రైతులు ఆర్‌బీకేల్లో పేర్లు నమోదు చేసుకోవాలి.

శ్రీనివాసరావు, జేడీఏ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని