logo

స్వర్ణ దరహాసం

జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూకే) స్నాతకోత్సవంలో పలువురు విద్యార్థులు స్వర్ణ పతకాలతో మెరిశారు.

Updated : 01 Jun 2023 06:03 IST

జేఎన్‌టీయూకే పతక విజేతల ఆనందం

న్యూస్‌టుడే, వెంకట్‌నగర్‌: జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూకే) స్నాతకోత్సవంలో పలువురు విద్యార్థులు స్వర్ణ పతకాలతో మెరిశారు. వివిధ విభాగాల్లో టాపర్లుగా నిలిచి చిరుదరహాసంతో వర్సిటీ కులపతి, గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నుంచి స్వీకరించారు. బంగారు పతకం స్వీకరించిన సందర్భంగా వారిని ‘న్యూస్‌టుడే’ కలిసింది. ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఏయే పద్ధతులు అనుసరించారో, విజయం ఎలా వరించింది, భవిష్యత్తు ఆలోచనలను పతకధారులు వివరించారు. సమయాన్ని వృథాచేయకుండా చదవాలని, అప్పుడే కొండంత సిలబస్‌ తరిగిపోతుందని చెప్పారు. ఆఖరులో చూద్దాం.. పరీక్షల ముందు చదివేద్దామంటే ఒత్తిడి తప్ప మరేమీ ఉండదన్నారు. పుస్తకాలకే పరిమితం కాకుండా సొంత ఆలోచనలతో సాగితేనే లక్ష్యాలు చేరుకోగలమన్నారు.

సమయాన్ని వృథా చేయవద్దు

ఎస్‌.తనూజలక్ష్మీ స్రవంతి, విజయవాడ
బీటెక్‌: ఈఈఈ
మార్కులు: 9.27 (సీజీపీఏ)

నాన్న ఆదినారాయణ ఇత్తడి బిందెలు తయారు చేస్తుంటారు. అమ్మ హైమావతి గృహిణి. ప్రస్తుతం ఎన్‌ఐటీ తిరుచిరాపల్లిలో మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ చేస్తున్నాను. సమయాన్ని ఎప్పుడూ వృథా చేసుకోకూడదు. మనల్ని మనం నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. చేసే ప్రతీ పనినీ ఆనందంగా చేయాలి. ముఖ్యంగా ఎంత బాగా చేయగలమో గుర్తించి శక్తివంచన లేకుండా లక్ష్య సాధనకు కృషిచేయాలి.

ఆస్వాదిస్తూ చదవాలి

కొమ్మన సాయిరామ్‌కుమార్‌,
ఒంగోలు, ప్రకాశం జిల్లా
బీటెక్‌: ఈసీఈ
మార్కులు: 9.09 (సీజీపీఏ)

నాన్న మల్లికార్జునరావు ప్రైవేటు ఉద్యోగి. అమ్మ తులసీదేవి గృహిణి. గేట్‌లో ఆలిండియా 35వ ర్యాంకు వచ్చింది. అప్పుడే సబ్జెక్టులు కూడా చదివాను. ఆఖరులో చదువుదామని కాకుండా ఎప్పటికప్పుడు చదవడంతో ఇది సాధ్యమైంది. క్యాంపస్‌లో మూడు కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా చేస్తున్నాను. సివిల్స్‌ చేయాలనేది నా లక్ష్యం. ఇక సిద్ధమవ్వాలి. పుస్తకాలకే పరిమితం కాకుండా జీవితాన్ని ఆస్వాదిస్తూ చదవాలి.

సాధించాలనే పట్టుదలతో..

పి.వినయ్‌కుమార్‌, కాకినాడ
బీటెక్‌: సీఎస్‌ఈ
మార్కులు: 9.1 (సీజీపీఏ)

నాన్న సత్తిబాబు రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అమ్మ వెంకటలక్ష్మి గృహిణి. డిప్లొమో చేసి ఇంజినీరింగ్‌ చదువుతున్నాను. ఈసెట్‌లో మూడో ర్యాంకు వచ్చింది. చిన్నప్పటి నుంచి కంప్యూటర్‌ సైన్స్‌ అంటే ఇష్టం. సమాజానికి మన చదువు ఏ విధంగా ఉపయోగపడుతుందో కళాశాల అధ్యాపకులు బోధించిన తీరుతో ఆలోచనలో పడ్డాను. అలా సివిల్స్‌పై ఆసక్తి కలిగింది. ప్రాంగణ ఎంపికల్లో నాలుగు కంపెనీల నుంచి అవకాశాలు వచ్చాయి. అయినా సివిల్సే లక్ష్యంగా ఎంచుకున్నాను. తద్వారా ప్రజలకు సేవచేసే అవకాశం కలుగుతుంది.

తల్లిదండ్రులను బాగా చూసుకుంటా..

యనమదల భార్గవి,
కాకినాడ
బీటెక్‌: సివిల్‌ ఇంజనీరింగ్‌
మార్కులు: 9.05 (సీజీపీఏ)

నాన్న చినవీరభద్రరావు ఆటోడ్రైవర్‌, అమ్మ సత్యభవాని గృహిణి. డిప్లమో చేయడంతో మొదటి నుంచి సివిల్‌ అంటే ఆసక్తి పెరిగింది. అదే ఆసక్తితో ప్రణాళికతో కష్టపడి చదివాను. ప్రస్తుతం గుజరాత్‌లోని ఎల్‌అండ్‌టీలో ఉద్యోగం చేస్తున్నాను. తల్లిదండ్రులు నన్ను ఎంతో కష్టపడి చదివించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి వారిని బాగా చూసుకోవాలి.

ఎ.శివసాయిరాజా, తుని
బీటెక్‌: సివిల్‌ ఇంజనీరింగ్‌
మార్కులు: 9.22 (సీజీపీఏ)

నాన్న నాగేశ్వరరావు వ్యవసాయం చేస్తారు. అమ్మ రాణి గృహిణి. ప్రస్తుతం దిల్లీలోని ఎల్‌అండ్‌టీలో పని చేస్తున్నాను. సొంతంగా నోట్స్‌ తయారు చేసుకుంటూ పరీక్షలకు సిద్ధమయ్యాను. ఏటిమొగలోని ఎస్‌టీపీ లైవ్‌ ప్రాజెక్టు వర్కు చేశాను. ఐఈఎస్‌ చేయాలనేది నా లక్ష్యం. ప్రస్తుతానికి సొంతంగా సిద్ధమవుతున్నాను. అనుభవం వచ్చాక మరింత కష్టపడతా. మార్కుల కోసం కాకుండా సబ్జెక్టు తెలుసుకోవడానికి చదవాలి. అప్పుడే జీవితంలో అభివృద్ధి చెందగలం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని