logo

ఎంత తలవంపులు తెచ్చావు తల్లీ!

‘ఆవేశం ఆపుకోని అమ్మానాన్నదే తప్పా’.. అంటూ ఆకలిరాజ్యం చిత్రంలోని కథానాయకుడు నాటి చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆవేదనాభరితంగా ప్రశ్నిస్తాడు.

Updated : 01 Jun 2023 06:04 IST

 పందుల నోటిలో పురిటి బిడ్డ

అనైతికం మిగిల్చిన అమానవీయం

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిశువు

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే:‘ఆవేశం ఆపుకోని అమ్మానాన్నదే తప్పా’.. అంటూ ఆకలిరాజ్యం చిత్రంలోని కథానాయకుడు నాటి చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆవేదనాభరితంగా ప్రశ్నిస్తాడు. ఆ పసికందుకూ మాటలొస్తే ఆ తల్లి.. ఆమె మాతృమూర్తిని అదే ప్రశ్న అడిగేవాడేమో. ఓ అనైతిక సంబంధం తాలూకు బరువును నవ మాసాలు మోసింది. ఆపై కన్న పేగు బంధాన్ని మరిచి అప్పుడే పుట్టిన పసికందును గోనె సంచిలో కట్టింది. ఆపై తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలోని చెట్టు కింద నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్లింది. ఈ అమానవీయ ఘటన గిద్దలూరులో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గిద్దలూరులో ఓ యువతి తన తల్లితో కలిసి నివాసముంటోంది. ఓ కొరియర్‌ బాయ్‌తో ఏర్పడిన పరిచయం అనైతిక సంబంధానికి దారి తీసింది. చివరికి గర్భం దాల్చి మగ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆమె తల్లి పసికందును ఓ గోనెసంచిలో కట్టి స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో ఉన్న మర్రిచెట్టు కింద వదిలి వెళ్లింది.

రెవెన్యూ సిబ్బందితో కలిసి  సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై అజిత

 పసివాడి ఏడుపుతో

అప్రమత్తం...: చెట్టు కింద గోనెసంచిలో శిశువు పడి ఉన్న విషయాన్ని చాలాసేపటి వరకు ఎవరూ గుర్తించలేదు. అక్కడే సంచరిస్తున్న పందులు పసికందు ఉన్న గోనె సంచిన నోట కరిచి తీసుకెళ్తుండగా ఏడుపు వినిపించింది. దీంతో తహసీల్దార్‌ కార్యాలయం సిబ్బంది అప్రమత్తమయ్యారు. వీఆర్వోలు వై.పి.రంగయ్య, అరిగెల వెంకటరామయ్య, అక్బర్‌అలీలు హుటాహుటిన అక్కడికి చేరుకుని పందులను అదిలించి గోనె సంచిని పరిశీలించారు. అందులో పసిబిడ్డ ఉండటాన్ని గుర్తించి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆర్‌ఎంవో రమణారెడ్డి తెలిపారు.

* ఓ యువతి.. ఆమె తల్లిగా గుర్తింపు...: సమాచారం అందుకున్న గిద్దలూరు మహిళా ఎస్సై అజిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిశువును పరిశీలించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఆనంతరం సచివాలయ మహిళా కానిస్టేబుళ్లతో కలసి తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి పరిశీలించారు. కార్యాలయం వెనుక వైపు రైల్వే స్టేషన్‌ రహదారిలో ఓ ఇంటి ఎదుట సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను తిలకించారు. ఓ మహిళ రైల్వేస్టేషన్‌ రహదారి మీదుగా గోనె సంచితో వెళ్తుండటాన్ని గుర్తించారు. రాచర్ల గేట్‌ ప్రాంతంలో నివాసముండే ఓ మహిళగా గుర్తించారు. యువతి, ఆమె తల్లి బుధవారం సాయంత్రం గిద్దలూరులోని పాములపల్లె గేటు వద్ద సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. యువతిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని