logo

రైతులకు రూ.213.08 కోట్ల ప్రయోజనం

అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళలా అండగా నిలుస్తోందని పురపాలక శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

Published : 02 Jun 2023 05:45 IST

రైతులకు చెక్కు అందజేస్తున్న మంత్రి సురేష్‌, కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ వెంకాయమ్మ,మేయర్‌ సుజాత తదితరులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళలా అండగా నిలుస్తోందని పురపాలక శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకం కింద 2023-24 సంవత్సర కాలానికి మొదటి విడత ఆర్థికసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన చెక్కును ఒంగోలులోని పాత జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయాభివృద్ధి, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. కీలకమైన వెలిగొండ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాదే పూర్తి చేస్తామన్నారు. కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 2023-24 సంవత్సరానికి మొదటి విడతగా జిల్లాలోని ఒక్కో రైతు కుటుంబానికి రూ.7,500 చొప్పున 2,84,113 కుటుంబాలకు రూ.213.08 కోట్ల మేర ప్రయోజనం చేకూరినట్టు వివరించారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 34 వేల ఎకరాల చుక్కల భూములకు విముక్తి లభించినట్టు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఓఎంసీ మేయర్‌ గంగాడ సుజాత, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ ఆళ్ల రవీంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ అధికారిణి బేబిరాణి, ఏపీఎంఐపీ పీడీ రవీంద్రబాబు, జిల్లా ఉద్యానశాఖ అధికారి గోపీచంద్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాయితీపై అందించనున్న ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాల ప్రదర్శనను వీక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని