logo

అబ్బే.. అదేమీ పెద్ద విషయం కాదు

తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వైకాపా సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి పిలుపొచ్చింది. దీంతో ఆయన గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో భేటీ అయ్యారు.

Updated : 02 Jun 2023 13:09 IST

‘ప్రొటోకాల్‌’పై బాలినేని స్పందన

ముఖ్యమంత్రితో ముగిసిన రెండోసారి భేటీ

సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి పుష్పగుచ్ఛం అందిస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు:

తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వైకాపా సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి పిలుపొచ్చింది. దీంతో ఆయన గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాను ఆశించినట్టు భరోసా లభించిందా లేదా అనే విషయాలు స్పష్టత లేకున్నాయి. అయితే సమావేశం మాత్రం సానుకూలంగా సాగినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో స్థానం కోల్పోయినప్పటి నుంచి చోటుచేసుకుంటున్న ఘటనలతో బాలినేని తీవ్ర నైరాశ్యానికి లోనయ్యారు. ఆయనతో పాటు వియ్యంకుడైన కుండా భాస్కర్‌రెడ్డిపై వచ్చిన ఆర్థిక ఆరోపణలతో బాలినేని కలత చెందారు. ఈ క్రమంలోనే చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల వైకాపా సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం తనపై వస్తున్న ఆరోపణలు, సొంత పార్టీ వారే కుట్రలు చేస్తున్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు. అప్పట్లో ఆయన తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్‌తో ఓసారి సమావేశమయ్యారు. పార్టీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తూ ప్రకటించిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం కోరినప్పటికీ ససేమిరా అన్నారు. నాటి నుంచి ఒంగోలు నియోజకవర్గంలో కార్యక్రమాలకే పరిమితమయ్యారు. ఈక్రమంలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డితో గురువారం మరోసారి బాలినేని భేటీ అయ్యారు. ప్యాలెస్‌లోకి వెళ్లి తిరిగి బయటికి వచ్చేందుకు దాదాపు రెండు గంటల సమయం పట్టినట్టు తెలిసింది. సమావేశం అంతా ముఖాముఖి సాగిందని.. కీలక అంశాలపై చర్చ సాగినట్టు సమాచారం. అనంతరం బయటికి వచ్చిన బాలినేని అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ మార్పు అన్నది ప్రచారం మాత్రమే. ప్రొటోకాల్‌ అనేది పెద్ద విషయమే కాదు’ అని వ్యాఖ్యానించారు. జిల్లాలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు ఇతర విషయాలపై సీఎంతో చర్చించానని తెలిపారు. ప్రాంతీయ సమన్వయకర్త పదవికి తాను గతంలోనే రాజీనామా చేశానని, మాట్లాడటానికి ఇంకేముంటుందని అన్నారు. నియోజకవర్గంపై దృష్టిపెట్టాలని జగన్‌ సూచించారని.. అభివృద్ధి పనులపై కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు.

‌ 25లోపు ఒంగోలుకు సీఎం...: ప్రాంతీయ సమన్వయకర్త పదవికి బాలినేని రాజీనామా చేసి నెల రోజులు కావొస్తోంది. అయినప్పటికీ ఆ పదవిని వైకాపా అధిష్ఠానం ఇతరులకు కట్టబెట్టలేదు. ఎంపీ విజయసాయిరెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగినప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. రెండోసారి భేటీలోనూ సమన్వయకర్త పదవిలో కొనసాగేందుకు బాలినేని అంగీకరించ లేదని సమాచారం. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిసారించి, జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని ఆయన సీఎంతో అన్నట్టు తెలిసింది. ఒంగోలు ప్రజలకు యరజర్ల కొండల్లో ఇవ్వాలనుకున్న జగనన్న ఇళ్లపట్టాలను కోర్టు కేసుల కారణంగా పంపిణీ చేయలేకపోయారు. వీరికి ఈ నెలలో పట్టాలు పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీలోపు లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడితే తాను హాజరవుతానని సీఎం సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే వెంగముక్కపాలెం, ఎన్‌.అగ్రహారం వద్ద సేకరించిన భూములకు సంబంధించి కొంతమంది రైతులకు ప్రభుత్వం నగదు జమ చేసింది. మరికొందరికి ఇవ్వాల్సి ఉంది. పరిహారం అందజేస్తే ఈ నెల 25వ తేదీలోపు ముఖ్యమంత్రి జగన్‌ ఒంగోలు వస్తారని సమాచారం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు