logo

ఎండిన తోటలు.. గుండెల్లో దిగులు

జిల్లాలో కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, త్రిపురాంతకం, తాళ్లూరు, కంభం,  కొండపి, ఒంగోలు, సంతనూతలపాడు గిద్దలూరు, దర్శి ప్రాంతాల్లో 1520 హెక్టార్లలో  బత్తాయి సాగవుతోంది. ప్రతి వేసవిలో వచ్చే కాపుతోనే రైతులు నాలుగు డబ్బులు వెనకేసుకుంటారు.

Published : 02 Jun 2023 05:45 IST

వడగాలులతో దెబ్బతిన్న బత్తాయి
‌పెట్టుబడీ రాని దీనస్థితి
‌ప్రభుత్వం కొనుగోలుచేస్తేనే గట్టెక్కేది

వెలిగండ్లలో ఎండిపోయిన బత్తాయి చెట్టు

జిల్లావ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో బత్తాయి తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. నీటి తడులు అందక చెట్లు మాడిపోయి రైతులు కుంగిపోతున్నారు. భూగర్భ జలాలు అడుగంటి.. కాయ నాణ్యత దెబ్బతిన్న పరిస్థితుల్లో ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను   ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

కనిగిరి, న్యూస్‌టుడే: జిల్లాలో కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, త్రిపురాంతకం, తాళ్లూరు, కంభం,  కొండపి, ఒంగోలు, సంతనూతలపాడు గిద్దలూరు, దర్శి ప్రాంతాల్లో 1520 హెక్టార్లలో  బత్తాయి సాగవుతోంది. ప్రతి వేసవిలో వచ్చే కాపుతోనే రైతులు నాలుగు డబ్బులు వెనకేసుకుంటారు. అయితే ఈ ఏడాది తీవ్ర వర్షాభావం, పైగా ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి చెట్లకు నీరందలేదు. ఈ బెట్ట పరిస్థితుల్లో తోటలను కాపాడుకునేందుకు 700 అడుగుల లోతులో బోర్లు వేసినా  నీళ్లు పడ లేదు. దీంతో పంటను ఎలా రక్షించుకోవాలో తెలియక అన్నదాతలు దిగాలు చెందుతున్నారు.

ఓ పక్క బెట్ట.. మరోవైపు రేటు లేక..

తీవ్ర వర్షాభావంతో తెగుళ్లు సోకి..

జిల్లావ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు పడుతున్నా బత్తాయిని అధికంగా సాగు చేసే పశ్చిమ ప్రకాశంలో మాత్రం చిరు జల్లులు కూడా పడలేదు. దీంతో బెట్ట పరిస్థితులు ఏర్పడి కాయలు వాడిపోతున్నాయి. వాస్తవంగా వేసవిలో బత్తాయికి మంచి రేటు ఉంటుంది. పశ్చిమ బంగ, కర్ణాటక, దిల్లీ, మహారాష్ట్రతో పాటు పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌కు అధికంగా ఎగుమతి అవుతుంటాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెల మొదటి వారం వరకు కాయలు పక్వానికి వచ్చి మంచి రేటు పలికాయి. అక్కడి నుంచే పరిస్థితి తల్లకిందులైంది. ఒక్కసారే ఎండలు మండిపోవడంతో కాయ సైజు తగ్గిపోయింది. కొన్నిచోట్ల చెట్లకే వాడిపోయి రసం తగ్గిపోయింది. దీంతో కాయ నాణ్యత లేదంటూ వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపలేదు. రేటు కూడా భారీగా తగ్గిపోయింది. వాస్తవంగా మే నెలలో టన్ను రూ. 40వేలు పలకాల్సిన బత్తాయి ప్రస్తుతం రూ. 25 వేలకు మించి రావడం లేదు. అసలే అప్పులు చేసి చెట్లను కాపాడుకున్నామని, రేటు కూడా లేకపోతే ఎలా బతకాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు తెగుళ్లు కూడా సోకుతున్నాయని వారంటున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు కల్పించాలని  కోరుతున్నారు.

కొనుగోలు చేయడం లేదు

కనిగిరిలో గిడసబారి సైజు తగ్గిన బత్తాయి

ప్రస్తుత ఎండల వల్ల బత్తాయి చెట్లు బెట్టకు వచ్చాయి. నేను 15 ఎకరాల్లో సాగు చేశా. ఎకరాకు సుమారు రూ. 50 వేలకు పైగానే పెట్టుబడి పెట్టా. వాస్తవంగా మే నెలలో టన్ను ధర రూ. 40 వేలకు పైగా ఉంటుంది. ఈ సారి కాయ గిడస బారిపోవడం, నీటి శాతం తగ్గడంతో రేటు తగ్గించేశారు. కాయ పరిమాణం సరిగ్గా లేకపోవడంతో వ్యాపారులు కొనుగోలు చేయలేదు. ప్రభుత్వమే స్పందించి రైతుల నుంచి కొనుగోలు చేసి ఆదుకోవాలి.
- గురవారెడ్డి, రైతు వెలిగండ్ల

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు