logo

మనిషిని పంపారు.. శవాన్ని ఇస్తున్నాం

‘మీ పిల్లాడిని మా వద్దకు పనికి పంపారు. అనుకోని ప్రమాదంలో అతను మరణించాడు. మీరు మావద్దకు పిల్లాడ్ని పంపితే మీకు మేము అతని శవాన్ని ఇస్తున్నాం.

Published : 03 Jun 2023 02:21 IST

ఇంటి వద్ద రహదారిపై మృతదేహం
ముటుకులలో కలకలం రేపిన ఉదంతం

శ్రీను(పాత చిత్రం)

పుల్లలచెరువు, న్యూస్‌టుడే: ‘మీ పిల్లాడిని మా వద్దకు పనికి పంపారు. అనుకోని ప్రమాదంలో అతను మరణించాడు. మీరు మావద్దకు పిల్లాడ్ని పంపితే మీకు మేము అతని శవాన్ని ఇస్తున్నాం. అందువల్ల మీ ముఖం చూడలేక ఇలా వదిలి వెళ్తున్నాం. మట్టి ఖర్చులకు అవసరమైన రూ.35 వేలు ఇక్కడ పెట్టాం. పిల్లల బాధ్యతను కూడా ఎంతోకొంత మేం తీసుకుంటాం...’ ఇదీ ఆ కుటుంబానికి లభించిన లేఖ. అసలింతకీ పనికి తీసుకెళ్లింది.. శవాన్ని వదిలి వెళ్లింది ఎవరనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ రేకెత్తుతున్నాయి.

ఎవరు వాళ్లు...: అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఇంటి వద్దకు తీసుకెళ్లి వదిలిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చింది.. పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న శ్రీను ఉదంతం. బేల్దారీ పని కోసం అంటూ ఆ గ్రామానికి చెందిన ఉప్పు శ్రీను(35)ను కొందరు ఇటీవల తీసుకెళ్లారు. వాళ్లెవరో, ఎక్కడికో తల్లిదండ్రులకు కూడా తెలియదు. చివరికి అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులెవరో కారులో వచ్చి ఓ మృతదేహాన్ని ఇంటి ఎదుట రహదారిపై పడేసివెళ్లారు. దీంతోపాటు కొంత నగదు, ఒక లేఖ అక్కడ లభించాయి. ఈ సంఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ప్రమాదవశాత్తు మృతి చెందాడా.; ఎవరైనా హత్య చేసి శవాన్ని తీసుకొచ్చి ఇంటి వద్ద పడేశారా అనే అనుమానాలు అందరినీ వెన్నాడున్నాయి.

ఇంటికి వస్తున్నానని చెప్పి.. విగతజీవిగా...: శ్రీను కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొద్ది రోజుల క్రితం తాను పనులకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు తెలిపి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం తన తల్లికి ఫోన్‌ చేసి చేసిన పనికి సంబంధించిన డబ్బులు రెండు రోజుల్లో వస్తాయని తాను.. ఇంటికి వస్తానని తెలిపాడు. కన్న కొడుకు ఇంటికి వస్తాడనే అశతో ఆ తల్లి ఎదురు చూస్తోంది. ఇంతలో గురువారం అర్ధరాత్రి సమయంలో కొందరు వ్యక్తులు తెల్ల కారులో వచ్చి ఒక దుప్పటి మూటను ఇంటి ఎదుట రహదారిపై పడేశారు. అదే సమయంలో కారు శబ్దం విని అదే వీధిలో ఇళ్ల ఎదుట నిద్రిస్తున్న కొందరు వ్యక్తులు లేచి చూశారు. అంతలోనే కారును వేగంగా వెనక్కు తిప్పుకొని వెళ్లిపోయారు. మూట ఏమిటని తెరిచి చూసినవారికి అందులో మృతదేహం కనిపించింది. ఇంటి యజమాని లింగాలును లేపి చూపగా అది తమ కుమారుడిగా గుర్తించారు.

మృతదేహం పక్కన రూ. 35 వేలు...: శ్రీను శవం పక్కన ఒక కవర్‌లో రూ. 35,000, ఒక లేఖను స్థానికులు గుర్తించారు. విషయాన్ని వీఆర్వో కృష్ణకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్సై శ్రీహరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ప్రమాదమా.. హత్యా..!: అనూహ్యంగా, అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇతని ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవటంతో భార్య తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి శ్రీను తల్లితోనే కలిసి ఉంటూ పనులకు వెళ్తున్నాడు. చివరికి ఇలా శవమై కనిపించాడు. ప్రమాదవశాత్తూ మృతి చెందాడా.; ఎవరైనా హత్య చేసి శవాన్ని తీసుకొచ్చి ఇంటి వద్ద పడేశారా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ మృతదేహాన్ని స్వగ్రామంలో పడేసి వెళ్లింది ఎవరనేది తేలితే మృతి వెనుక మిస్టరీ వీడే అవకాశం ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు