బంగారు గొలుసుల చోరీ ముఠా అరెస్టు
వరండాల్లో నిద్రిస్తున్న మహిళల మెడలోంచి బంగారు గొలుసులు చోరీ చేసే ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రామరాజు, సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్‌ఐలు కృష్ణపావని, ప్రసాద్
కనిగిరి, న్యూస్‌టుడే: వరండాల్లో నిద్రిస్తున్న మహిళల మెడలోంచి బంగారు గొలుసులు చోరీ చేసే ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల వీరారెడ్డిపల్లిలో ఈ తరహా దొంగతనానికి పాల్పడిన ముగ్గురు పాత నేరస్థులను కనిగిరి, హనుమంతునిపాడు, పీసీపల్లి పోలీసులు స్థానిక గుడిపాటిపల్లి వెళ్లే రోడ్డులో శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి 20 గ్రాముల బరువున్న రూ. లక్ష విలువచేసే బంగారు గొలుసుతో పాటు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో డీఎస్పీ రామరాజు వివరాలు వెల్లడించారు. పొదిలి గ్రామానికి చెందిన పొన్నర్సు అంజయ్య, పొన్నర్సు నరేష్, పొన్నర్సు ఏసుదాసు పాత నేరస్థులు. వీరు ఆధార్ కార్డులో ఇంటి పేర్లు మార్చుకుని పిల్లులను పట్టుకుని జీవిస్తున్నట్లు నటించి దొంగతనానికి అనువైన ఇంటిని గుర్తిస్తారు. అనంతరం రాత్రి వేళ వచ్చి చోరీ చేసి ఉడాయిస్తారు. గత నెల 26 రాత్రి హనుమంతునిపాడు మండలం వీరారెడ్డిపల్లిలోని ఇంటి వరండాలో నిద్రిస్తున్న ఉడుమల ఆదిలక్ష్మమ్మ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో ద్విచక్ర వాహనంపై ముగ్గురు పరారయ్యారు. దీంతో ఆమె మెడ వద్ద గాయమైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మూడు బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరు పర్చినట్లు చెప్పారు. వీరిపై గతంలో పలు దొంగతనాల కేసులున్నాయి. కేసును త్వరితగతిన ఛేదించిన కనిగిరి సీఐ శివరామకృష్ణారెడ్డి, హనుమంతునిపాడు, కనిగిరి, పీసీ పల్లి ఎస్‌ఐలు జి.కృష్ణపావని, దాసరి ప్రసాద్, ఎ.నాగేశ్వరరావులను ప్రత్యేకంగా అభినందించారు.
అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య
రత్తయ్య(పాత చిత్రం)
యర్రగొండపాలెం, న్యూస్‌టుడే: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వై.పాలెం మండలం కొలుకులలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రైతు ఒంటేరు రత్తయ్య(59) తనకున్న ఎకరాన్నర పొలంతో పాటు పక్కనే ఉన్న మరో అయిదెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట సాగు చేశారు. మూడేళ్లుగా నష్టాలే తప్ప పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు. దీంతో తెలిసిన వాళ్ల వద్ద, బంధువుల దగ్గర సాగు కోసం చేసిన అప్పులు రూ.13 లక్షలకు చేరాయి. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో ఎలా తీర్చాలో అతనికి దిక్కుతోచలేదు. గురువారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రత్తయ్యకు భార్య గంగాదేవి, ఇద్దరు కుమారులున్నారు.
నవ వధువు బలవన్మరణం
కొత్తపట్నం, న్యూస్‌టుడే: కొత్తపట్నం మండలం రెడ్డిపాలేనికి చెందిన నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వైష్ణవి(19)కి లింగసముద్రం మండలం యర్రారెడ్డిపాలేనికి చెందిన భాస్కర్‌రెడ్డితో పద్దెనిమిది రోజుల క్రితమే వివాహమైంది. ఇటీవల పుట్టింటికి వచ్చిన ఆమె... శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం
ఏడుకొండలు (పాత చిత్రం)
చీమకుర్తి, న్యూస్‌టుడే: పొలానికి నీరు పెట్టి, మోటారు స్విచ్ ఆపే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందాడు. చీమకుర్తి మండలం బి.నాయుడుపాలెంలో శుక్రవారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గామానికి చెందిన దద్దాల ఏడుకొండలు (43) పంట పొలానికి నీరు పెట్టేందుకు శుక్రవారం సాయంత్రం వెళ్లారు. పైరుకుని నీరు పెట్టడం పూర్తయ్యాక మోటారు స్విచ్ ఆపే క్రమంలో విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలోని వారు గుర్తించి వెంటనే ఆయనను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య గంగమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక తమకు దిక్కెవరంటూ కుటుంబీకులు రోదించిన తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. ఎస్సై జి.రామిరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పరీక్షకు పంపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ... చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు నగరం మంగమూరు రోడ్డులోని సరస్వతి డిగ్రీ కళాశాల సమీపంలో నివాసముంటున్న కందుకూరి పార్వతి (45)... గురువారం సాయంత్రం, కుండీలో చెత్త వేసేందుకు రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఆమెను బలంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు వెంటనే వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి ఆమె మృతి చెందారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు శుక్రవారం నమోదు చేశారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన కారును గుర్తించి సీజ్ చేశారు. ఎస్సై అంకమ్మ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/09/2023)
-
SAFF U19 Championship: నేపాల్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్‌తో ఢీ
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్