logo

మనోళ్లు ఎవరైనా ఉన్నారా!

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా పహనాగ స్టేషన్‌ సమీపంలో శుక్రవారం రాత్రి  ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన జిల్లాలోనూ తీవ్ర కలకలం రేపింది. మూడు రైళ్లు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఇప్పటికీ 288 మంది ప్రాణాలు అనంత వాయువుల్లో కలిశాయి.

Updated : 04 Jun 2023 05:35 IST

రోజంతా ఎడతెగని ఉత్కంఠ
యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో 31 మంది
‌ఉమ్మడి జిల్లా వాసులంతా సురక్షితం
‌ఎక్కడికక్కడ హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు:ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే:ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా పహనాగ స్టేషన్‌ సమీపంలో శుక్రవారం రాత్రి  ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన జిల్లాలోనూ తీవ్ర కలకలం రేపింది. మూడు రైళ్లు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఇప్పటికీ 288 మంది ప్రాణాలు అనంత వాయువుల్లో కలిశాయి. ఏడు వందల మందికి పైగా ప్రయాణికులు క్షతగాత్రులయ్యారు. భారతీయ రైల్వే చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన అందరినీ కలవరానికి గురిచేసింది. తమ బంధువులు ఎవరైనా ఉన్నారేమోనన్న ఆందోళనతో పలువురు ఇతర ప్రాంతాల్లోని బంధుమిత్రులకు ఫోన్లు చేసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమవారెవరు లేరని.. ఉన్న కొందరు సురక్షితం అని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు.

‌తొలుత తీవ్ర కలకలం...: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, యశ్వంత్‌పూర్‌ - హావ్‌డా, గూడ్స్‌ రైలు ఢీకొన్న ఘోర దుర్ఘటనలో జిల్లాకు చెందిన వారు కూడా ఉన్నారంటూ తొలుత ప్రచారం సాగింది. ఈ సమాచారం అంతరినీ తీవ్ర కలకలానికి గురిచేసింది. వాస్తవానికి హావ్‌డా నుంచి చెన్నై వెళ్లే కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒంగోలులో ఆగదు. దీంతో అటువైపు నుంచి వచ్చే రైలులో జిల్లా వాసులు ఉండే అవకాశం తక్కువ. కోరమాండల్‌కు చెన్నై నుంచి హావ్‌డా వెళ్లే మార్గంలో మాత్రమే ఒంగోలులో ఆగుతుంది. ఈ తెలుసుకున్న పలువురు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు.    ఈ దుర్ఘటనలో యశ్వంత్‌పూర్‌ - హావ్‌డా రైలు కూడా ప్రమాదానికి గురైంది. ఇందులో ఒంగోలు నుంచి 13 మంది, చీరాల నుంచి 18 మంది వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు రిజర్వేషన్‌ చేసుకున్నారు. చీరాల వాసుల్లో ఆరుగురు కోల్‌కతా వెళ్లి వస్త్రాలు కొనుగోలు చేసి వ్యాపారం చేస్తుంటారు. ప్రమాద సమయంలో వీరు ప్రయాణిస్తున్న బోగీ మధ్యలో ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన వారు కూడా క్షేమంగా ఉన్నట్టు ఒంగోలు జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శ్రీకాంత్‌బాబు తెలిపారు.

ఆ ఒక్కడిపై ఉలికిపాటు...

సింగరాయకొండ నుంచి టికెట్‌ తీసుకున్న కార్తిక్‌ అనే వ్యక్తి అదేరోజు ఒంగోలులో రైలు ఎక్కారు. ఇతను ఎం3-2లో బెర్త్‌ నెంబర్‌ 15లో ప్రయాణం చేశారు. దీంతో ఇతను ప్రమాదానికి గురైనట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైంది. అయితే అతను ప్రమాదానికి ముందే రైలు నుంచి దిగి రోడ్డు మార్గంలో ఇంటికి చేరుకున్నట్టు తమకు సమాచారం ఉందని ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌బాబు వెల్లడించారు. ఇదే రైలులో మరోవ్యక్తి ఒంగోలు నుంచి టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నట్టు ఉన్నప్పటికీ అతను చివరి నిమిషంలో రద్దు చేసుకుని ప్రయాణం చేయలేదని అధికారులు తెలిపారు. హావ్‌డా నుంచి చెన్నై వెళ్లే కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో జిల్లా వాసులు ఎవరూ ఉండే అవకాశం లేదని, అయినప్పటికీ అందులోని ప్రయాణికుల వివరాలు కూడా సేకరిస్తున్నామన్నారు.


వివరాలు తెలిస్తే తెలపండి...

ఒంగోలు రైల్వే స్టేషన్‌లో ఏర్పాటుచేసిన హెల్ప్‌డెస్క్‌

ఘోర రైలు ప్రమాదంలో మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలుసుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రత్యేక హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశారు. ఎవరి బంధువులు, స్నేహితులు మరణించినా.. ఆచూకీ తెలియకున్నా వారి సమాచార అందజేయాలని కోరుతున్నారు. ఒంగోలు రైల్వేస్టేషన్‌లో  24/7 పనిచేసేలా ఉద్యోగులను నియమించారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని