logo

గుప్త నిధుల ముఠా పనేనా!

ఉదయగిరి దుర్గం కొండపై ఓ ముఠా గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా గత నెల 31న దుర్గం కొండపై ఉన్న చిన్న మసీదు ప్రాంతంలో తవ్వకాలు చేపట్టింది.

Published : 04 Jun 2023 04:29 IST

ఉదయగిరి దుర్గంపై తవ్వకాలు
పేలుడు సమయంలో మృత్యువాత
శవాన్ని మూటగట్టి వదిలిన దుండగులు

ఉప్పు శ్రీను (పాత చిత్రం)

పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలో గురువారం  అర్ధరాత్రి చోటుచేసుకున్న ఉప్పు శ్రీను(35) ఉదంతం అందరినీ కలవరపాటుకు గురిచేసింది. గుర్తుతెలియని వ్యక్తులు అతని మృతదేహాన్ని మూటగట్టి కారులో తెచ్చి ఇంటి ఎదుట రహదారిపై వదిలి వెళ్లారు. ఈ సంఘటన అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఇంటి వద్దకు తీసుకెళ్లి వదిలిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చింది. దీంతో ఘటనపై అనుమానాలు రేకెత్తాయి. ఓ గుప్త నిధుల ముఠా పనిగా ఇప్పుడు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

ఉదయగిరి, పుల్లలచెరువు- న్యూస్‌టుడే:ఉదయగిరి దుర్గం కొండపై ఓ ముఠా గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా గత నెల 31న దుర్గం కొండపై ఉన్న చిన్న మసీదు ప్రాంతంలో తవ్వకాలు చేపట్టింది. ఇందులో పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామానికి చెందిన ఉప్పు శ్రీను కూడా ఉన్నారు. తవ్వకాల్లో భాగంగా బాంబులను పేల్చారు. ఈ సమయంలో శ్రీను ఆ ప్రదేశానికి సమీపంలో ఉండటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో ముఠా సభ్యులు అతని మృతదేహాన్ని మూటకట్టి గుట్టుచప్పుడు కాకుండా ఈ నెల ఒకటో తేదీ అర్ధరాత్రి కారులో అతని స్వగ్రామమైన ముటుకులకు తీసుకెళ్లారు. అతని ఇంటి ఎదుట శవాన్ని పడేసి కారును వేగంగా వెనక్కి మళ్లించుకుని పారిపోయారు.

*సంఘటనా స్థలానికి పోలీసులు..: మూటను ఇంటి వద్ద పడేసి కారు వేగంగా వెళుతున్న విషయాన్ని అదే వీధిలో నిద్రిస్తున్న కొందరు గమనించారు. తెరిచి చూడగా అందులో మృతదేహం కనిపించింది. ఇంటి యజమాని లింగాలును నిద్రలేపి చూపగా తన కుమారుడు శ్రీనుగా గుర్తించారు. మూటతో పాటు అందులో రూ. 35 వేల నగదు, ఓ లేఖ కనిపించింది. ఆ లేఖలో ‘మీ పిల్లాడిని మావద్దకు పనికి పంపారు. పని చేసే క్రమంలో ప్రమాదవశాత్తు మీ కుమారుడు చనిపోయాడు. మాకు కూడా గాయాలయ్యాయి. మట్టి ఖర్చుల కోసం రూ. 35 వేలు ఇస్తున్నాం. పిల్లల బాధ్యతను కూడా ఎంతో కొంత మేం తీసుకుంటాం...’ అని ఉన్నట్లు తెలిసింది. పని కోసమని వెళ్లిన శ్రీను విగతజీవిగా మారటం... అసలు అతను ఎలా చనిపోయారన్న విషయం తెలియకపోవటం.. మూటలో మృతదేహాన్ని కట్టి ఇంటి వద్దకు తెచ్చి ఎవరు   పడేశారనేది అంతుచిక్కకపోవడం.. దీనికితోడు ఇది హత్యా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయం కూడా తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలవరపాటుకు గురయ్యారు. శ్రీను మృతి విషయం సంచలనంగా మారటంతో పుల్లలచెరువు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా శ్రీను ఉదయగిరి కొండపై గుప్తనిధుల తవ్వకాలకు వెళ్లి మృతిచెందినట్లు తెలుసుకున్నారు. పుల్లలచెరువు, పెద్దారవీడు ఎస్సైలు తమ సిబ్బందితో శనివారం ఉదయగిరి వెళ్లారు. అక్కడి సీఐ వి.గిరిబాబు సహకారంతో ప్రమాదం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ముఠాలో ఎవరెవరున్నారే విషయాలపై ముమ్మర విచారణ చేపట్టారు. ఉదయగిరి దుర్గంపై ఉన్న చిన్న మసీదు ప్రాంతానికి ఆదివారం పోలీసుల బృందం వెళ్లనుందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని