logo

మన్ను తింటూ.. ముప్పు తెస్తున్నారు

పశ్చిమ ప్రకాశం వాసుల ఆశాదీపం పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌. ఈ జలాశయానికి సంబంధించిన ఆనకట్ట అర్థవీడు మండలం కాకర్ల వద్ద నిర్మించారు.

Updated : 04 Jun 2023 05:09 IST

వెలిగొండ ఆనకట్ట రహదారి మీదుగా తరలివెళ్తున్న మట్టి ట్రాక్టర్‌

అర్థవీడు, న్యూస్‌టుడే: పశ్చిమ ప్రకాశం వాసుల ఆశాదీపం పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌. ఈ జలాశయానికి సంబంధించిన ఆనకట్ట అర్థవీడు మండలం కాకర్ల వద్ద నిర్మించారు. అసైన్డ్‌ మినహా ఇప్పటికే భూములను సేకరించారు. వీటి పరిరక్షణ బాధ్యతను ప్రాజెక్ట్‌ నీటిపారుదల విభాగం అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. ఈ భూములతో పాటు ఆనకట్ట సమీపంలోని పెద్దవాగు వద్ద ఎర్రమట్టి దిబ్బలు, పొలాలున్నాయి. ఇక్కడ లభించే మట్టి నాణ్యమైనదిగా పేరు. అధికారుల పర్యవేక్షణ అంతగా లేకపోవడంతో ఇప్పుడు ఎర్రమట్టి దొంగలు రెచ్చిపోతున్నారు. జేసీబీ సాయంతో ఇష్టారీతిన తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లకు నింపి విక్రయిస్తున్నారు. దూరాభారాన్ని బట్టి ట్రిప్పునకు రూ. 2 వేల వరకు వసూలు చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. ప్రాజెక్టు ఆనకట్టకు కూతవేటు దూరంలోనే ఈ తతంగమంతా సాగుతున్నప్పటికీ అధికారులు పట్టనట్టు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచి ప్రాజెక్ట్‌ ఆనకట్ట రహదారి మీదుగా మొహిద్దీన్‌పురానికి పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టి తరలించారు. అయినా అడ్డుకున్నవారు కనిపించలేదు. చివరికి స్థానికులు స్పందించి ప్రాజెక్ట్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కదలక తప్పలేదు. ఇదే విధంగా తవ్వకాలు కొనసాగితే ఆనకట్టకూ ముప్పు తప్పదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వెలిగొండ ప్రాజెక్ట్‌ నీటిపారుదల విభాగం జేఈ రమణారెడ్డి మాట్లాడుతూ.. మట్టి తరలిస్తున్నట్టు తెలుసుకుని అడ్డుకున్నట్లు చెప్పారు. తవ్వకాలు చేపట్టిన ప్రాంతాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని