logo

కొంటానని వచ్చి నగలతో పరారీ

కొనుగోలుదారుడిలా వచ్చిన ఓ వ్యక్తి నగలతో ఉడాయించాడు. త్రిపురాంతకంలోని ఓ బంగారు దుకాణంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 04 Jun 2023 05:07 IST

‌త్రిపురాంతకంలో ఘటన

చోరీకి పాల్పడిన వ్యక్తి...సీసీ ఫుటేజీ దృశ్యం

త్రిపురాంతకం, న్యూస్‌టుడే: కొనుగోలుదారుడిలా వచ్చిన ఓ వ్యక్తి నగలతో ఉడాయించాడు. త్రిపురాంతకంలోని ఓ బంగారు దుకాణంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. కొనుగోలుదారులు ఎక్కువగా ఉన్న సమయంలో దుకాణానికి వచ్చిన ఆగంతకుడు... తనకు నగలు కావాలని, తరువాత మళ్లీ వస్తానంటూ వెళ్లిపోయాడు. కాసేపటి తరువాత ముఖానికి మాస్క్‌ వేసుకుని వచ్చాడు. తాను సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగినని... హారాలు చూపాలని అడిగారు. దీంతో దుకాణ యజమాని సుమారు రూ.7 లక్షల విలువైన మూడు హారాలను చూపించి... మిగతా వినియోగదారులతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆగంతకుడు పరిశీలిస్తున్నట్లు నటించి... నగలతో బయటకు పరుగు తీశాడు. అప్రమత్తమైన యజమాని కేకలు వేసి వెంటపడినా... అప్పటికే సిద్ధం చేసుకున్న ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి వివరాలు సేకరించారు.


భక్తులపై తేనెటీగల దాడి

రాచర్ల, న్యూస్‌టుడే : మండలంలోని నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం వద్ద శనివారం మధ్యాహ్నం భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, 107 మంది స్వల్పంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. గాయపడ్డ వారంతా మార్కాపురం, కంభం మండలాలకు చెందిన వారు. వీరిని బంధువులు వాహనాల్లో కంభం, మార్కాపురం ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలించి చికిత్సలు అందించారు.


మరో ముగ్గురు ఎంపీడీవోల బదిలీ

ఒంగోలు గ్రామీణం: జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఎట్టకేలకు బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం రాత్రి 23 మంది ఎంపీడీవోలు బదిలీ కాగా... శనివారం మరో ముగ్గురికి పోస్టింగులు ఇచ్చారు. పి.రత్నజ్యోతి... పొన్నలూరు నుంచి టంగుటూరు; బీజే వండర్‌మెన్‌ చీమకుర్తి నుంచి సంతనూతలపాడు; కె.జలజాక్షి (ఈవోఆర్డీ)... నెల్లూరు నుంచి పదోన్నతిపై జరుగుమల్లికి బదిలీ అయ్యారు. జడ్పీ పరిధిలో మొత్తంగా 11 మంది ఏవోలు, 16 మంది సీనియర్‌... 24 మంది జూనియర్‌ సహాయకులు; 24 మంది రికార్డు అసిస్టెంట్లు, 13 మంది టైపిస్టులు, 35 మంది అటెండర్లను బదిలీ అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని