logo

అధికార ప్రతిపక్షాల కొంఢీపి

అధికార పార్టీ సవాల్‌ విసురుతోంది. ప్రతిపక్షం దీటుగా స్పందిస్తోంది. గత కొన్నిరోజులుగా రాజకీయ వర్గాల్లోనూ విస్తృతంగా చర్చ సాగుతోంది. ఈ కారణంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని అందరికీ తెలుసు.

Updated : 06 Jun 2023 05:32 IST

శాంతిభద్రతల పరిరక్షణలో వైఫల్యం
చేష్టలుడిగిన పోలీసు యంత్రాంగం

గృహ నిర్బంధంలో ఉన్నట్లు ప్రకటించినప్పటికీ కార్యకర్తలనుద్దేశించి బహిరంగంగా మాట్లాడుతున్న వైకాపా  నాయకుడు అశోక్‌బాబు

అధికార పార్టీ సవాల్‌ విసురుతోంది. ప్రతిపక్షం దీటుగా స్పందిస్తోంది. గత కొన్నిరోజులుగా రాజకీయ వర్గాల్లోనూ విస్తృతంగా చర్చ సాగుతోంది. ఈ కారణంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని అందరికీ తెలుసు. మరి పోలీసులు ఏం చేస్తున్నట్లు..? ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు..? ఇవీ ప్రస్తుతం అందరి మదిలో మెదిలే ప్రశ్నలు. ఒక డీఎస్పీ, నలుగురు సీఐలు, పలువురు ఎస్సైలు, రిజర్వ్‌ పోలీసు బలగాలు అందుబాటులో ఉన్నాయి. అయినా కొండపి నియోజకవర్గం టంగుటూరులో ఆందోళనలను అదుపు చేయడంలో నాన్చుడు ధోరణి ఎందుకు వహించినట్టు.? అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

న్యూస్‌టుడే, ఒంగోలు నేరవిభాగం

తూర్పునాయుడిపాలెం నుంచి టోల్‌గేట్‌ వరకు ప్రదర్శనగా వస్తున్న తెదేపా శ్రేణులు

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి చోటుచేసుకుందని ఆరోపిస్తూ.. కొండపి తెదేపా ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామి ఇంటిని చెంబులతో ముట్టడిస్తామని వైకాపా నాయకుడు వరికూటి అశోక్‌బాబు రెండ్రోజుల క్రితం ప్రకటించారు. ఆ విషయమై ఆదివారమంతా ఆ నియోజకవర్గంలోని సామాజిక మాధ్యమాల్లో చర్చ నడిచింది. అధికార పక్షాన్ని సవాల్‌ చేస్తూ తెదేపా కూడా అదేస్థాయిలో ప్రతిస్పందించింది. అయినప్పటికీ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించ లేదు. స్థానిక పోలీసులు ఒక పక్షానికి కొమ్ము కాశారని.. ఉన్నతాధికారులకు అబద్దాలు చెబుతూ విషయంలోని తీవ్రతను తగ్గించి చూపారనే చర్చ సాగుతోంది.

* నిర్బంధిస్తే బయటికెలా వచ్చారో...: అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆందోళనలకు సిద్ధమైన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఒక డీఎస్పీ, నలుగురు సీఐలు, ఇద్దరు రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ డివిజన్‌లోని ఎస్సైలతో పాటు పెద్దసంఖ్యలో పోలీసు సిబ్బంది, స్పెషల్‌ పార్టీని మోహరించారు. అటు అశోక్‌బాబు ఇంటి వద్ద, ఇటు ఎమ్మెల్యే స్వామి ఇంటి వద్ద భారీస్థాయిలో పోలీసులను మోహరించారు. సోమవారం ఉదయాన్నే వరికూటిని గృహ నిర్బంధంలో ఉంచినట్లు పోలీసులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. గృహ నిర్బంధంలో ఉన్న అతను బయటకు ఎలా వచ్చారు., పార్టీ శ్రేణులతో కలిసి టంగుటూరు వీధుల్లో ప్రదర్శన ఎలా నిర్వహించగలిగారనేదే పెద్ద సందేహం.

* ఎమ్మెల్యే చొక్కా ఎలా చిరిగింది...: అటు వైకాపా, ఇటు తెదేపా శ్రేణులు మోహరించాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అశోక్‌బాబుతో పాటు వైకాపా వర్గీయులు టంగుటూరులో., ఎమ్మెల్యే స్వామి నివాసమైన తూర్పునాయుడుపాలెంలో తెదేపా శ్రేణులు పెద్దసంఖ్యలో గుమిగూడారు. వైకాపా వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే స్వామి తన అనుచరులతో కలిసి జాతీయ రహదారి పైకి చేరుకున్నా పోలీసులు వారికి నచ్చజెప్పి నిలువరించే ప్రయత్నం అంతగా చేయలేదు. రహదారి పైకి వెళ్లిన తర్వాత బలవంతంగా అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుని ఎమ్మెల్యే స్వామి చొక్కా చిరిగిపోయింది. తొలుత స్వామిని అరెస్టు చేసిన పోలీసులు, ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో వైకాపా నాయకుడు అశోక్‌బాబును అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కొందరు పోలీసులు వ్యూహాత్మకంగా అధికార పార్టీ నేతలకు సహకరించి ఉద్రిక్తతలు పెరగడానికి సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం ఇలా జరుగుతుండగానే రాయవారిపాలెం గ్రామానికి చెందిన హనుమాయమ్మ దారుణ హత్యకు గురయ్యారు. ట్రాక్టర్‌తో తొక్కించి అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు, సమీప బంధువు కొండలరావు అమెను హత్య చేశాడు.

* సమావేశంలో ఎస్పీ ఆగ్రహం...: టంగుటూరులో ఘటనలు ముగిసిన తర్వాత అక్కడ బందోబస్తు నిర్వహించిన అధికారులతో ఎస్పీ మలికా గార్గ్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముందుగానే యంత్రాంగాన్ని సన్నద్ధం చేసినప్పటికీ శాంతిభద్రతల సమస్య తలెత్తడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

రాయవారిపాలెంలో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

వైకాపాను ప్రజలు తరిమికొడతారు: వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే, కొండపి

ప్రశాంతంగా ఉండే కొండపి నియోజకవర్గంలో వైకాపా నాయకుడు వరికూటి అశోక్‌బాబు ప్యాక్షన్‌ రాజకీయాలను తీసుకొస్తున్నారు. గతంలోనూ ఓసారి నా ఇంటి పైకి దాడికి ప్రయత్నించి పదవి దక్కించుకున్నారు. వరికూటి తీరు నచ్చక ఆ పార్టీ నాయకులే వద్దంటున్నారు. మళ్లీ నా ఇంటి ముట్టడికి పిలుపివ్వడాన్ని మా పార్టీ కార్యకర్తలు సహించలేకపోయారు. పోటీగా కార్యక్రమ నిర్వహణకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నాపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఇప్పటికే పలుమార్లు మాట్లాడాను. విచారణ నివేదికలోనూ క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్టు వైకాపా వాళ్లే చెప్పారు. అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకోవాలని మీ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి చెప్పకుండా మా ఇంటి ముట్టడికి వస్తాననడం సిగ్గుచేటు. రాయవారిపాలేనికి చెందిన సవలం సుధాకర్‌ భార్య హనుమాయమ్మను వైకాపా నాయకుడు కొండలరావు ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేశాడు. ప్రమాదంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసి ఎస్పీకి చరవాణి ద్వారా ఫిర్యాదు చేశా. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరాను. కొండపి ప్రజలు ఈ తరహా పోకడలు భరించరు. రానున్న ఎన్నికల్లో వైకాపాను తరిమికొడతారు.  

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు, టంగుటూరు, న్యూస్‌టుడే


జగనూ..  సమాధానం చెప్పు

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న తెదేపా నేత దేవినేని, ఎమ్మెల్యే స్వామి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాలపై హత్యలను ప్రోత్సహిస్తోంది. అందుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి బాధ్యత వహించాలి. ఈ రోజు టంగుటూరు మండలం రావివారిపాలెంలో చోటుచేసుకున్న హనుమాయమ్మ హత్యకు ఆయనే సమాధానం చెప్పాలి’ అని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఒంగోలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉన్న హనుమాయమ్మ మృతదేహాన్ని కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయస్వామితో కలసి సోమవారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం దేవినేని పాత్రికేయులతో మాట్లాడుతూ.. తూర్పునాయుడుపాలెంలో కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి ఇంటిపై వైకాపా నాయకుడు వరికూటి అశోక్‌బాబు, ఆయన అనుచరులు దాడి చేసేందుకు ప్రదర్శనగా బయలుదేరడం అనైతిక చర్యన్నారు. ఆ విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకే వైకాపా నాయకులు వ్యూహాత్మకంగా హనుమాయమ్మను హత్య చేయించారని ఆరోపించారు. హత్యోందంతంపై సమగ్ర విచారణ చేపట్టి కారకులైన వారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. కొండపి ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ.. హనుమాయమ్మ హత్య కేసులో అనుమానితులందరినీ తక్షణమే అరెస్ట్‌ చేయాలన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో టంగుటూరు మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్‌, తెదేపా మండల అధ్యక్షుడు కామని విజయకుమార్‌ తదితరులున్నారు.

* చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఫోన్‌...: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు; తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కొండపి ఎమ్మెల్యే వీరాంజనేయస్వామికి ఫోన్‌ చేశారు. హనుమాయమ్మ హత్య ఎలా జరిగింది, దాని వెనుక ఎవరి హస్తం ఉంది, వైకాపా నాయకుల ఆధ్వర్యంలో టంగుటూరులో సోమవారం ఉదయం చోటుచేసుకున్న సంఘటనల గురించి ఆరా తీశారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని