logo

542 పోస్టులు బ్లాక్‌

ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో సమస్యలు కొలిక్కి రాలేదు. మరోవైపు పెద్ద సంఖ్యలో పోస్టులు బ్లాక్‌ చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 07 Jun 2023 03:27 IST

సమీప ఖాళీలు కనిపించక ఉపాధ్యాయుల ఆవేదన
‌ఐచ్ఛికాల నమోదుకూ తప్పని అవస్థలు

జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో సమస్యలు కొలిక్కి రాలేదు. మరోవైపు పెద్ద సంఖ్యలో పోస్టులు బ్లాక్‌ చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తుదారులు ఐఛ్చికాలు పెట్టుకునేందుకు ఈ నెల 8 వరకు షెడ్యూలు ఇచ్చారు. ఒక రోజు ఆలస్యంగా సైట్‌ ఓపెన్‌ కావడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. ప్రధానంగా ఎస్జీటీలు పెద్ద సంఖ్యలో ఆప్షన్లు పెట్టుకోవాల్సి రావడంతో... నెట్‌ సెంటర్ల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఎస్జీటీ పోస్టులు పెద్ద సంఖ్యలో బ్లాక్‌ చేయడమూ వారిని నిరాశకు గురిచేసింది. ప్రాధాన్యతా విభాగంలో ఉన్నవారికి సైతం సమీపంలో పోస్టులు కనిపించక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో మండలంలో అయిదు నుంచి ఏడు పోస్టుల వరకు బ్లాక్‌ చేశారు. ఉమ్మడి ప్రకాశంలో 6,066 మంది బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. వారిలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు 3,400 మంది ఉన్నారు. ఆ కేటగిరీ పోస్టులు 482 బ్లాక్‌ చేయగా, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు 60 బ్లాక్‌ చేశారు. ఇన్ని పోస్టులు బ్లాక్‌ చేయడాన్ని పీడీలు సైతం ప్రశ్నిస్తున్నారు.

ఉద్యోగోన్నతులు సరే ఉత్తర్వులేవీ...

జిల్లాలో అర్హులైన సుమారు 600 మంది ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించారు. ఇప్పటికి నాలుగు రోజులైనా వారికి నియామక పత్రాలు ఇవ్వలేదు. ఎస్జీటీలు స్కూలు అసిస్టెంట్లుగా, స్కూలు అసిస్టెంట్లు ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి పొందారు. వారు కూడా పెరిగిన హోదా విభాగంలోనే బదిలీకి దరఖాస్తు చేయాలి. కనీసం పదోన్నతి పొందిన పత్రం చేతికివ్వకుండా బదిలీ దరఖాస్తు ఎలా చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఇతర జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తికాగా ఇక్కడ ఇంకా కొలిక్కి రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని