ఎన్నాళ్లకెన్నాళ్లకు...!
ఏళ్ల నాటి నిరీక్షణ ఫలించింది. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు 65 పీజీ సీట్లు మంజూరు చేస్తూ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఉత్తర్వులిచ్చింది.
వైద్య కళాశాలకు 65 పీజీ సీట్ల మంజూరు
ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఏళ్ల నాటి నిరీక్షణ ఫలించింది. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు 65 పీజీ సీట్లు మంజూరు చేస్తూ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఉత్తర్వులిచ్చింది. గతంలో 19 సీట్లు ఇచ్చినప్పటికీ అవన్నీ నాన్ క్లినికల్ విభాగానివి కావడంతో రోగులకు అంతగా ప్రయోజనం చేకూరలేదు. తాజాగా మంజూరైనవి క్లినికల్ విభాగానికి సంబంధించినవి కావడంతో ఇటు వైద్య విద్యార్థులకు అటు ఆసుపత్రికి వచ్చే రోగులకు మేలు కలగనుంది.
పుష్కరానికి నెరవేరిన కల...
ఒంగోలులో 2011లో వైద్య కళాశాల ప్రారంభమైంది. ఆసుపత్రిలో తగినంత మంది వైద్యులు, అవసరమైన వసతులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఇప్పటివరకు ప్రాధాన్యం కలిగిన సీట్లు మంజూరు కాలేదు. అయిదు పర్యాయాలు నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం పరిశీలన చేసినా సిబ్బంది కొరత వల్ల అనుమతులు రాలేదు. ఆరు నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగోన్నతులు కల్పించడంతో ఇక్కడ ఖాళీగా ఉన్న బోధకుల పోస్టులు భర్తీ అయ్యాయి. ఆ విధంగా దాదాపు పన్నెండేళ్ల తరువాత ప్రాధాన్యం కలిగిన పీజీ సీట్లకు అనుమతి లభించింది. పీజీ విద్యార్థులు అందుబాటులో ఉంటే ఓపీ విభాగంలో నిరాటంకంగా సేవలందించేందుకు వీలు కలుగుతుందని వైద్యాధికారులు చెబుతున్నారు.
ఆగస్టులో ప్రవేశాలు...
పీజీ సీట్లకు ఆగస్టులో ప్రవేశాలు జరగనున్నాయి. సంబంధిత పీజీ నీట్ పరీక్ష మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహిస్తారు. ఇక్కడ చేరే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పిస్తామని వైద్య కళాశాల ప్రిన్సిపల్ సాల్మన్ రాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇప్పటికే వసతి గృహాల నిర్మాణం జరుగుతోంది. ఆగస్టు నాటికి ఇవి పూర్తయ్యే అవకాశం ఉంది. వాటిని నూతనంగా చేరే విద్యార్థులకు కేటాయించనున్నట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.