logo

పత్రం లేదు.. పైసలు ఇవ్వరు

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం మూడేళ్లైనా ఎటూ తేలకుండా పోయింది. ఈ ఏడాది చివరి నాటికి గడువు ముంచుకొస్తున్నా..పథకం నిండా సమస్యలు రాజ్యమేలుతున్నాయి.

Published : 07 Jun 2023 03:27 IST

నాడు వసూలు చేసి.. నేడు పట్టించుకోని అధికారులు
మూడేళ్లుగా లబ్ధిదారుల ఎదురు చూపులు
ఇదీ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం తీరు

అర్థవీడు, న్యూస్‌టుడే: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం మూడేళ్లైనా ఎటూ తేలకుండా పోయింది. ఈ ఏడాది చివరి నాటికి గడువు ముంచుకొస్తున్నా..పథకం నిండా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మూడేళ్ల క్రితం చేపట్టిన ఈ పథకంలో ఓటీఎస్‌ కింద రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలంటూ పూర్వ గృహ నిర్మాణ లబ్ధిదారుల నుంచి నగదు వసూలు చేశారు. వారికి అందాల్సిన రిజిస్ట్రేషన్‌ పత్రాలు సకాలంలో అందక పోగా..ఏవేవో కారణాలతో చెల్లించిన నగదు సైతం వెనక్కి ఇవ్వ లేకపోతున్నారు. 2021 డిసెంబర్‌ 8న ప్రభుత్వం సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రవేశపెట్టి..డిసెంబర్‌ 21 నుంచి రిజిస్ట్రేషన్లు అంటూ హడావుడి చేశారు. ఇందులో రెవెన్యూ, మండల పరిషత్‌, గ్రామ వార్డు సచివాలయ, గృహనిర్మాణ శాఖల అధికారులు సంయుక్తంగా లబ్ధిదారుల నుంచి నగదు వసూలు చేసి..నేడు పట్టించుకోకుండా వదిలేశారు.

పశ్చిమాన ఇలా.. మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి, కనిగిరి నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో ఎక్కువ శాతం నివాస ప్రాంతాలు పట్టా భూముల్లోనే ఉన్నాయి. దీంతో ఓటీఎస్‌ లబ్ధిదారులకు పట్టా భూముల్లో ఇళ్లు, స్థలాలు ఉండటంతో పాటు పూర్వీకుల పేర్లతో..వివాదాల్లో ఉన్న వాటికి కూడా మొదట రిజిస్ట్రేషన్‌ హక్కులు కల్పిస్తామన్న అధికారులు తరువాత చిక్కుముడి వేశారు. లబ్ధిదారులుగా గుర్తించి నగదు చెల్లింపులు చేశాక..ఇలా తిరకాసు పెట్టడంతో సుమారు 5 వేల మందికి పైగా లబ్ధిదారులు పత్రాలు పొందలేక మిన్నకుండి పోయారు. అంతేకాక రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో హక్కు పత్రాల్లో సకాలంలో సంతకాలు చేయక బదిలీపై వెళ్లడం..తరువాత వచ్చిన అధికారులకు సంతకాలు చేసే అధికారం లేకపోవడం వంటి కారణాలతో కూడా ఈ పత్రాలు పొందలేని వారు సుమారు వెయ్యికి పైగా ఉన్నారు.

*పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు పంచాయతీ లోని శివాపురం గ్రామానికి చెందిన నందిరెడ్డి కాశిరెడ్డి రూ.4 వేల నగదు ఓటీఎస్‌ కింద చెల్లించారు. నేటికి అతీగతీ లేదు. ఇలాంటి ఉదంతాలు మండల పరిధిలో పదింటి వరకు వెలుగు చూశాయి.‌్ర గిద్దలూరు పంచాయతీ లోని అంబవరం గ్రామంలో పుష్పలీల అనే మహిళ ఓటీఎస్‌లో రూ.10 వేలు నగదు చెల్లించింది. తీరా రిజిస్టేష్రన్‌ పత్రం వచ్చాక పట్టాదారు పొలంలో ఇంటి నిర్మాణం ఉండటంతో పత్రం మార్పులు చేయాలంటూ ఆమెకు ఇవ్వకుండా నిలిపారు. ఇదే క్రమంలో ఒకరి వద్ద రూ.పది వేలు, మరొకరి నుంచి రూ.5 వేలు నగదు కట్టించుకున్నాక హక్కు పత్రాలు ఒకరికి వచ్చి ఇంకొకరికి ఇవ్వలేదు. ప్రైవేటు స్థలంలో గృహ నిర్మాణాలు అంటూ .కట్టిన నగదు చేతికివ్వలేదు.

జిల్లాలో 61,209 మంది లబ్ధిదారులు..ఓటీఎస్‌ పథకంలో జిల్లాలోని 38 మండలాల పరిధిలో 61,209 మంది లబ్ధిదారులను గుర్తించారు. వారి నుంచి సుమారు రూ.17 కోట్ల నగదును ఓటీఎస్‌ రూపంలో వసూలు చేశారు. అయితే 61,209 మంది లబ్ధిదారుల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు 44,632 మందే అర్హులని తేల్చారు. మిగతా 16,577 మంది లబ్ధిదారుల ఇళ్ల స్థలాలు పట్టా భూముల్లో, ఇతరత్రా వివాదాలను చూపుతూ..హక్కు పత్రాలు ఇవ్వడం కుదరదని చేతులెత్తేశారు. అయితే వీళ్లు చెల్లించిన నగదు మాత్రం వెనక్కి ఇవ్వలేదు. దీంతో లబ్ధిదారులు తాము చెల్లించిన రూ.10 వేల నగదు రసీదు పత్రాలతో సచివాలయాల చూట్టూ మూడేళ్లుగా తిరుగుతున్నారు.

బీసీ కాలనీలోనే పది మంది...

పిక్కిలి చిన్న రంగయ్య, కాకర్ల

ఈ చిత్రంలో ఓటీఎస్‌ రసీదు పట్టుకుని ఉన్న వ్యక్తి పిక్కిలి చిన్న రంగయ్య. అర్థవీడు మండలం కాకర్ల గ్రామంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఓటీఎస్‌ కింద మూడేళ్ల క్రితం రూ.పది వేలు నగదు స్థానిక సచివాలయంలో చెల్లించి రసీదు తీసుకున్నాడు. రిజిస్ట్రేషన్‌ హక్కు పత్రాలు అందించే నాటికి నివాస ప్రాంతం పట్టా భూమి అంటూ అధికారులు హక్కు పత్రం అందించలేదు. రంగయ్యతో పాటు మరో తొమ్మిది మంది ఈ కాలనీవాసులు ఇదే తరహాలో ఓటీఎస్‌కు నగదు చెల్లించారు. తాము చెల్లించిన నగదైనా ఇవ్వాలని మూడేళ్లుగా తిరుగుతున్నా నేటికి స్పందన లేదని వాపోతున్నారు.

అర్థవీడు మండల కేంద్రానికి చెందిన డి.రమణమ్మ అనే ఈ మహిళ ఓటీఎస్‌ కింద రూ.10 వేలు చెల్లించింది. తీరా రిజిస్ట్రేషన్‌ హక్కు పత్రం వచ్చాక..పట్టా భూమిలో ఇంటి స్థలం ఉందంటూ తహసీల్దారు, వీఆర్వో సంతకాలు చేయకుండా పక్కన పెట్టేశారు. అప్పటి నుంచి హక్కు పత్రం సచివాలయంలో మగ్గి పోతోంది. నేటికి ఆమెకు హక్కు పత్రం ఇవ్వలేదు..కట్టిన నగదు వెనక్కి ఇవ్వకపోవడంతో రెండేళ్లుగా సచివాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.

హక్కు పత్రంలో అధికారుల సంతకాలు చేయాలని దృశ్యం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని