logo

బలమున్నోడిదే భూమి..

వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జిల్లాలో పరిస్థితులు పూర్తిగా మారాయి. ఒకప్పటి దున్నే వాడిదే భూమి నినాదం స్థానంలో బలమున్నోడిదే జాగా అనే నయా విధానం వచ్చి చేరింది.

Published : 09 Jun 2023 04:59 IST

జిల్లాలో నయా విధానం
వివాదాస్పద జాగా కనిపిస్తే పాగా
పెచ్చుమీరుతున్న అధికార ఆగడాలు

ఆక్రమణకు గురైన మున్సిపల్‌ స్థలాన్ని కాపాడాలని మార్కాపురం ఉప కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు(పాత చిత్రం)

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జిల్లాలో పరిస్థితులు పూర్తిగా మారాయి. ఒకప్పటి దున్నే వాడిదే భూమి నినాదం స్థానంలో బలమున్నోడిదే జాగా అనే నయా విధానం వచ్చి చేరింది. పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లోనూ బలవంతుల ఆక్రమణలు.. బాధితుల ఆర్తనాదాలు నిత్యకృత్యమయ్యాయి. వివాదాస్పద భూములు అనిపిస్తే చాలు కొందరు వాలిపోతున్నారు. ప్రైవేట్‌ పంచాయితీల పేరుతో అందిన కాడికి పిండుకుంటున్నారు. ఖాళీ జాగాలు కనిపిస్తే పాగా వేస్తున్నారు. అవసరమైతే రాత్రికి రాత్రే ప్రవహరీలు నిర్మిస్తున్నారు.. కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. అదేమని ఎవరైనా ధైర్యంగా ప్రశ్నిస్తే న్యాయస్థానాల్లో తేల్చుకోవాలంటూ ఉచిత సలహాలిస్తున్నారు. ఈ తరహా ఆగడాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువమంది అధికార పార్టీ నాయకులే కావడం గమనార్హం. ఈ పరిణామాలతో జిల్లా వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

* అక్రమార్కులకు అస్త్రంగా జీపీఏ...: జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ(జీపీఏ) అనేది అక్రమార్కులకు ఇప్పుడు ఓ అస్త్రంగా మారింది. రాజకీయ పలుకుబడి, అర్ధబలం, అంగబలం ఉన్న వ్యక్తులు దీనిని అనుకూలంగా మలుచుకుంటున్నారు. తొలుత వివాదాస్పద భూముల్ని గుర్తిస్తారు. అనంతరం వారిలో ఒక పక్షం నుంచి తమ పేరిట జీపీఏ తీసుకుంటారు. ఆ తర్వాత వివాదాస్పద భూమిలో వాలిపోతారు. ఈ విషయం అవతలి పక్షానికి తెలిసి అక్కడికి వస్తే కాగితాలు చూపుతూ బెదిరింపులకు గురిచేస్తారు. సామ, దాన, దండోపాయాలను ప్రయోగిస్తారు. అధికార, రాజకీయ బలప్రయోగం చేస్తారు. తమ దారికి తెచ్చుకుని తృణమో, ఫలమో చెల్లిస్తారు. అనంతరం విలువైన భూములను మింగేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి జిల్లా కేంద్రం ఒంగోలులో ఈ తరహా వివాదాలు ఎక్కువయ్యాయి. వీటిలో ఒంగోలు మంగమూరు రోడ్డులో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఆరెకరాల స్థలం, పాత జాతీయ రహదారిపై మంగమ్మ కళాశాలలో ఉన్న మరోస్థలం ఉదంతాలు నిదర్శనం. బుల్లెట్‌ షోరూమ్‌ వర్క్‌షాపు సమీపంలోని ఆర్టీసీ కాలనీలోనూ జీపీఏ వివాదం రచ్చగా మారింది. జీపీఏను అడ్డు పెట్టుకుని ఖరీదైన భూముల్ని వివాదాల్లోకి లాగుతున్న ఘటనలు జిల్లావ్యాప్తంగా కోకొల్లలు. వీటిలో చాలా వరకు అధికార పార్టీకి చెందిన నాయకులే వెనుక ఉండి కథ నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

* పశ్చిమాన్ని పీక్కు తింటున్నారు...: జిల్లా పశ్చిమ ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. సహకరించే అధికారులతో కుమ్మక్కై వందల ఎకరాలను స్వాహా చేస్తున్నారు. పశ్చిమంలోని కీలక పట్టణానికి చెందిన ఒక నాయకుడితో పాటు, ఎమ్మెల్యే, ఆయన సోదరుడిపై తీవ్రమైన భూకబ్జా ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. తమ కుటుంబీకులు, అనుచరులతో మరికొందరిని బినామీలుగా పెట్టి అసైన్డ్‌ భూములు, డీకే పట్టాలు, పశువుల మేత పోరంబోకు భూములను స్వాహా చేస్తున్నారు. అప్పటి వరకు వాటిని అనుభవిస్తున్న వారిని నయానో భయానో వెళ్లగొట్టి, ఎంతో కొంతమొత్తం ముట్టజెప్పి తమ పేరిట ఆన్‌లైన్‌ చేయించుకుంటున్నారు. ఈ తరహా భూ అక్రమాలకు సహకరించారంటూ ఏకంగా 16 మంది వీఆర్‌వోలు ఒకేసారి సస్పెండ్‌ కావడం గమనార్హం.

* రెండు పట్టణాలపై ప్రధానంగా కళ్లు...: ఉమ్మడి జిల్లాలో ఒంగోలు, చీరాల, కందుకూరు, మార్కాపురం ప్రధాన పట్టణాలు. విభజన అనంతరం చీరాల, కందుకూరు పొరుగు జిల్లాల్లో విలీనమయ్యాయి. ఇప్పుడు జిల్లాలో ఒంగోలు, మార్కాపురం మాత్రమే ప్రధాన పట్టణాలుగా మిగిలాయి. దీంతో ఈ రెండు కీలకప్రాంతాల్లోని ఖరీదైన భూముల పైనే రాజకీయ పలుకుబడి ఉన్న అక్రమార్కులు కన్నేశారు. దీనికి కొందరు అవినీతి అధికారులు యథాశక్తి సహకరిస్తున్నారు. రాజకీయానికి అధికార బలం తోడవటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. క్షేత్రస్థాయిలో తమ భూ అక్రమాలకు సహకరించే క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించేలా చూసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ పరిస్థితులతో జిల్లాలో సామాన్యుల భూములకు రక్షణ లేకుండా పోయిందనే నిట్టూర్పులు వినిపిస్తున్నాయి.


మంత్రిపై మాజీ మంత్రికి ఫిర్యాదు...

ఉత్తర బైపాస్‌లోని ఖాళీ స్థలంలో రాత్రికి రాత్రే ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారాలు.. అనంతరం అధికారులు తొలగించారు

భూ అక్రమాలు, భూకబ్జాల్లో అధికార పార్టీకి చెందిన పలువురు నేతల పేర్లు పదేపదే వినిపిస్తున్నాయి. తమ కుటుంబానికి రెండెకరాల భూమిని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ కబ్జా చేశారంటూ దర్శి పట్టణానికి చెందిన కేసరి రంగలక్ష్మమ్మ గత కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నారు. మార్కాపురం మండలం దరిమడుగు పంచాయతీ పరిధిలోని స్థలాన్ని మంత్రి తమ కళాశాలలో కలిపేసుకున్నారని ఆమె చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వివాదం జేసీ కోర్టు పరిధిలో ఉంది. అయినప్పటికీ జిల్లా కేంద్రంతో పాటు ఎక్కడ స్పందన కార్యక్రమం నిర్వహించినా అక్కడకు వెళ్లి అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఒంగోలు వచ్చి కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ సమక్షంలో మంత్రి సురేష్‌పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేసేలా చూడాలని వేడుకున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని