logo

కల్యాణానికి వెళ్లొస్తూ.. కానరాని లోకాలకు

శుభకార్యానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా మినీ లారీ రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. వేగంగా వచ్చి ఢీకొట్టిన దుర్ఘటనలో తల్లీ కుమారుడు, ఓ బాలుడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయి.

Updated : 09 Jun 2023 06:22 IST

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన మినీ లారీ
తల్లి, కుమారుడు, మేనల్లుడి మృత్యువాత

విగతజీవిగా ప్రవీణ్‌ కుమార్‌

దిలీప్‌ కుమార్‌ (పాత చిత్రం)

టంగుటూరు, న్యూస్‌టుడే: శుభకార్యానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా మినీ లారీ రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. వేగంగా వచ్చి ఢీకొట్టిన దుర్ఘటనలో తల్లీ కుమారుడు, ఓ బాలుడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయి. ఈ హృదయ విదారక ఘటన టంగుటూరు మండలం ఎం.నిడమానూరు - మర్లపాడు గ్రామాల మధ్య గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన బందెల కోటిరత్నం(35), సురేష్‌ దంపతులు. వీరు బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె లక్ష్మీప్రసన్న, కుమారుడు ప్రవీణ్‌ కుమార్‌(10) ఉన్నారు. బంధువుల వివాహానికి కుమారుడు ప్రవీణ్‌తో కలిసి కోటిరత్నం నిడమానూరు వచ్చారు. సాయంత్రం తిరిగి ఈతముక్కల వెళ్లేందుకు బయలుదేరారు. అదే సమయంలో ఆమె మేనల్లుడైన ఎం.నిడమానూరుకు చెందిన మేలం దిలీప్‌ కుమార్‌(19) అక్కడికి వచ్చాడు. వారిద్దరినీ బస్సు ఎక్కించేందుకు తన ద్విచక్ర వాహనంపై ఉప్పలపాడు తీసుకెళ్లాడు. బస్సు రావడం ఆలస్యం కావడంతో పెట్రోల్‌ పోయించుకునేందుగాను సమీపంలోని బంకు వద్దకు ముగ్గురూ వెళ్లారు. ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో నిడమానూరు శివారులోని బంకు వద్దకు వెళ్లి పోయించుకున్నారు. తిరిగి ముగ్గురూ ద్విచక్ర వాహనంపై మర్లపాడు వైపు వెళ్తుండగా.. అటు నుంచి వస్తున్న మినీ వ్యాన్‌ ఢీకొట్టింది. మినీ వ్యాన్‌ వేగం ధాటికి ముగ్గురితో పాటు ద్విచక్ర వాహనం ఎదుటి భాగంలో ఇరుక్కుపోయింది. పది అడుగుల దూరం ముందుకు వెళ్లిన తర్వాత మినీ వ్యాన్‌ అదుపుతప్పి రహదారి పక్కనున్న కాలువలో పల్టీలు కొడుతూ పడిపోయింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వ్యాన్‌ చోదకుడు పరారయ్యాడు.

* తెలియని దారిలో వచ్చి..: వాస్తవానికి మినీ వ్యాన్‌ ముప్పవరం నుంచి ఒంగోలు వెళ్లాల్సి ఉంది. టంగుటూరు వైపు నుంచి దూరం కావడంతో నిడమానూరు మీదుగా వెళ్తున్నాడు. మినీ వ్యాన్‌ చోదకుడు కర్ణాటక వాసి కావడం.. మర్లపాడు వద్ద రోడ్డును స్థానికులు మూసి వేయడంతో దారి తెలియక తిరిగి వ్యతిరేక మార్గంలో వెనక్కి వస్తున్నాడు. అదే సమయంలో పెట్రోల్‌ కోసమని వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ముగ్గురి మృతికి కారణమయ్యాడు.

* కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు...: కోటిరత్నం ఎం.నిడమానూరు ఎంపీటీసీ సభ్యురాలు చిన్నమ్మాయి కుమార్తె. ప్రమాదంలో కుమార్తె, మనవడు ప్రాణాలు కోల్పోవడంతో ఆమెతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనం వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదించారు. మేలం గురుమూర్తి ఆటో డ్రైవర్‌గా జీనం సాగిస్తున్నారు. ఇతని కుమారుడు దిలీప్‌ కుమార్‌. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసి డిగ్రీలో చేరేందుకు సిద్ధమవుతున్నాడు. చేతికి అందివచ్చిన కుమారుడు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాన్ని గుండెలకు హత్తుకొని రోదించడాన్ని చూసిన పలువురు కంట నీరు పెట్టుకున్నారు.

బోల్తా పడిన మినీ వ్యాన్‌ వద్ద గుమిగూడిన స్థానికులు

సంఘటనా స్థలంలో రోదిస్తున్న బాధిత కుటుంబ సభ్యులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని