logo

పక్షవాతం వచ్చిందని... వదిలేశారు

పక్షవాతం వచ్చిన ఓ వ్యక్తిని బంధువులు, కుటుంబసభ్యులు పోషించలేమంటూ రోడ్డుపై అనాథగా వదిలేయడంతో రోజంతా రోడ్డుపైన ఉండిపోయిన సంఘటన రాచర్ల మండలంలో గురువారం చోటుచేసుకుంది.

Published : 09 Jun 2023 04:59 IST

రోజంతా రోడ్డుపైనే...

రోడ్డుపై అనాథగా మిగిలిన పెద్దిరాజు

రాచర్ల, న్యూస్‌టుడే : పక్షవాతం వచ్చిన ఓ వ్యక్తిని బంధువులు, కుటుంబసభ్యులు పోషించలేమంటూ రోడ్డుపై అనాథగా వదిలేయడంతో రోజంతా రోడ్డుపైన ఉండిపోయిన సంఘటన రాచర్ల మండలంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం మేరకు...  రాచర్ల గ్రామానికి చెందిన గుర్రపుశాల పెద్దిరాజుకు ఆదే గ్రామానికి చెందిన బంధువు అమ్మాయి లక్ష్మీతో 25 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆయన హైదరాబాద్‌లో పెట్టుడు దంతాల సెట్లు తయారు చేసి విక్రయించి జీవనం సాగించేవారు. పెద్దిరాజుకు రెండు సంవత్సరాల క్రితం పక్ష వాతం వచ్చి కాలు, చెయ్యి పడిపోయాయి. దీంతో కొన్ని రోజుల పాటు భార్య పోషించింది. అనంతరం గ్రామానికి తీసుకొచ్చి ఆయన తల్లిదండ్రుల వద్ద వదిలి హైదరాబాద్‌ వెళ్లిపోయింది. అప్పటి నుంచి తల్లి పోషిస్తుండేది. మూడు నెలల క్రితం ఆమె బంధువుల ఊరికి వెళుతూ చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అప్పటి నుంచి పెద్దిరాజును, ఆయన తండ్రిని సోదరుడే పోషిస్తున్నాడు. ఇటీవల సోదరుడు, గ్రామస్థులు పెద్దిరాజును తీసుకొని హైదరాబాద్‌ వెళ్లి పెద్ద మనుషుల సమక్షంలో భార్యతో మాట్లాడారు. తానే పోషించుకుంటానని త్వరలో పెద్దమనుషులతో గ్రామానికి వస్తానని తెలపడంతో గ్రామస్థులు ఆయనను తీసుకొని గ్రామానికి తిరిగి వచ్చారు. అయితే పెద్దిరాజు భార్య రెండు రోజుల క్రితం ఒక్కరే వచ్చారు. దీంతో ఆమెకు పెద్దిరాజును అప్పగించి సోదరుడు, తండ్రితో పాటు కుటుంబసభ్యులతో గిద్దలూరు వెళ్లిపోయారు. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, తనకు ఇవ్వాల్సిన వాటా కోరారు. బుధవారం రాత్రి తాను భర్తను పోషించలేనని తెలపడంతో ఆయనను చూసే వారు లేక రోడ్డున పడ్డారు. గురువారం ఉదయం నుంచి అత్త వారి ఇంటి వద్దే అలాగే ఉండిపోయారు. తాను దిక్కులేని వాడయ్యానని, తనను భార్య పోషించేలా చూడాలని రోదిస్తూ గ్రామస్థులను వేడుకున్నారు. చివరకు గురువారం రాత్రి భర్తను తానే చూసుకుంటానని చెప్పి అతడిని ఇంట్లోకి భార్య తీసుకుపోవడంతో సమస్య తీరిందని గ్రామస్థులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని