logo

పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు

భార్యతో గొడవపడి ఇద్దరు చిన్నారులతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఓ వ్యక్తి ఇంట్లోంచి వచ్చేయడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

Published : 09 Jun 2023 04:59 IST

చిన్నారులతో పాటు తండ్రిని కాపాడిన పోలీసు సిబ్బంది

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : భార్యతో గొడవపడి ఇద్దరు చిన్నారులతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఓ వ్యక్తి ఇంట్లోంచి వచ్చేయడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటన గురువారం గిద్దలూరులో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన గురుమోహన్‌ బుధవారం సాయంత్రం భార్యతో గొడవపడ్డారు. ఆగ్రహంతో తన ఇద్దరు పసి పిల్లలను తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతున్నానని చెప్పి ఇంట్లోంచి వెళ్లిపోయారు. దీంతో ఆందోళనకు గురైన గురుమోహన్‌ తల్లి కడప జిల్లా కలసపాడు పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడి ఎస్‌.ఐ నాగమురళి సైబర్‌ క్రైం పోలీసుల సహకారంతో గురుమోహన్‌ గిద్దలూరులో ఉన్నట్లు గుర్తించి అక్కడి సిబ్బందికి తెలిపారు. దీంతో గురువారం గిద్దలూరు పోలీసులు రంగంలోకి దిగి గాంధీబొమ్మ కూడలిలో ఇద్దరు కుమార్తెలతో ఉన్న గురుమోహన్‌ను గుర్తించారు. కలసపాడు ఎస్‌.ఐ నాగమురళి వారిని అప్పగించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.


మనో వేదనతో..

తాళ్లూరు (ముండ్లమూరు) : మనోవేదనకు గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన తాళ్లూరు ఎస్సీ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తాళ్లూరు ఎస్సీ కాలనీకి చెందిన అనపర్తి మరియబాబు(20) వృత్తి విద్య కోర్సు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. అయితే గత కొంతకాలంగా తరచూ అనారోగ్యానికి గురవుతుండడంతో కలత చెంది బుధవారం విష రసాయనం తీసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు, తండ్రి శ్యాంసన్‌ ఫిర్యాదుతో తాళ్లూరు ఎస్సై ప్రేమ్‌కుమార్‌ గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రేమ విఫలం కావడంతోనే యువకుడు  ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని