logo

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై సమీక్ష

నవరత్నాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా ప్రకాశం జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు సూచించారు.

Published : 10 Jun 2023 06:11 IST

మాట్లాడుతున్న రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు, చిత్రంలో నారాయణమూర్తి, కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఏఎస్పీ నాగేశ్వరరావు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: నవరత్నాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా ప్రకాశం జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు సూచించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఎనిమిది ప్రాధాన్యతా సూచీల పురోగతిపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఒంగోలు ప్రకాశం భవన్‌లోని స్పందన సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో విష్ణు పాల్గొని మాట్లాడారు. నవరత్నాల పథకాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా జిల్లాతో పాటు, రాష్ట్ర స్థానం కూడా మెరుగవుతుందన్నారు. బైజూస్‌ పాఠాలు, నాడు-నేడు, అమ్మఒడి, విద్యాకానుక, సంపూర్ణ పోషణ అమలుతో పాటు; పాఠశాలల్లో డ్రాప్‌ అవుట్లు, బాల్య వివాహాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. గతంలో 65.3 శాతం మంది చిన్నారులు, బాలింతల్లో రక్తహీనత ఉండేదని, ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం చేపట్టిన చర్యలతో 53.7 శాతానికి తగ్గినట్టు తెలిపారు. ఏడాదిలోపు వయసున్న పిల్లల్లో మరణాల రేటు గతంలో వెయ్యికి 60 మంది ఉంటే, నేడు 25కు తగ్గిందని వివరించారు. నవరత్నాల కార్యక్రమాల ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎ.నారాయణమూర్తి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి దూరదృష్టితో పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. పదో తరగతి ఉత్తీర్ణురాలైన ప్రతి విద్యార్థిని ఆపై తరగతుల్లో చేరేలా బాలికా వికాసం పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్టు వివరించారు. సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, సీపీవో వెంకటేశ్వర్లుతో పాటు, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, వైద్యాధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు