logo

అద్దె భవనాల అన్వేషణలోనే ఆంధ్రకేసరి

ప్రభుత్వం నుంచి నిర్వహణ ఖర్చులకు అవసరమైన రూ. 2.50 కోట్లు మాత్రమే అందాయి. పూర్తిస్థాయివి ఎప్పటికి విడుదలవుతాయో తెలియదు.

Published : 10 Jun 2023 06:14 IST

ప్రభుత్వం నుంచి అరకొరగానే నిధులు
అయినప్పటికీ ప్రారంభం దిశగా తరగతులు!

పేర్నమిట్ట కొండపై నిర్మించిన తరగతి గదులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ప్రభుత్వం నుంచి నిర్వహణ ఖర్చులకు అవసరమైన రూ. 2.50 కోట్లు మాత్రమే అందాయి. పూర్తిస్థాయివి ఎప్పటికి విడుదలవుతాయో తెలియదు. మరికొద్ది రోజుల్లో వస్తాయని ఆశిస్తున్నా.. అందుకు సంబంధించి సంకేతాల జాడలేదు. విద్యార్థులకు వసతి కల్పించేందుకు, కొన్ని కోర్సుల నిర్వహణకు భవనాల కొరత ఉంది. వీటి కోసం అద్దె భవనాలు తీసుకోడానికి చేపట్టిన అన్వేషణ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ పరిస్థితుల్లో జులై నుంచి డిగ్రీ కోర్సులు, ఆగస్టు నుంచి పీజీ కోర్సుల తరగతులు ప్రారంభించాల్సి ఉంది. ఉప కులపతి, ఇతర బాధ్యతాయుత పోస్టుల్లో ఉన్న అధికారులు పరుగులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఇం‘ధనం’ చేతికందలేదు. ఇదీ జిల్లాలో కొత్తగా ఏర్పాటైన ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం దుస్థితి.

* 93 కళాశాలలు.. 25 వేల మంది విద్యార్థులు...: పేర్నమిట్ట కొండ మీద గతంలో నిర్మించిన భవనంలో సైన్స్‌ కోర్సులు ప్రారంభించే యోచనలో ఉన్నారు. అన్ని తరగతులు నిర్వహించడానికి, యువతీ యువకులకు విడివిడిగా వసతి కల్పించేందుకు ప్రైవేట్‌ భవనాలు అవసరం. వీటి కోసం ఇంకా వెతుకులాట కొనసాగుతూనే ఉంది. ఒంగోలు నగరంలోని శర్మ కళాశాల, మంగమ్మ కళాశాల భవనాలు పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం 35 మంది బోధన, 20 మంది బోధనేతర సిబ్బంది అందుబాటులో ఉండగా.. కొత్త కోర్సులకు త్వరలో కాంట్రాక్టు పద్ధతిన బోధకుల నియామకం చేపడతారని చెబుతున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి ప్రకాశంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నాయి. ఇటీవల వాటిని అధికారికంగా ఏకేయూ పరిధిలోకి చేర్చారు. దీంతో 93 డిగ్రీ కళాశాలలు విశ్వవిద్యాయలయం గొడుగు కిందికి చేరినట్లైంది. ప్రస్తుతం వాటికి గుర్తింపు(అఫ్లియేషన్‌) ఇచ్చే ప్రక్రియ సాగుతోంది. వాటిలో పది ప్రభుత్వ, మూడు ఎయిడెడ్‌ కళాశాలలుండగా మిగిలినవన్నీ ప్రైవేట్‌వి. మొత్తం మీద మొదటి సంవత్సరం డిగ్రీలో చేరే విద్యార్థులు 25 వేల మంది ఉంటారని అంచనా.

* మారిన విధానంపై అవగాహన...: ఈ నెల 21 నుంచి డిగ్రీ ప్రవేశాలు ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభమవుతాయి. విద్యార్థులు ఐచ్ఛికాలు నమోదు చేసుకుంటే ఉన్నత విద్యాశాఖ సీట్లు కేటాయిస్తుంది. అనంతరం నిర్ణీత రుసుములు వసూలు చేయాల్సి ఉంటుంది. ఈసారి డిగ్రీ కోర్సుల్లో మార్పు చేశారు. మూడేళ్లను నాలుగు సంవత్సరాలకు పెంచారు. మూడేళ్లు మాత్రమే చదవడానికి ఇష్టపడే వారికి కోర్సు అయ్యాక పాత పద్ధతిలో పట్టా అందిస్తారు. నాలుగేళ్లు చదివే వారికి డిగ్రీ ఆనర్స్‌ పట్టా ఇస్తారు. కోర్సుల ఎంపికలో కూడా మార్పులు చేశారు. ప్రతి విద్యార్థి రెండో సెమిస్టర్‌ నుంచి సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు తీసుకోవాల్సి ఉంటుంది. మారిన విధానాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించాలని విశ్వవిద్యాలయ అధికారులు నిర్ణయించారు.

ఆరు కొత్త కోర్సులకు ఆమోదం...

ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో కొత్తగా ఆరు సైన్స్‌ కోర్సులు ప్రవేశపెట్టారు. ఎన్‌యూ పరిధిలో పీజీ కేంద్రం ఉన్నప్పుడు తొమ్మిది కొనసాగాయి. వీటికి అదనంగా ఎమ్మెస్సీ ఆక్వాకల్చర్‌, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఎనలైటికల్‌ కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌, టెక్నాలజీ, ఆర్ట్స్‌ కోర్సుల్లో ఎంఏ ఆంగ్లం, ఎంఏ తెలుగు కోర్సులు ప్రారంభించనున్నారు. ఇటీవలే కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తంమీద విశ్వవిద్యాలయంలో పాత కోర్సుల్లో 500 సీట్లు, కొత్త వాటిల్లో 250 అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. ఆదివారంతో ఇవి పూర్తవుతాయి. ఫలితాలు ప్రకటించాక ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపడతారు. ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభించాలి. ఏకేయూలో ప్రస్తుతం పాత భవనాలు అందుబాటులో ఉన్నాయి.


ఉపాధికి దోహదపడేలా కృషి...

జిల్లాలోని వనరులు, పరిశ్రమలను బట్టి కోర్సులు ఎంపిక చేశాం. వీటి వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఆగస్టు నాటికి అన్ని సౌకర్యాలతో తరగతులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

డాక్టర్‌ వెంకటేశ్వరరెడ్డి, డీన్‌, ఏకేయూ

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని