తమ్ముడూ... ఫ్లెక్సీ మీద ఫొటో ఉండాలే!
ఎన్నికలు సమీపిస్తున్న తరుణం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులూ వేడిగానే ఉన్నాయి. ఆ ప్రభావం వినాయక చవితి ఉత్సవాలపైనా పడింది.
చవితి ఉత్సవాల్లో రాజకీయ సందడి
న్యూస్‌టుడే - ఒంగోలు నేరవిభాగం
ఎన్నికలు సమీపిస్తున్న తరుణం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులూ వేడిగానే ఉన్నాయి. ఆ ప్రభావం వినాయక చవితి ఉత్సవాలపైనా పడింది. ఆయా పార్టీల నాయకులు యువతను మచ్చిక చేసుకునేందుకు... మండపాల ఏర్పాటుకు ఇతోధికంగా విరాళాలు ఇస్తున్నారు. పట్టణాలతో పాటు పలు పల్లెల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. చిన్నా చితకా అయితే రూ.అయిదు వేలు; భారీ మండపాలు, ఉత్సవ కమిటీలకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు విరాళాలు అందజేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా... ఆయా వేదికల వద్ద ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లో తమ ఫొటో ఉండాలన్న నిబంధన పెట్టి మరీ ఈ మొత్తాలు ఇస్తుండడం గమనార్హం.
పోలీసు యంత్రాంగం అప్రమత్తం...
మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గత శుక్రవారం అరెస్టయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఎన్నికలూ దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వేడుకల్లో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున... ఉత్సవాల నిర్వహణపై పోలీసు శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. పాటించాల్సిన నియమ నిబంధనలను ఎస్పీ మలికా గార్గ్ ఇప్పటికే విడుదల చేశారు. గురువారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలోనూ చవితి ఉత్సవాలను అజెండాలో చేర్చి... పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
దండిగా మామూళ్లు...
మండపాల ఏర్పాటుకు స్థానిక సంస్థలతో పాటు అగ్నిమాపక, విద్యుత్తు, పోలీసు శాఖల అనుమతులు తప్పనిసరి. ఇదే అదునుగా ఆయా విభాగాల్లోని కొందరు అధికారులు, సిబ్బంది ఇష్టానుసారం వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో పోలీసు శాఖదే సింహభాగమన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్టేషన్, సర్కిల్, సబ్ డివిజన్లకు రూ.వెయ్యి చొప్పున మూడువేలు వసూలు చేస్తుండగా... మరి కొన్ని చోట్ల స్టేషన్‌కే రూ.మూడు వేలు, సర్కిల్, సబ్ డివిజన్‌కు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు, అధికార పార్టీ మద్దతుదారులు ఎటువంటి అనుమతులు లేకుండానే పలు చోట్ల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నా... రాజకీయ ఒత్తిళ్లతో ఆయా శాఖలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.