logo

రాజీకి రండి.. కుదరదులెండి!

సంతనూతలపాడు తహసీల్దార్‌ లక్ష్మీనారాయణరెడ్డిపై వైకాపా మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి ఇటీవల దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

Updated : 22 Sep 2023 05:59 IST

 విజయవాడ చేరిన సంతనూతలపాడు పంచాయిత్కీ

సుధాకర్‌బాబు ఎమ్మెల్యే, ఎస్‌.ఎన్‌.పాడు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: సంతనూతలపాడు తహసీల్దార్‌ లక్ష్మీనారాయణరెడ్డిపై వైకాపా మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి ఇటీవల దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. జిల్లా కలెక్టర్‌ ఆదేశించే వరకు ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం.. మండల ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ హోదాలో ఉన్న అధికారిపై ఏకంగా ఆయన కార్యాలయంలోనే దాడి చేయడం.. ఆపై నామమాత్రపు బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం వంటి పరిణామాలు అటు అధికారులు, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. దాడి చేసిన దుంపా చెంచి రెడ్డికి అధికార పార్టీ నాయకులు అండగా నిలవడాన్ని ఏపీ రెవెన్యూ అధికారుల సంఘం తీవ్రంగా పరిగణించింది. అతనిపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించింది. ఈ వ్యవహారం అధికార పార్టీలో గుబులు రేపుతోంది. అసెంబ్లీ సమావేశాల కారణంగా సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం విజయవాడలో ఉన్నారు. పార్టీ పెద్దల ఆదేశాలతో ఈ ఉదంతంలో అభియోగాలు ఎదుర్కొంటున్న చెంచిరెడ్డిని బాలినేని గురువారం విజయవాడ పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడారు. తహసీల్దార్‌కి బహిరంగంగా క్షమాపణ చెప్పి సర్దుబాటు చేసుకోవాలని ఆయన సూచించగా అతను ససేమిరా అన్నట్లు వినికిడి. అవసరమైతే తాను ఈ కేసులో అరెస్ట్‌ అయినా కోర్టులోనే తేల్చుకుంటానని.. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు బాధిత తహసీల్దార్‌ లక్ష్మీనారాయణరెడ్డితో పాటు రెవెన్యూ సంఘంలోని కొందరు నాయకులతో సంప్రదింపులు సాగించారు. ఈ వివాదాన్ని మాజీ మంత్రి బాలినేని ఎదుట చర్చించి పరిష్కారం చేసుకుందామని ప్రతిపాదించగా వారు తోసిపుచ్చినట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని రెవెన్యూ సంఘం చూసుకుంటుందని, తాము రాజీకి రాలేమని ఎమ్మెల్యేతో బాధిత తహసీల్దార్‌ లక్ష్మీనారాయణరెడ్డి చెప్పినట్లు సమాచారం.


లక్ష్మీనారాయణ రెడ్డి, తహసీల్దార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని