logo

మా భవిష్యత్తు మాటేంటి జగన్‌ మామా!

ప్రపంచ స్థాయి విద్యార్థులను తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు చేపడుతోంది.

Updated : 22 Sep 2023 05:59 IST

తరగతి గదులు చాలడం లేదు
పాఠాలు చెప్పే బోధకులు లేరు
పుస్తకాలు, ప్రయోగశాలలు కానరావు
మిథ్యగా పది ఉన్నత పాఠశాలల్లో ఇంటర్‌ విద్య

ప్రపంచ స్థాయి విద్యార్థులను తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు చేపడుతోంది. సౌకర్యాలు కల్పిస్తోందంటూ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పదే పదే వల్లె వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితులున్నాయి. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే సంగతి తర్వాత.. కనీసం వారు ఉత్తీర్ణులయ్యేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా విద్యాలయాల్లో ఉండటం లేదు. ఉన్నత పాఠశాలల్లో ప్రారంభించిన ఇంటర్‌ కోర్సులు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వాటిలో చాలాచోట్ల పాఠాలు చెప్పే బోధకులు పూర్తిస్థాయిలో లేరు. కూర్చునేందుకు తరగతి గదులు కూడా సరిపోవడం లేదు. ప్రయోగశాలల ఊసే కానరావడం లేదు. ఇలాంటి పరిణామాల మధ్య పిల్లల చదువులు ఎలా అని తల్లిదండ్రులు.. తమ భవిష్యత్తు ఏం కానుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

చేరిన వాళ్లూ వీడి వెళ్తున్నారు...: గ్రామీణ ప్రాంత బాలికలు పదో తరగతి తర్వాత ఎక్కువ మంది మానేస్తున్నారు. అటువంటి వారు ఉన్నత చదువులు కొనసాగించేలా చూడాలనే ఆశయంతో జిల్లాలో పది ఉన్నత పాఠశాలల్లో ఇంటర్‌ తరగతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. గత ఏడాది జూనియర్‌ ఇంటర్‌లో అన్ని చోట్లా కలిపి 210 మంది వరకు చేరారు. ఏడాది చివరి వరకు రెగ్యులర్‌ బోధకులను నియమించలేదు. ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో పీజీ విద్యార్హత ఉన్నవారిని డిప్యుటేషన్‌పై నియమించి పాఠాలు చెప్పించారు. ఈ పరిస్థితిని గమనించిన కొందరు తల్లిదండ్రులు రెండో సంవత్సరం అక్కడ కొనసాగించకుండా తమ పిల్లల్ని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో చేర్చించారు. మద్దిపాడు మండలం కారుమూడివారిపాలెం ఉన్నత పాఠశాలలోని ఇంటర్‌లో అయితే కొత్తగా ఒక్కరూ చేరలేదు. గత ఏడాది చేరిన వారు కూడా బయటికి వెళ్లిపోయారు. ఆ విధంగా రెండో ఏడాదికి వచ్చేసరికి సుమారు 180 మంది మాత్రమే మిగిలారు.

ఇంకా ఉత్తర్వులు

ఇవ్వలేదు...: జిల్లాలో కొణిజేడు, కె.ఉప్పలపాడు, పాకల, కరవది, హెచ్‌.నిడమానూరు, మైనంపాడు, దేవరపాలెం, తిమ్మాయిపాలెం, గిద్దలూరులో బాలికల కోసం జూనియర్‌ ఇంటర్‌ కోర్సులు నిర్వహిస్తుండగా.. కనిగిరి మండలం శీలంవారిపల్లిలో బాలబాలికలు విద్యాభ్యాసం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇంటర్‌ బోధనకు ఒక్కో పాఠశాలకు 10 నుంచి 12 మంది అధ్యాపకులు అవసరం. కొన్నిచోట్ల బోధకులు లేక ఆయా సబ్జెక్టుల పాఠాలు చెప్పని పరిస్థితి. ఈ ఏడాది ఉద్యోగోన్నతుల ద్వారా కొన్ని భర్తీ చేశారు. అయినా గిద్దలూరులో కెమిస్ట్రీ, కరవదిలో కెమిస్ట్రీ, జువాలజీ, తిమ్మాయిపాలెం, మైనంపాడులో కెమిస్ట్రీ, ఇంగ్లిషు బోధకులు ఇంకా లేరు. జులైలో అర్హులైన వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించినా ఇంతవరకు పోస్టింగ్‌ ఉత్తర్వులివ్వలేదు.

పరికరాలూ  లేకుండానే

ఇంటర్‌ విద్యాబోధనలో ప్రయోగాలు ఎంతో ముఖ్యం. రెండో సంవత్సరం విద్యార్థులకు నాలుగు సైన్స్‌ సబ్జెక్టులకు వేర్వేరుగా ప్రయోగశాలలు అవసరం. ఆర్భాటంగా కోర్సులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రయోగశాలల ఏర్పాటుకు నిధులు కేటాయించలేదు. సమీపంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు విద్యార్థులను తీసుకెళ్లి చేయించాలని అధికారులు సూచనలు చేశారు. త్వరలో క్వార్టర్లీ పరీక్షలున్నాయి. కీలకమైన ఇంటర్‌లో బోధన సరిగా లేకుంటే ఎలా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కొణిజేడు, హెచ్‌.నిడమానూరు, దేవరపాలెంలో తరగతి గదుల కొరతతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ ఏడాది ఇప్పటి వరకు ఉచిత పాఠ్యపుస్తకాలు కూడా అందించకపోవడం గమనార్హం. ఈ పరిణామాల మధ్య తమ భవిష్యత్తు ఎలా ఉండనుందో అని విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని