logo

వధ్య శిలపై వంచితులు

విద్యుత్తు శాఖలో కొందరు అధికారుల ఉదాసీనతకు పేద కుటుంబాలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నాయి.

Published : 22 Sep 2023 01:38 IST

స్తంభాలపై తెల్లారుతున్న బతుకులు
మామూళ్ల మాయతో అందని సాయం
రోడ్డున పడుతున్న ప్రైవేటు కార్మికులు

మార్కాపురం అర్బన్‌ న్యూస్‌టుడే: విద్యుత్తు శాఖలో కొందరు అధికారుల ఉదాసీనతకు పేద కుటుంబాలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నాయి. విద్యుత్తు స్తంభాలెక్కి బుగ్గయిన ప్రైవేటు షిఫ్ట్‌ ఆపరేటర్లు, కార్మికుల వేదన ఎవరికీ పట్టడంలేదు. వారిని ఇష్టారాజ్యంగా నియమించుకోవడమే తప్ప.. ప్రాణాపాయం సంభవించినప్పుడు చిల్విగవ్వ కూడా చెల్లించకపోవడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా అధికారం అడ్డు చక్రమేస్తోందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. పశ్చిమ ప్రకాశంలో ఇటీవలకాలంలో పలువురు ప్రైవేటు విద్యుత్తు కార్మికులు మరమ్మతులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర గాయాలతో మంచానికే పరిమితమతమై సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు.

గాల్లో కలిసిన ప్రాణాలెన్నో..

చికిత్స పొందుతున్న కాకర్ల చిన్న

జిల్లాలో ఈ ఒక్క ఏడాదిలోనే నిరుపేద కుటుంబాలకు చెందిన పలువురు ప్రైవేటు విద్యుత్తు ఆపరేటర్లు పనులు చేస్తూ ప్రాణాలు కోల్పోయారు.

  • ఈ ఏడాది ఏప్రిల్‌ 28న మార్కాపురం పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవనగర్‌లో ఓ బహుళ అంతస్థుల భవనంలో విద్యుత్తు పనులు చేస్తూ పెద్దారవీడు మండలం సుంకేసులకు చెందిన ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ మృతి చెందారు.
  • ఫిబ్రవరి 4న ముండ్లమూరులో విద్యుత్తు లైన్లు మార్చే క్రమంలో చీదర వెంకటేశ్వర్లు అనే ప్రైవేటు ఆపరేటర్‌  చనిపోయారు.
  • మే 4న ఉలవపాడు మండలం మన్నేటికోటలో 11 కేవీ లైన్‌ మరమ్మతులు చేస్తూ కార్మికుడు మృత్యువాత పడ్డారు.
  • ఆగస్టు 16న త్రిపురాంతకం మండలం దివిపల్లిలోని పొలాల్లో మరమ్మతులు చేస్తున్న క్రమంలో విద్యుత్తు సరఫరా కావడంతో ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ ప్రాణాలు కోల్పోయారు.

ఆదుకునేవారేరీ.. ?


పోసుపల్లిలో ప్రమాదానికి  గురై చికిత్స పొందుతున్న శేఖర్‌(పాత చిత్రం)

పశ్చిమ ప్రకాశంలో విద్యుత్తు అధికారుల తీరుతో తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ప్రైవేటు విద్యుత్తు కార్మికులు వాపోతున్నారు. ఆగస్టు 13న కొమరోలు మండలం పోసుపల్లిలో విద్యుత్తు పనులు చేస్తూ శేఖర్‌ అనే కార్మికుడు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. ఇది జరిగి నెల గడుస్తున్నా బాధ్యులైన వారిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందించాల్సిన క్షేత్రస్థాయి అధికారిలో స్పందన కరువైంది.

కీలక నాయకుడని మిన్నకుండిపోయారా...

మార్కాపురం పట్టణంలోని పలకల పరిశ్రమ సమీపంలోని ఓ మిల్లులో ఆగస్టు 28న విద్యుత్తు సమస్య తలెత్తడంతో లైన్‌మెన్‌ స్థానంలో ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ను అక్కడికి పంపించారు. అక్కడ పనులు చేస్తూ అతను విద్యుదాఘాతానికి గురై స్తంభం పైనుంచి పడిపోయారు. ప్రమాదానికి కారణమైన ఉద్యోగి అధికార పార్టీకి చెందిన కీలక యూనియన్‌ నాయకుడు కావడంతో స్థానిక క్షేత్రస్థాయి అధికారి ఆయనపై నివేదిక సమర్పించడంలో జాప్యం చేస్తున్నారు. మరోవైపు బాధితుడి చికిత్స ఖర్చులన్నీ మిల్లు యజమాని భరించే విధంగా సదరు ఉద్యోగి ఒప్పందం కుదుర్చుకోవడం ఆయన అధికార దర్పానికి మచ్చుతునక. లైన్‌మెన్ల నిర్లిప్తత, షిప్ట్‌ ఆపరేటర్ల బాధ్యతారాహిత్యం కారణంగా పలువురు ప్రైవేటు ఎలక్ట్రీషియన్లు తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వాటికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. కీలక అధికారుల ఆశీస్సులు.. రాజకీయ నేతల అండదండలు ఉండటంతో కొందరు విద్యుత్తు లైన్‌మెన్లపై కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. ప్రైవేటు కార్మికుల సేవలు వినియోగించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని