logo

ఉన్నత చదువులకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు

ఉన్నత చదువుల కోసం లండన్‌ వెళ్లిన విద్యార్థి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు.

Published : 22 Sep 2023 01:38 IST

లండన్‌లో యువకుడి మృతి

యర్రగొండపాలెం: ఉన్నత చదువుల కోసం లండన్‌ వెళ్లిన విద్యార్థి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడుకు చెందిన జమ్మి సుబ్బారావు(24) ఎమ్మెస్‌ చేసేందుకు ఈనెల 8న చెన్నై నుంచి విమానంలో లండన్‌ వెళ్లాడు. అక్కడి కార్డిఫ్‌ నగరంలోని కార్టిస్‌ మెట్రోపాలిటన్‌ యూనివర్సిటీలో రిపోర్ట్‌ చేసేందుకు ఈనెల 16న అక్కడి భారతీయ విద్యార్థులతో కలిసి బస్సులో బయల్దేరాడు. బస్సు ఎక్కుతుండగా ఛాతిలో నొప్పిగా ఉందనడంతో  కూల్‌డ్రింక్‌ తాగాడు. కొద్దిసేపటికే అక్కడే రోడ్డుపై కుప్పకూలిపోయాడు. పక్కనున్న వారు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు అంబులెన్స్‌లో వైద్యశాలలో చేర్పించారు. ఈ సమాచారం చేరవేసేందుకు అక్కడి అధికారులు సుబ్బారావు తల్లిదండ్రులకు మెసేజ్‌ చేసినట్లు చెప్తున్నారు. ఇక్కడున్న తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళన చెందారు. చివరకు బుధవారం అక్కడి స్నేహితుడొకరు సుబ్బారావు తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి సమాచారమిచ్చారు. సుబ్బారావు మృతదేహం యూనివర్సిటీ హాస్పిటల్‌ ఆఫ్‌ వేల్స్‌ మార్చురీలో ఉన్నట్లు తెలిపారు.  


విద్యుదాఘాతంతో మహిళ దుర్మరణం

కొత్తపట్నం, న్యూస్‌టుడే: విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ దుర్మరణం పాలయ్యారు.  స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని అల్లూరుకి చెందిన సామంతుల నాగలక్ష్మి(34) రంగాయపాలేనికి పొలం పనుల నిమిత్తం వెళ్లారు. స్ప్రింక్లర్‌ పైపులు పైకి ఎత్తే సమయంలో ప్రధాన లైన్‌ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న విద్యుత్తు శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్‌ షాక్‌కు గురైన ఆనవాళ్లు ఏమీలేవని వారు పత్రికా ప్రకటన విడుదల చేయడం గమనార్హం.


కుమారుడి పుట్టిన రోజు వేడుక చూడకుండనే..

కిష్ణాపురం (శావల్యాపురం), న్యూస్‌టుడే : గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. కర్నూలు- గుంటూరు జాతీయ రహదారిలో పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కిష్ణాపురం- గంగయ్యకుంట చెరువు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఇది జరిగింది. ఎస్సై టి.తిరుపతిరావు వివరాల ప్రకారం.. మార్కాపురం పట్టణానికి చెందిన వేమలూరి మునీశ్వరరావు (43) గుంటూరులోని హోటల్‌లో పని చేసేవారు. రెండు రోజుల్లో కుమారుడు శివశంకర్‌ పుట్టిన రోజు ఉండటంతో గుంటూరులో దుస్తులు కొని, ద్విచక్ర వాహనంపై పట్టణానికి బయలుదేరారు. సరిగ్గా కిష్ణాపురం వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడిక్కడే మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు