logo

గోవా నుంచి తెచ్చి.. స్థానిక లేబుళ్లు ముద్రించి..

గోవా నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి జిల్లాకు తరలించి దందా నడుపుతున్న వారి ఆట కట్టించారు జిల్లా పోలీసులు.

Published : 22 Sep 2023 01:38 IST

అక్రమ మద్యం రాకెట్‌ గుట్టు రట్టు
అయిదుగురు నిందితుల అరెస్టు

నిందితులతో అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ సుధీర్‌బాబు, సెబ్‌ ఇన్‌స్పెక్టర్‌ లత

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే:  గోవా నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి జిల్లాకు తరలించి దందా నడుపుతున్న వారి ఆట కట్టించారు జిల్లా పోలీసులు. గత కొన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దోపిడీకి  స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) చెక్‌ పెట్టింది. అయిదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 416 గోవా మద్యం సీసాలు, 282 ఏపీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలులోని సెబ్‌ సర్కిల్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ ఎం.సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. కొత్తపట్నం మండలం చిన్నంగారిపట్టపుపాలేనికి చెందిన మేకల బాబు, ఊళ్లపాలెం గ్రామానికి చెందిన అరవ పవన్‌ తమకు పరిచయం ఉన్న వ్యక్తులతో గోవా నుంచి తక్కువ ధరకు మద్యం రప్పించి స్థానికంగా బెల్టు దుకాణాల నిర్వాహకులకు విక్రయిస్తున్నారనే సమాచారంతో సెబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.లత, ఎస్సై గోపాలకృష్ణ ఆధ్వర్యంలోని బృందం గత కొన్నిరోజులుగా నిఘాపెట్టారు. వారి కదలికలపై కన్నేసి గురువారం పక్కా ఆధారాలతో అరెస్టు చేశారు. పట్టుబడిన బాబు, పవన్‌ గతంలోనూ ఇదే తరహాలో నేరం చేస్తూ పట్టుబడ్డారు. అయినా వారి తీరులో మార్పు రాలేదు.

కంటెయినర్‌లో తీసుకొచ్చి..: గోవా నుంచి కంటెయినర్‌లో మద్యాన్ని జిల్లాకు తరలించిన వ్యక్తి కూడా పాత నేరస్థుడేనని అధికారులు చెప్పారు. అతనితో పాటు గోవాలో వీరికి మద్యం సరఫరా చేసిన ఫ్రాన్సిస్‌ను కూడా నిందితుడిగా చేర్చారు. ఇక ఈ మద్యాన్ని బెల్టు దుకాణాల ద్వారా విక్రయాలు జరుపుతున్న వాయిల వెంకటేశ్వర్లు, వాయిల తిరుపతి, కటారి వెంకట్రావులను సైతం అరెస్టు చేసి రిమాండ్‌కు  తరలిస్తున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి రూ.మూడు లక్షల విలువైన మద్యంతో పాటు రవాణాకు వినియోగిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ దాడిలో కీలకపాత్ర పోషించిన సీఐ లత, ఎస్సై గోపాలకృష్ణ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్సై కోటేశ్వరరావు, హెడ్‌ కానిస్టేబుల్‌ కె.శ్రీనివాసరావు, కానిస్టేబుల్‌ ఎల్‌.హరిబాబులను ప్రత్యేకంగా అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని