logo

శస్త్ర చికిత్స చేస్తుండగా పసికందు మృతి

వైద్యుల నిర్లక్ష్యం వల్లే పసికందు మృతి చెందిందని బాలింత బంధువులు ఆందోళనకు దిగారు.

Published : 22 Sep 2023 01:38 IST

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన

వైద్యశాల వద్ద బాధితుల నిరసన

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : వైద్యుల నిర్లక్ష్యం వల్లే పసికందు మృతి చెందిందని బాలింత బంధువులు ఆందోళనకు దిగారు. స్థానిక గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాల వద్ద గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. వైఎస్సార్‌ కడప జిల్లా కాశినాయన మండలం నరసాపురానికి చెందిన జమాల్‌ సాబ్‌ తన భార్య హసీనాను కాన్పు కోసం సోమవారం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో  చేర్పించారు. హసీనా కడుపులో ఉన్న శిశువు బరువు తక్కువగా ఉండటంతో గురువారం ఉదయం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాల గైనకాలజిస్టు జమయ్మ శస్త్ర చికిత్స చేసి బయటకు తీశారు. తల్లి కడుపులో ఉన్న సమయంలో ఉమ్మ నీరు పసికందు ఊపిరితిత్తుల్లోకి చేరడంతో బయటకు తీసిన కొద్దిసేపటికే మృతి చెందిందని వైద్యశాల పర్యవేక్షకుడు డా.సూరిబాబు తెలిపారు.

పోలీసుల రంగ ప్రవేశంతో..

వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్లే తాము బిడ్డను కోల్పోయామని హసీనా బంధువులు గురువారం ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న సీఐ దేవప్రభాకర్‌, ఎస్‌ఐ మహేష్‌ అక్కడికి చేరుకుని బాధితురాలి బంధువులను వైద్యాధికారుల వద్దకు తీసుకెళ్లి సంప్రదింపులు జరిపారు. శిశువు బరువు తక్కువగా ఉండటం.. ఉమ్మ నీరు ఊపిరితిత్తుల్లోకి పోవడం వల్లే పరిస్థితి విషమించి మృతి చెందిందని వైద్య నిపుణులు చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని