logo

జగన్‌ మామది మోసమమ్మా.. నాన్నని డబ్బులు పంపమనవా!

బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుకునే సంక్షేమ వసతి గృహాలు కాస్తా సం‘క్షామ’ గృహాలుగా మారిపోయాయి. గిరిజన సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలకు గత మూడేళ్లుగా; బీసీ, ఎస్సీ వసతి గృహాల్లోని విద్యార్థులకు

Updated : 25 Sep 2023 07:07 IST

అందని సబ్బులు, తలనూనె సొమ్ములు
ఎస్టీ, ఎస్సీ, బీసీ విద్యార్థుల ఎదురుచూపులు

బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుకునే సంక్షేమ వసతి గృహాలు కాస్తా సం‘క్షామ’ గృహాలుగా మారిపోయాయి. గిరిజన సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలకు గత మూడేళ్లుగా; బీసీ, ఎస్సీ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఏడు నెలలుగా కాస్మోటిక్‌ ఛార్జీల చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండేది అధికంగా పేద పిల్లలు. తాము పడుతున్న కష్టం తమ పిల్లలకు ఉండకూడదన్న ఉద్దేశంతో కిలో మీటర్ల మేర దూరంలో ఉన్న వసతి గృహాలకు పంపుతున్నారు. ఉచిత వసతి, భోజనంతో పాటు, ఇతరత్రా చేతి ఖర్చులకు ప్రభుత్వమే డబ్బులు ఇస్తుందని భావించి చేర్పిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా పరిస్థితులున్నాయి. ప్రభుత్వం మాత్రం నెలవారీ కాస్మోటిక్‌ ఛార్జీల నగదు ఇవ్వడం లేదు. దీంతో తలకు నూనె కొనాలన్నా.. స్నానానికి సబ్బు కావాలన్నా ఇంటి వైపు చూడక తప్పడం లేదు. విధి లేక ప్రతి నెలా తమ తల్లిదండ్రులకు విద్యార్థులు ఫోన్‌ చేసి ఖర్చులకు డబ్బులు పంపమని అడగడం పరిపాటిగా మారింది.

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

ఒంగోలు సంతపేటలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల పుస్తక పఠనం

అందించాల్సిన నగదు ఇలా...: గిరిజనుల విద్యాభివృద్ధి కోసం ఆ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పాఠశాలలు, వసతి గృహాలను ప్రభుత్వం నడుపుతోంది. ఇందులోని విద్యార్థులకు ప్రతి నెలా కాస్మోటిక్‌ ఛార్జీల కింద 3వ తరగతి నుంచి 6వ తరగతి బాలికలకు రూ.110; బాలురకు రూ.100 అందజేయాల్సి ఉంది. 7 నుంచి 10వ తరగతి వరకు బాలికలకు రూ.160, బాలురకు రూ.125 చొప్పున తలనూనె, సబ్బులు, ఇతర సామగ్రి కొనుగోలుకు ఇస్తుంటుంది. అన్ని తరగతులకు చెందిన బాలురకు రూ.30 చొప్పున హెయిర్‌ కంటింగ్‌ ఛార్జీల కింద అదనంగా విడుదల చేస్తుంది. కరోనాకు ముందు విద్యార్థులకు ప్రతి నెలా చెల్లించే కాస్మోటిక్‌ ఛార్జీలను గిరిజన సొసైటీ ద్వారా అందించేవారు. సదరు నగదు మొత్తాన్ని సొసైటీలకు ప్రభుత్వం చెల్లించేది.

నేరుగా అంటూ పూర్తిగా నిలిపేసి...: విద్యార్థుల బ్యాంక్‌ ఖాతాలకే నేరుగా కాస్మోటిక్‌ ఛార్జీలను చెల్లించనున్నట్లు 2020 ఆగస్టులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2020 ఏప్రిల్‌ నుంచి విద్యార్థులకు నిధుల విడుదల నిలిచిపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా జూన్‌ నెలలో వసతి గృహాలు ప్రారంభమయ్యాయి. నాలుగు నెలలు కావస్తున్నా నేటికీ కాస్మోటిక్‌ ఛార్జీల ఊసేలేదు. దీంతో విద్యార్థులు ఇంటికెళ్లి తమ అవసరాల నిమిత్తం డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఇది వారి తల్లిదండ్రులకు భారంగా మారింది.

బీసీ, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే వసతి గృహాల్లోని విద్యార్థులకు ఈ ఏడాది జనవరి నెల వరకు కాస్మోటిక్‌ ఛార్జీలు అందజేశారు. గత విద్యా సంవత్సరంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌; ప్రస్తుత సంవత్సరానికి జూన్‌, జులై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలకు విడుదల కావాల్సి ఉంది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు కావస్తున్నా ఇంతవరకు నగదు చేతికి అందలేదు. దీంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులను ఆశ్రయిస్తున్నారు.


సీఎఫ్‌ఎంఎస్‌లో తీసుకోవడం లేదు...

వసతి గృహాల్లోని విద్యార్థులకు జనవరి నెల వరకు కాస్మోటిక్‌ ఛార్జీలను వారి బ్యాంక్‌ ఖాతాలకు జమ చేశాం. ఆ తర్వాత నుంచి కొంతమేర జాప్యం చోటుచేసుకున్నప్పటికీ ప్రస్తుతం బడ్జెట్‌ వచ్చింది. జూన్‌ నెల నుంచి ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు పెరిగిన బిల్లులు అప్‌లోడ్‌ చేసినా సీఎఫ్‌ఎంఎస్‌లో తీసుకోవడం లేదు. త్వరలోనే సాంకేతిక సమస్య పరిష్కారం కానుంది. 

అంజల, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని