logo

అన్నీ ఉన్నా.. ప్రకాశించని పర్యాటకం

మారుతున్న జీవనశైలి కారణంగా తమ విధులు.. వృత్తి రీత్యా ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారంలో ఒక్కరోజైనా కుటుంబ సభ్యులతో సేదతీరాలనుకుంటుంటారు.

Updated : 27 Sep 2023 06:04 IST

గత ప్రభుత్వ పనులే నేటికీ దిక్కు
సందర్శకులకు అసౌకర్యాల వెక్కిరింతలు
అభివృద్ధి ఊసే పట్టని పాలకులు

పాకల బీచ్‌లో అసంపూర్తిగా ఉన్న విశ్రాంతి, రెస్టారెంట్‌ భవనం

మారుతున్న జీవనశైలి కారణంగా తమ విధులు.. వృత్తి రీత్యా ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారంలో ఒక్కరోజైనా కుటుంబ సభ్యులతో సేదతీరాలనుకుంటుంటారు. వారాంతంలో కొద్దిపాటి ఉల్లాసాన్ని కోరుకోవడం సహజం. జిల్లాకు అయిదు మండలాల పరిధిలో 52 కి.మీ మేర విశాలమైన కోస్తా తీర ప్రాంతం ఓ ప్రత్యేకత. ఇందులో బీచ్‌ల ఏర్పాటుకు అనువైన స్థలాలు ఎన్నో. గుండ్లకమ్మ జలాశయంతో పాటు, సీఎస్‌పురం మండలం భైరవకోన పర్యాటక ప్రాంతంగా మంచి గుర్తింపు పొందాయి. తీర ప్రాంతంతో పాటు, సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ, త్రిపురాంతకం అమ్మవారి దేవస్థానం ప్రాంతాలు పర్యాటకాభివృద్ధికి అనుకూలం. ఆయాచోట్ల తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులతో చేసిన పనులే ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. ఆ తర్వాత అసంపూర్తిగా మిగిలినవి నేటికీ అలానే వదిలేశారు. దీంతో ప్రభుత్వ పరంగా కనీస వసతులు లేక ఎక్కడకు వెళ్లినా వసతులు లేక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని బుధవారం నిర్వహించుకోనున్న సందర్భంగా జిల్లాలో అటకెక్కిన ప£ర్యాటక ప్రాంతాల అభివృద్ధిని తెలుపుతూ కథనం.

న్యూస్‌టుడే, కొత్తపట్నం

పాకలలో పక్కన పెట్టేశారు...

కొత్తపట్నం, సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లు జిల్లాలో పేరెన్నికగన్నవి. ఆదివారం వస్తే ఆయా ప్రాంతాలు సందర్శకులతో కోలాహలంగా మారతాయి. అయినా ప్రభుత్వ పరంగా విశ్రాంత గదులు, వ్యక్తిగత మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కూడా లేవు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు తప్పడం లేదు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలన్నా, ప్రత్యేకించి సముద్ర స్నానం అనంతరం మహిళలు దుస్తులు మార్చుకోవాలన్నా సమస్యగా మారింది. వారాంతపు సెలవు దినాల్లో ఒంగోలు నగరానికి చెందిన ఉద్యోగులు, వ్యాపారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా కొత్తపట్నం బీచ్‌కు అధిక సంఖ్యలో వస్తుంటారు. కనిగిరి, కొండపి, కందుకూరు నియోజకవర్గ పరిధిలోని మండలాల నుంచి పాకల తీరానికి వెళ్తుంటారు. ఆ రెండు రోజుల్లో కనీసం రెండు వేల మందికి పైగానే సందర్శిస్తుంటారు. గత ప్రభుత్వ హయాంలో పాకల బీచ్‌లో విశ్రాంతి భవనం, రెస్టారెంట్‌, సీసీరోడ్డు, ఎల్‌ఈడీ దీపాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణ నిమిత్తం రూ.4 కోట్ల మేర నిధులు మంజూరయ్యాయి. అందులో తొలి విడతగా రూ.2 కోట్ల నిధులతో పనులు ప్రారంభించారు. ఆ తర్వాత నిధులు లేని కారణంగా పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఎల్‌ఈడీ దీపాలున్నా నిర్వహణ లేదు.

మధ్యలోనే నిలిచిన  నిర్మాణాలు...

సీఎస్‌పురం మండలం భైరవకోనలో త్రిముఖ దుర్గాంభదేవి కొలువై ఉన్నారు. చోళుల కాలంలోనే ఒకే రాతిపై అమ్మవారి విగ్రహం చుట్టూ ఎనిమిది ఆలయాలు నిర్మించారు. పక్కనే జలపాతం ఉంది. కొండల పైనుంచి వర్షాకాలం సీజన్‌లో నిరంతరం నీళ్లు పడుతుంటాయి. కార్తిక మాసంతో పాటు, మహా శివరాత్రి రోజున ఏటా వేల మంది భక్తులు ఆ నీటితో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇతర రోజుల్లోనూ జిల్లా వాసులతో పాటు, పొరుగు జిల్లాల భక్తులు, పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఎప్పటి నుంచో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్‌ ఉన్నా కనీస వసతులు కూడా సమకూర్చలేకపోయారు. తెదేపా ప్రభుత్వ హయాంలో వాటర్‌ పాల్‌, పార్కులు, సందర్శకుల విశ్రాంతి ప్రాంతం, అతిథి గృహం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. గతంలో కొన్ని పనులకు నిధులు మంజూరైనా 2019 తర్వాత ప్రారంభించకపోవడంతో రద్దు చేశారు. విశ్రాంతి గదులు, వాటర్‌ పాల్‌, కాటేజీ, పరిపాలనా భవన నిర్మాణాలు మధ్యలోనే ఆగాయి. తాగునీటి వసతి, మరుగుదొడ్లు నిర్మాణం ఊసేలేదు.

ప్రారంభానికి నోచక  నాలుగున్నరేళ్లు...

ఒంగోలు నగరానికి 14 కిలో మీటర్ల దూరంలోనే గుండ్లకమ్మ జలాశయం ఉంది. ఆదివారంతో పాటు, ఇతర సెలవు దినాల్లో ఒంగోలుకు చెందిన ఎక్కువ శాతం ఉద్యోగులు, నగర వాసులు తమ కుటుంబ సభ్యులతో ఈ ప్రాజెక్ట్‌కు వెళ్తుంటారు. ప్రత్యేకించి ఆదివారం పర్యాటకుల తాకిడితో ఆ ప్రాంతం రద్దీగా ఉంటుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2009లో బోటింగ్‌ ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.2.63 కోట్ల నిధులతో ఎనిమిది కాటేజీలు, రెస్టారెంట్‌, ఈత కొలను నిర్మించారు. అయినా నాలుగున్నరేళ్లగా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో ప్రజాధనం వృథాగా మారింది. వీటిని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు