logo

ఒంగోలులో భూబకాసురులు

ఏదైనా స్థిరాస్తిపై కన్నేశారంటే పాత తేదీలతో వీలునామాలు పుట్టిస్తారు. ఆగమేఘాలపై దొంగ రిజిస్ట్రేషన్లు పూర్తిచేస్తారు. సొంతదారు తేరుకునేలోపే స్థలాన్ని వివాదాల్లోకి లాగుతారు. నయానో భయానో బెదిరించి రాజీకి రప్పిస్తారు.

Updated : 27 Sep 2023 06:07 IST

నకిలీ వీలునామాల తయారీ
ఆనక దొంగ రిజిస్ట్రేషన్ల సృష్టి
వివాదాలు కల్పించి దోపిడీ

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ మలికా గార్గ్‌.. చిత్రంలో ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఏదైనా స్థిరాస్తిపై కన్నేశారంటే పాత తేదీలతో వీలునామాలు పుట్టిస్తారు. ఆగమేఘాలపై దొంగ రిజిస్ట్రేషన్లు పూర్తిచేస్తారు. సొంతదారు తేరుకునేలోపే స్థలాన్ని వివాదాల్లోకి లాగుతారు. నయానో భయానో బెదిరించి రాజీకి రప్పిస్తారు. రూ.లక్షల్లో ముట్టజెబితే స్థలం తిరిగి సొంతదారు పరమవుతుంది. లేదని అడ్డం తిరిగితే న్యాయ వివాదంలోకి వెళ్తుంది. అనంతరం రాజీకి అవకాశం కల్పిస్తారు. ధర వారే నిర్ణయిస్తారు. ముట్టజెబితే అంతటితో వదిలేస్తారు. లేదంటే తాము చెప్పిన ధరకే విక్రయించాలని హుకుం జారీ చేస్తారు. ఇదీ ఒంగోలు కేంద్రంగా సాగుతున్న భూ బకాసురుల ఆగడాలు. వీరి దందాకు పోలీసులు ఎట్టకేలకు చెక్‌ పెట్టారు. నలుగురిని మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా నకిలీ రిజిస్ట్రేషన్‌ పత్రాలు, వీలునామాలు, పెద్దఎత్తున స్టాంపులు స్వాధీనం చేసున్నారు.

  • గుట్టలుగా నకిలీ స్టాంపులు, పత్రాలు..: లాయర్‌పేటకు చెందిన ఓ వ్యక్తిని ఒంగోలు తాలూకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంట్లో తనిఖీ చేస్తుండగా లభించిన నకిలీ స్టాంపులు, పత్రాలను చూసి అవాక్కయ్యారు. గుట్టలు గుట్టలుగా ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, తాలూకా సీఐ భక్తవత్సలరెడ్డి నిందితుడిని విచారించారు. అతనిచ్చిన సమాచారం ఆధారంగా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలు నగరంలో ఇటీవల కాలంలో సుమారు 400 నకిలీ పత్రాలు సృష్టించి సంబంధిత భూములను వివాదాల్లోకి లాగినట్లు ప్రాథమిక విచారణలో భాగంగా తెలుసుకున్నారు. రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తుల ద్వారా వాటిని సెటిల్‌ చేసినట్లు గుర్తించారు. ఇందులో ప్రమేయం ఉన్న వ్యక్తులు అధికార పార్టీలో పలుకుబడి కలిగిన వారు కావటంతో పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది.

నలుగురు నిందితుల అరెస్టు..: మలికా గార్గ్‌, ఎస్పీ

నకిలీ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల కేసులో ఒంగోలుకు చెందిన లాయర్‌పేట నాలుగోలైనుకు చెందిన చితిరాల పూర్ణచంద్రరావు, రాజాపానగల్‌ రోడ్డు నాలుగో లైన్‌ నివాసి అయినాబత్తిన యానాదిరావు, సంతపేటకు చెందిన గొర్రెపాటి రవీంద్రబాబు, సీతారామపురానికి చెందిన మేడికొండల విష్ణువర్ధన్‌లను అరెస్టు చేసినట్లు ఎస్పీ మలికా గార్గ్‌ వెల్లడించారు. వీరి వద్ద నుంచి భారీగా నకిలీ పత్రాలు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు సుమారు పదిహేనేళ్లుగా నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడినట్లు తెలిసిందని చెప్పారు. ఈ కేసులో మరికొందరు నిందితులున్నారని, వారిని కూడా అరెస్టు చేసి విచారించనున్నట్లు తెలిపారు. వీరి చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, తాలూకా పోలీసు స్టేషన్లలో సంప్రదించి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. నిందితుల అరెస్టు, నకిలీ పత్రాలు జప్తు చేసిన సీఐ భక్తవత్సలరెడ్డి, ఎస్సై మల్లిఖార్జునరావు, హెడ్‌ కానిస్టేబుల్‌ ఏడుకొండలు, కానిస్టేబుళ్లు హనోక్‌, శ్రీనివాసరావు, రత్తయ్య, హోంగార్డు వాసులను ఎస్పీ గార్గ్‌ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని