logo

ఉప్పుగుండూరులో స్వాహాపర్వం

అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నా అడ్డుకునేవారు కరువయ్యారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు పంచాయతీలో జల్‌జీవన్‌ మిషన్‌ నిధుల్ని ఆ పార్టీ నేతలు దిగమింగినా చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. 

Published : 27 Sep 2023 03:57 IST

వైకాపా నేతల జేబుల్లోకి జల్‌జీవన్‌ నిధులు

ఉప్పుగుండూరు పంచాయతీ కార్యాలయం

అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నా అడ్డుకునేవారు కరువయ్యారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు పంచాయతీలో జల్‌జీవన్‌ మిషన్‌ నిధుల్ని ఆ పార్టీ నేతలు దిగమింగినా చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. 

న్యూస్‌టుడే, నాగులుప్పలపాడు: నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు పంచాయతీ అవినీతికి అడ్డాగా మారింది. ప్రత్యేకాధికారుల పాలన నుంచి ..తాజాగా జలజీవన్‌ నిధుల దుర్వినియోగం వరకూ అక్రమార్కులు ఆడిందే ఆటగా మారింది. కుళాయిలు లేని ఇళ్లకు ఉచితంగా కనెక్షన్లు మంజూరు చేసి నీళ్లు అందించాలన్నది జలజీవన్‌ మిషన్‌ లక్ష్యం. ఇందులో భాగంగా ఉప్పుగుండూరు పంచాయతీకు రూ. 55 లక్షలు మంజూరయ్యాయి. గ్రామసభ నిర్వహించి కుళాయిల ఏర్పాటుకు తీర్మానం చేయాల్సివుండగా, ఇదెక్కడా అమలు జరగలేదు. స్థానికంగా 53 మందికి కనెక్షన్లు మంజూరుకాగా, అధికార పార్టీ నేతలు చక్రంతిప్పి ఇప్పటికే కుళాయిలున్న 30 మందికి వీటిని మంజూరు చేయించినట్లు చూపించి నిధులు దిగమింగారు.

తీర్మానం లేకుండానే..

ఎలాంటి తీర్మానం లేకుండా కుళాయిలు ఎలా మంజూరు చేశారని ఈ నెల 19న పంచాయతీ పాలకవర్గ సమావేశంలో వార్డు మెంబర్లు ప్రశ్నించడంతో ఈ దోపిడీ పర్వం వెలుగులోకి వచ్చింది. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉండగా, ఒకే సామాజిక వర్గానికి ఎలా మంజూరు చేశారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా తమ పేర్లు జాబితాలో ఎలా చేర్చారని వారు నిలదీస్తున్నారు. ఇందులో పంచాయతీ సిబ్బంది పేర్లు కూడా ఉండటం విశేషం.

గతంలోనూ ఇదే తీరు..

రెండేళ్ల క్రితం ఉప్పుగుండూరులో కుళాయి కనెక్షన్ల మంజూరులో రూ. 25 లక్షల అవినీతి జరిగింది. అప్పట్లో ఒక్కో కనెన్షన్‌ ఇవ్వడానికి దాదాపు రూ.15వేల చొప్పున దండుకున్నారు. ఇటీవల స్వయంగా సర్పంచి జయమ్మ పంచాయతీలో తాజాగా నిధుల దుర్వినియోగం జరుగుతోందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై డీఎల్‌పీవో పద్మావతి ఇరవై రోజుల క్రితం విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని