logo

పొరుగు మద్యం కట్టడికి సరిహద్దుల్లో నిఘా

ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం జిల్లాలోకి తరలిరాకుండా సరిహద్దు స్టేషన్లలో నిఘా తీవ్రతరం చేయాలని జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ ఆదేశించారు.

Updated : 27 Sep 2023 06:09 IST

జిల్లా ఎస్పీ  మలికా గార్గ్‌

ప్రశంసా పత్రాలు పొందిన సెబ్‌ అధికారులు, సిబ్బందితో  జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం జిల్లాలోకి తరలిరాకుండా సరిహద్దు స్టేషన్లలో నిఘా తీవ్రతరం చేయాలని జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ ఆదేశించారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) అధికారులతో ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సెబ్‌ అధికారులు సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకుని అక్రమ మద్యంపై నిఘా పెంచి అక్రమార్కులను కట్టడి చేయాలని సూచించారు. గంజాయి, సారా నిరోధానికి కృషి చేయాలని చెప్పారు. గంజాయి ఎక్కడి నుంచి రవాణా జరుగుతోంది, వినియోగదారులు ఎవరనేది గుర్తించి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా, జూదం కట్టడికి పక్కా ప్రణాళికతో కృషి చేయాలన్నారు. జిల్లాలో గంజాయి, సారా కట్టడికి కృషిచేసిన సెబ్‌ సీఐ రాగమయి, ఎస్సైలు శ్రీనగేష్‌, ఎం.వి.గోపాలకృష్ణ, కె.శ్రీనివాసులు, సిబ్బంది శామ్యూల్‌, శ్రీనివాసులు, మాధవరావు, వెంకటేశ్వర్లుకు సెబ్‌ కమిషనర్‌ రవిప్రకాష్‌ పంపించిన ప్రశంసాపత్రాలను ఎస్పీ గార్గ్‌ అందజేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యాన్ని పట్టుకోవటంలో ప్రతిభచూపిన ఇన్‌స్పెక్టర్‌ వంశీధర్‌, సెబ్‌ సీఐ బి.లత, మార్కాపురం సీఐ రాగమయి, సింగరాయకొండ ఎస్సై దయాకర్‌, డీటీఎఫ్‌ ఎస్సైలు శ్రీనివాసులు, గోపాలకృష్ణ, సిబ్బంది కోటేశ్వరరావు, హరిబాబులను ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, సెబ్‌ ఏఈఎస్‌లు సుధీర్‌బాబు, దేవదత్‌ తదితరులు పాల్గొన్నారు.


తపాలా ఖాతాదారులకు కుచ్చుటోపీ!

రూ.10 లక్షలకు పైగా నగదు జమ చేయని ఉద్యోగి

కురిచేడు, న్యూస్‌టుడే: తపాలా ఖాతాదారులకు ఓ ఉద్యోగి కుచ్చుటోపీ పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లో కెళితే.. పుల్లలచెరువు మండలం మర్రివేముల గ్రామానికి చెందిన పమిడి భావన్నారాయణ తన అత్తగారి గ్రామమైన కురిచేడు మండలం పడమర వీరాయపాలెంలో ఉంటూ దర్శి మండలం చలివేంద్ర గ్రామంలోని తపాలా కార్యాలయంలో బీపీఎంగా పనిచేస్తున్నారు. ఆరు నెలలుగా పలువురు ఖాతాదారుల దగ్గర ఆర్డీ రూపంలో నగదు వసూలు చేసి వారి ఖాతాల్లో జమ చేయకుండా కేవలం పుస్తకాల్లో మాత్రమే రాసి చూపించారు. ఈ విషయాన్ని గుర్తించిన కొంతమంది ఖాతాదారులు నెలరోజుల క్రితం తపాలా కార్యాలయానికి వెళ్లి నిలదీయగా మోసం వెలుగుచూసింది. సుమారు రూ.10 లక్షలకు పైగా నగదు గల్లంతు చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు కార్యాలయానికి వచ్చి పూర్తి విచారణ చేయకుండా మమ అనిపించారు. ఖాతాదారులు పలుమార్లు భావన్నారాయణను తమ నగదు తిరిగి చెల్లించాలని కోరారు. కొంత సమయం ఇస్తే అందరి డబ్బులు చెల్లిస్తానని చెప్పి అతడు కాలయాపన చేస్తుండటంతో వారు మోసపోయినట్లు గుర్తించి తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. కాగా, తన భర్త వారం రోజుల నుంచి కనిపించడం లేదని భావన్నారాయణ భార్య మల్లేశ్వరి కురిచేడు పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ విఘ్నేష్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని