logo

పెళ్లి చేసుకుంటావా! చావ మంటావా!!

పెళ్లి చేసుకుంటావా... చావ మంటావా అంటూ ఓ సైకో నాలుగు నెలలుగా వెంటపడుతుండటంతో ఆ విద్యార్థిని మనో వేదనకు గురైంది. తన వారికి చెప్పుకోలేక.. వేధింపులు తట్టుకోలేక విలవిల్లాడింది.

Updated : 27 Sep 2023 09:27 IST

వేధింపులతో విద్యార్థిని మౌన వేదన
ఎట్టకేలకు సైకోపై పోలీసులకు ఫిర్యాదు

కనిగిరి, న్యూస్‌టుడే: పెళ్లి చేసుకుంటావా... చావ మంటావా అంటూ ఓ సైకో నాలుగు నెలలుగా వెంటపడుతుండటంతో ఆ విద్యార్థిని మనో వేదనకు గురైంది. తన వారికి చెప్పుకోలేక.. వేధింపులు తట్టుకోలేక విలవిల్లాడింది. ఎట్టకేలకు తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసుల్ని ఆశ్రయించగా, నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కనిగిరి పట్టణంలోని పాతూరు ప్రాంతానికి చెందిన బాలిక  పట్టణంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తల్లి ఒప్పంద  ఉద్యోగి, తండ్రి పనుల నిమిత్తం తెలంగాణ ప్రాంతంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి చదివే ఆ బాలిక, తన చెల్లెల్ని తోడుగా తీసుకుని ప్రతి రోజు పాఠశాలకు వెళ్తుండేది. పట్టణంలోని అదే ప్రాంతానికి చెందిన షేక్‌ నాయబ్‌ రసూల్‌ అనే ఆకతాయి ప్రతిరోజు ప్రేమించమని ఆమె వేధిస్తుండేవాడు. మోటార్‌ సైకిల్‌తో వెంటపడడం.. ప్రేమించవా .. పెళ్లి చేసుకోవా అంటూ బెదిరించేవాడు. నాలుగు నెలలుగా ఈ వెకిలిచేష్టలను ఆమె మౌనంగా భరించింది. దీన్ని అలుసుగా తీసుకున్న జులాయి మరింత పేట్రేగిపోయి తల్లిదండ్రులకే ఫోన్లు చేసి బెదిరించసాగాడు. దీంతో ఆందోళనకు గురైన తండ్రి తెలంగాణ నుంచి కనిగిరి వచ్చి ఈ నెల 23న పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదుచేయగా, వారు బయట తేల్చుకోండంటూ చెప్పారు. ఆ విషయం తెలిసి సైకో మరింతగా రెచ్చిపోవడంతో తల్లిదండ్రులు ఈ నెల 25న తిరిగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐ ప్రసాద్‌ నిందితుడు నాయబ్‌ రసూల్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.  


అత్యాచారానికి పాల్పడిన బేల్దారీ మేస్త్రి అరెస్టు

దర్శి, న్యూస్‌టుడే: బాలికపై అత్యాచారానికి పాల్పడిన బేల్దారీ మేస్త్రిని పోలీసులు అరెస్టు చేశారు. దర్శి సీఐ రామకోటయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కెల్లంపల్లి పంచాయతీ పరిధిలోని ఓ గ్రామంలో బాలిక తన తల్లి, తమ్ముడితో కలిసి ఉంటోంది. ఈ నెల 22న అత్యవసర పని మీద వారు ముగ్గురు పొదిలి మండలం జాపలాపురానికి బయలుదేరారు. అయితే ఆటో అందుబాటులో లేకపోవడంతో దగ్గరి బంధువైన బేల్దారి మేస్త్రీ వెంకటరావును అక్కడికి తీసుకెళ్లాల్సిందిగా బాలిక తల్లి కోరింది. అతను తన ద్విచక్ర వాహనంపై వారిని అక్కడ వదిలిపెట్టాడు. 23న తన పిల్లలిద్దర్నీ స్వగ్రామంలో వదిలిపెట్టమని బాలిక తల్లి కోరడంతో అతను వారిని అక్కడికి తీసుకెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక ఇంటి దగ్గర్లోనే ఉంటున్న అమ్మమ్మకు తెలిపింది. దీంతో బాధితులు 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ రామకోటయ్య, ఎస్సై కృష్ణయ్య తన సిబ్బందితో రెండు బృందాలుగా ఏర్పడి సోమవారం రాత్రి ఉల్లగల్లు వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. మంగళవారం కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. కేసును త్వరితగతిన పరిష్కరించిన పోలీసులను జిల్లా ఎస్పీ, డీఎస్పీ  అభినందించారు.


కుటుంబ కలహాలతో గృహిణి బలవన్మరణం

అర్థవీడు, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో ఓ గృహిణి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మాగుటూరులో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నల్లబోతుల ఆదిలక్ష్మి(32)పై అనుమానం పెంచుకున్న భర్త రోజూ వేధిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం కూడా ఘర్షణ పడినట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన ఆదిలక్ష్మి సోమవారం రాత్రి అందరూ నిద్రించిన తర్వాత విష రసాయనం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న హౌస్‌ రైటర్‌ గోపాల్‌రాజు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలున్నారు.


నిమజ్జనానికి వెళ్లి యువకుడి దుర్మరణం

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు పరిధిలో పద్మనాభకుంటలో సోమవారం రాత్రి గల్లంతైన యువకులు మృతి చెందారు. గ్రామీణ ఎస్సై రాజేష్‌ కేసు నమోదు చేశారు. ముఖేష్‌తో కలిసి ప్రమాదంలో మృతి చెందిన మరో యువకుడు భాగ్యం ప్రవీణ్‌ తల్లిదండ్రులు పుల్లయ్య, విజయమ్మ. వారికి నలుగురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. చివరివాడు ప్రవీణ్‌. ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి వచ్చి పదేళ్ల క్రితం వచ్చి పనులు చేసుకంటూ బతుకుతున్నారు. కుమారుడి మృతితో ఆ కుటుంబం కూడా విషాదంలో మునిగింది.


రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

పీసీపల్లి: ట్రాక్టర్‌, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన బేల్దారి మేస్త్రీ బాలచెన్నారెడ్డి (43) చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గోపవరపువారిపల్లికి చెందిన బాలచెన్నారెడ్డి తన భార్యతో కలసి సోమవారం రాత్రి పీసీపల్లి నుంచి శంకరాపురానికి  ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మార్గంమధ్యలో వేగంగా దూసుకొచ్చిన ట్రాక్టర్‌, ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బాలచెన్నారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని  ఒంగోలులోని ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. మృతుడికి భార్య వెంగమ్మ, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని