అర్హులకు మరో అవకాశం
- న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్
* జలుమూరు మండలం రోణంకి పంచాయతీ కె.ఎల్.ఎన్ పేటకు చెందిన అప్పారావుకు గతంలో అధికారులు చేపట్టిన ఆరంచెల పరిశీలనలో కారు ఉందనే కారణంతో పింఛను తొలగించారు. ఆయనకు కారు లేదని ఆర్టీవో అధికారులు ధ్రువీకరించినా ఇప్పటికీ పునరుద్ధరించలేదు.
* శ్రీకాకుళం గ్రామీణ మండలం చాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి భూమి ఎక్కువగా ఉందని ఆన్లైన్లో తప్పుగా సమాచారం అప్లోడ్ చేయడంతో పింఛనుకు దూరమయ్యాడు.
నవశకం సర్వేలో దొర్లిన తప్పిదాలు, గ్రామ సచివాలయ సిబ్బంది ఆన్లైన్లో సమాచారం తప్పుగా పొందుపరచడం, సరైన ధ్రువపత్రాలు లేకపోవడం వంటి కారణాలతో పలువురు అన్ని అర్హతలున్నప్పటికీ పింఛన్లకు దూరమయ్యారు. ‘స్పందన’లో ఇలాంటి ఫిర్యాదులే ఎక్కువగా వస్తుండటంతో ప్రభుత్వం అర్హులందరికీ మరో అవకాశాన్ని కల్పించింది.
నవశకం సర్వే తర్వాత జిల్లాలో 30 వేల మంది పింఛను లబ్ధిదారులపై అనర్హత వేటు పడింది. ఆరంచెల పరిశీలనలో దఫ దఫాలుగా మరో 40 వేల మంది లబ్ధికి దూరమయ్యారు. సిబ్బంది చేసిన పొరపాట్ల కారణంగా మరో తొమ్మిది వేల మంది అనర్హులుగా మారినట్లు అంచనా. వీరిలో పింఛను పొందేందుకు అర్హత ఉన్నప్పటికీ తప్పులు సరి చేసుకునేందుకు వీలు లేకపోవడంతో లబ్ధికి నోచుకోలేకపోయారు. అలాంటివారంతా మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఓ అవకాశాన్ని కల్పించింది.
ప్రక్రియ ఇలా..
అర్హత కలిగిన లబ్ధిదారులు రాతపూర్వకంగా దరఖాస్తు, ఆధార్‌కార్డు వివరాలు, పింఛను కోల్పోయిన విధానంపై సంబంధిత అధికారి మంజూరు చేసిన పత్రంతో గ్రామ, వార్డు సచివాలయంలో సంక్షేమ కార్యదర్శి లాగిన్‌లో నమోదు చేయించుకోవాలి. ఆ వివరాలు ఎంపీడీవో, పురపాలిక కమిషనర్ పరిశీలించిన తర్వాత డీఆర్డీఏ పీడీ వద్దకు వస్తాయి. అక్కడి నుంచి సెర్ప్‌కు పంపిస్తారు. అప్పుడు కొత్తగా పింఛనుకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. దరఖాస్తు చేసుకున్నవారికి 21 రోజుల్లో పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి పింఛను మంజూరు చేస్తామని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.
అవకాశాన్ని వినియోగించుకోవాలి...
అర్హులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. సచివాలయ పరిధిలో గ్రామ, వార్డు సంక్షేమ కార్యదర్శులు బాధ్యతాయుతంగా పనిచేసేలా ఆదేశాలిచ్చాం. తప్పులు దొర్లకుండా నమోదు చేయాలని చెప్పాం.
- బి.శాంతిశ్రీ, జిల్లా గ్రామీణాభివృద్ధి పథక సహాయ సంచాలకులు, శ్రీకాకుళం