ప్రాథమిక విద్యనుబలోపేతం చేస్తాం
డీఈవో లింగేశ్వరరెడ్డి
న్యూస్టుడే, శ్రీకాకుళం విద్యావిభాగం
‘ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తే వారి ఉన్నతికి అది దోహదపడుతుంది. ఉపాధ్యాయులు పిల్లల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకోగలిగితేనే అది సాధ్యమవుతుంది. అందరి సహకారంతో జిల్లాలో ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడతాం’ అని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) బి.లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘న్యూస్టుడే’తో మాట్లాడారు. భవిష్యత్తు కార్యాచరణను వివరించారు.
పర్యవేక్షణ పెంచుతాం...: విద్యారంగం పరంగా లక్ష్యాలను సాధించాలంటే పర్యవేక్షణ అవసరం. ఈ విషయంలో కచ్చితంగా ఉంటాం. ఎప్పటికప్పుడు పాఠశాలల తనిఖీలు నిర్వహిస్తాం. మండల విద్యాశాఖాధికారులు ప్రధానోపాధ్యాయులతో నెలకొకసారైనా సమీక్ష జరపాలి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి.
సమయపాలన తప్పనిసరి...: ఉపాధ్యాయులు సమయపాలన తప్పనిసరిగా పాటించాలి. ఉదయం 9 గంటలకు బడిలో ఉండాలి. తనిఖీకి వెళ్లినా ఆ వేళల్లోనే వెళతాను. అందుబాటులో లేనివారిపై చర్యలు తీసుకుంటాం.
పది విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక: పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. వంద రోజుల ప్రణాళిక రూపొందించి అన్ని బడుల్లో కచ్చితంగా అమలయ్యేలా చూస్తాం.
ఫోన్ చేస్తే చాలు..: ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యలను తెలిపేందుకు డీఈవో కార్యాలయానికి ఎవరూ రానవసరం లేదు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే సరిపోతుంది. ఇందుకు ప్రత్యేకంగా ఒక నంబరును త్వరలోనే ఇస్తాం. వచ్చిన ప్రతి సమస్యను దస్త్రంలో నమోదు చేసి సత్వర పరిష్కారానికి కృషి చేస్తాం. ఉపాధ్యాయులు ఎక్కువ సమయాన్ని విద్యార్థులకే కేటాయించాలి.