నిలువునా ముంచేశాడు..!
ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ ముందు బాధితులు
ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, న్యూస్టుడే: సులభంగా డబ్బు సంపాదించవచ్చనే వారి ఆశలపై నీళ్లు చల్లాడు ఆ వ్యక్తి. నమ్మి రూ.కోట్లు పెట్టుబడి పెడితే కోలుకోలేని దెబ్బ తీశాడు. అప్పు చేసిన, బంగారం తాకట్టు పెట్టి తీసుకొచ్చిన సొమ్ముతో పరారు కావడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. ఎచ్చెర్ల మండలం షేర్మహ్మద్పురం గ్రామానికి చెందిన మడ్డి నాగేశ్వరరావు (నగేష్) చేతిలో మోసపోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
విద్యార్థులకు ఎర..
నాగేశ్వరరావు స్థానిక అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి ఎదురుగా సూర్య నెట్ సెంటర్ నడపడంతో పాటు విద్యార్థులకు అవసరమయ్యే ఇతర వస్తువులూ విక్రయించేవాడు. ఇదే సమయంలో విద్యార్థులు, స్థానికులను నమ్మించి ఆన్లైన్ వ్యాపారం పేరిట డబ్బులు వసూలు చేశాడు. మొదట్లో రూ.650 పెడితే నెల రోజుల్లోనే రూ.1,400 ఇచ్చేవాడని బాధితులు చెబుతున్నారు. రూ.1.9 లక్షలు చెల్లిస్తే నెల రోజుల్లో రూ.3.9 లక్షలు తిరిగిచ్చేవాడని వివరించారు. ఈ వ్యాపారం గురించి జిల్లా, రాష్ట్రం సహా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికీ తెలిసి పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టారు. వసూలు చేసిన డబ్బును ధనుష్ యాడ్స్ (తన కుమారుడి పేరిట) వంటి కంపెనీల్లో పెట్టుబడి పెడుతున్నానని నమ్మబలికాడు. ఆయా కంపెనీల గురించి ఆన్లైన్లో వివరాలు కనిపించడంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఒక చిన్న గ్రామం నుంచి ఇంత భారీ స్థాయిలో ఆన్లైన్ వ్యాపారం చేస్తూ అనేక మందిని మోసం చేయడం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విషయం తెలుసుకున్న బాధితులు ఇతర ప్రాంతాల నుంచి సైతం తరలివస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
రూ.కోటి పెట్టుబడి పెట్టాం
తెలిసిన వారి ద్వారా ఈ వ్యాపారం గురించి తెలుసుకుని పెట్టుబడి పెట్టాను. నమ్మకం ఏర్పడిన తర్వాత మా పరిసర ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో కలిపి మొత్తం రూ.కోటి పెట్టుబడి పెట్టాను. మూడు నెలల నుంచి డబ్బులు తిరిగివ్వలేదు. ఇప్పుడు మోసం బయటపడింది. ఏం చేయాలో తెలియడం లేదు.
- ద్వారకామయి, హైదరాబాద్
మోసపోయాం..
ఇక్కడే ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో నగేష్తో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. తొలుత తక్కువ పెట్టుబడికి లాభం రావడంతో మా స్నేహితులకు చెప్పి అందరం కలిసి మొత్తం రూ.40 లక్షలు పెట్టాం. మూడు నెలల నుంచి డబ్బులు చెల్లించలేదు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే బాగోతం బయట పడింది. పోలీసులకు ఫిర్యాదు చేశాను.
- కె.తేజ, కత్తిరివానిపేట, శ్రీముఖలింగం