logo
Published : 07 Dec 2021 05:45 IST

కరుణించరు.. కడుపు నింపరు!

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే బృందం

జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో రోగులకు పెడుతున్న భోజనం ఇది. మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని, కూరల్లో నాణ్యత లోపిస్తోందని రోగులు వాపోతున్నారు. ఇక్కడ పెట్టే అన్నం సరిగా ఉడకడం లేదని, కొన్నిసార్లు ముద్ద అయిపోతోందని, అందుకే బయట నుంచి తెచ్చుకుంటున్నామని కొందరు చెబుతున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పౌష్టికాహారం అందిస్తే వేగంగా కోలుకుంటారని భావించిన ప్రభుత్వం రోగులకు ఆసుపత్రిలోనే భోజనం పెట్టించేలా చర్యలు తీసుకుంది. దాని అమలులో తీవ్ర నిర్లక్ష్యం కారణంగా రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. వైద్య సిబ్బంది సూచనల మేరకు ఇంటి నుంచి తెచ్చిన భోజనాన్నే రోగులకు ఇస్తున్నారు. సామాజిక ఆసుపత్రుల్లో పౌష్టికాహారానికి నోచుకోని రోగుల దయనీయ పరిస్థితులను ‘ఈనాడు’ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

ధరలకు రెక్కలు

ఒకరికి భోజనం పెట్టడానికి ఆసుపత్రి, రోగి స్థితి ప్రకారం రూ.32-40 వరకూ ప్రభుత్వం ఇస్తోంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం, సాయంత్రం స్నాక్స్‌ అందించాలి. రోజూ మధ్యాహ్నం, సాయంత్రం భోజనంలో అన్నం, కూర, చారు, పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, అరటిపండు ఇవ్వాలి. వీటన్నిటినీ సమకూర్చడానికి, ప్రభుత్వం చెల్లిస్తున్న దానికీ పొంతన కుదరడం లేదు. కొన్నిచోట్ల గుడ్డు, అరటిపండు తగ్గిస్తున్నారు. ఏళ్లుగా బిల్లులు రాని వాళ్లు చేతులెత్తేస్తున్నారు.

రూ.60 లక్షలు రావాలి..: టెక్కలి జిల్లా ఆసుపత్రిలో రోగులకు భోజనం సరఫరా చేస్తున్నాను. కాంట్రాక్ట్‌ దక్కించుకుని మూడున్నరేళ్లు అవుతోంది. రోజుకి 50-60 మందికి భోజనం పెడుతున్నాను. ఇప్పటికి రూ.60 లక్షలకు పైగా బిల్లులు రావాలి. ఆర్థికంగా కుదేలైపోయాను.

-నాగార్జున, డైట్‌ గుత్తేదారు, టెక్కలి జిల్లా ఆసుపత్రి

ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా..: రోజుకి కనీసం 350 మందికి భోజనం అందిస్తున్నాం. సాధారణ డైట్‌ వాళ్లకి రూ.36, హైప్రొటీన్‌ డైట్‌ కావాల్సిన రోగులకైతే రూ.56, డ్యూటీ డాక్టర్లకు రూ.80 చొప్పున చెల్లిస్తున్నారు. ఇప్పటివరకూ రూ.17 లక్షలు రావాల్సి ఉంది. ఓవైపు బిల్లులు రాక, మరోవైపు బహిరంగ మార్కెట్‌లో ధరలు మండిపోతుండటం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను.

-సురేష్‌బాబు, గుత్తేదారు, జీజీహెచ్‌

పరిష్కారానికి కృషి...: ఆసుపత్రుల్లో రోగులకు అందించే పౌష్టికాహారం నాణ్యత లోపించిన అంశంపై ఆరా తీస్తాను. పరిస్థితులపై సంబంధిత అధికారులతో సమీక్షిస్తాను. గుత్తేదారులకు బిల్లులు ఎందుకు రావడం లేదు? ఎక్కడ జాప్యం జరుగుతోంది తదితర అంశాలను పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను. రోగులకు మంచి ఆహారం అందించడానికి కృషి చేస్తాను.

- శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, కలెక్టరు


నరసన్నపేట సామాజిక ఆసుపత్రిలో రోగులకు ఒక్కపూటే గుడ్డు ఇస్తున్నారు. మెనూ ప్రకారం కాకుండా ఏదో ఒక కూర, రసంతో సరిపెడుతున్నారు. అరటి పండు ఇవ్వడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకి, బహిరంగ మార్కెట్‌ ధరలకి పొంతన లేదని గుత్తేదారుడు చెబుతున్నారు. వీరికి ఎనిమిది నెలలుగా దాదాపు రూ.8 లక్షల బిల్లులు చెల్లించాల్సి ఉంది.


పలాస సీహెచ్‌సీలో రోగులకు ఒక్కపూటే భోజనం పెడుతున్నారు. అదీ బయట నుంచి తెప్పించి పెడుతున్నారు. ఒక్క భోజనానికి రూ.40 చొప్పున ఇస్తున్నారు. గుత్తేదారుకు గత డిసెంబరు నుంచి ఇప్పటివరకూ రూ.2 లక్షలకు పైగా బిల్లులు రావాల్సి ఉంది.


సీతంపేట ఐటీడీఏ పరిధిలోని సామాజిక ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్లకు భోజనం సరఫరా చేయడానికి ఒక్కొక్కరికి రూ.40 చొప్పున ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో గుత్తేదారులెవరూ టెండర్లు దాఖలు చేయలేదు. ఆసుపత్రి సిబ్బంది అక్కడే వండి రోగులకు వడ్డిస్తున్నారు. కొత్తూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా గిరిజనులకు ఆసుపత్రుల్లో పౌష్టికాహారం అందడం లేదు.

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :
వీక్షకులకు గమనిక
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని