logo

ఆశలు నేలమట్టం

చిత్రంలో కనిపిస్తున్నది జింకిభద్రకు చెందిన తామాడ కామేశ్వరరావు. ఎకరా పొలంలో వరి సాగు చేశారు. ఈ ఏడాది వర్షాభావంతో ఆలస్యంగా నాట్లు వేశారు.

Published : 07 Dec 2021 05:45 IST

చిత్రంలో కనిపిస్తున్నది జింకిభద్రకు చెందిన తామాడ కామేశ్వరరావు. ఎకరా పొలంలో వరి సాగు చేశారు. ఈ ఏడాది వర్షాభావంతో ఆలస్యంగా నాట్లు వేశారు. రూ.20 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. పంట బాగుందనుకునే సమయంలో జవాద్‌ తుపానుతో కురిసిన వర్షాలకు మూడు రోజులుగా వరద నీటిలో ఉండిపోయింది. మరో రెండు రోజులైతేగానీ నీరు తగ్గని పరిస్థితి. నామమాత్రపు దిగుబడులు కూడా వచ్చే అవకాశం లేదని రైతు ఉసూరుమంటున్నారు. జిల్లావ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో పంటనష్టం జరగ్గా ఒక్క బీల ప్రాంతంలోనే 5 వేల ఎకరాల్లో నష్టపోయారు.

ఆలస్యంగా నాట్లు వేసినా...

సోంపేట వ్యవసాయ సబ్‌డివిజన్‌ పరిధిలో 40 వేల ఎకరాల్లో వరిసాగు చేయగా.. ఇందులో బీల ప్రాంతంలో 20 వేల ఎకరాలున్నాయి. ఈ ఖరీఫ్‌ ఆరంభంలో వర్షాలు లేకపోవడంతో రెండు నెలలు ఆలస్యంగా నాట్లు పడ్డాయి. చిన్నపాటి వర్షం వచ్చినా మహేంద్రగిరుల నుంచి వచ్చే వరదనీరు ఈ ప్రాంతాన్ని ముంచెత్తుతోంది. వరదనీరు సంద్రంలో కలిసేందుకు సరైన మార్గం లేకపోవడమే దీనికి కారణం. దీంతో పంట వరదపాలవుతోంది. గత నెలరోజులుగా కురుస్తున్న వర్షాలతో సోంపేట, కవిటి, కంచిలి మండలాల పరిధి బీల ప్రాంతంతో పాటు ఇచ్ఛాపురం తంపర నేలల్లో పంటకు తీవ్రంగా నష్టం జరిగింది.

ఐదువేల ఎకరాల వరకు నష్టం

ఐదు వేల ఎకరాల వరకు పంటకు నష్టం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశాం. గ్రామాల వారీగా నష్టం అంచనాలపై సర్వే జరుగుతోంది. సోంపేట, ఇచ్ఛాపురం మండలాల్లో ఎక్కువగా పంటకు నష్టం సంభవించింది. వ్యవసాయ సహాయకులు, ఇతర సిబ్బంది వాస్తవ నష్టాల నివేదిక ఇచ్చిన తరువాత జేడీకి పంపిస్తాం. అనంతరం శాస్త్రవేత్తలు, నిఫుణులు వచ్చి నివారణ చర్యలు సూచిస్తారు.

- వెంకటేష్‌, వ్యవసాయ సహాయ సంచాలకులు, సోంపేట సబ్‌డివిజన్‌

-న్యూస్‌టుడే, సోంపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని