logo
Published : 07/12/2021 05:45 IST

ఆదమరిస్తే... మళ్లీ పోరాడాల్సిందే!


పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్సులో మాస్కు ధరించని ప్రయాణికులు

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: కరోనా వైరస్‌లో కొత్త రకం ‘ఒమిక్రాన్‌’ దేశంలోకి ప్రవేశించింది. రోజురోజుకీ వాటి కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో సాధారణ కొవిడ్‌ కేసులు ఇప్పటికీ నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోనూ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మాస్కు ధరించకపోతే రూ.100 అపరాధ రుసుం విధించాలని, సామూహిక కార్యక్రమాలకు అనుమతులు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు.

ఇదీ పరిస్థితి...

జిల్లావ్యాప్తంగా అధికారికంగా ఇప్పటివరకు 794 మంది కొవిడ్‌ కాటుకు ప్రాణాలు కోల్పోయారు. లెక్కల్లోకి రానివారు ఇంకా ఎందరో.. వారిపైన ఆధారపడిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రజలు మాత్రం వాటన్నింటినీ మరచిపోయి వ్యవహరిస్తున్నారు. రైతుబజారు, మార్కెట్లు, పార్కులు, సినిమా థియేటర్ల వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు. బస్సులు, ఆటోలు, రైళ్లలో ఇక సరేసరి. కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు.

ముందుంది పండగల కాలం...: గత రెండు నెలలుగా శుభకార్యాలు, పండగల సందర్భంగా అధిక సంఖ్యలో జనాలు హాజరయ్యారు. కార్తిక మాసంలో దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడటాన్ని మనం చూశాం. ఎక్కడా నిబంధనలు అమలైన దాఖలాలు లేవు. డిసెంబర్‌లో క్రిస్మస్‌, జనవరిలో సంక్రాంతి, ఆ తరువాత మహాశివరాత్రి, ఉగాది ఇలా పండగలన్నీ వరుసగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే ముప్పు తప్పదని నిపుణుల అభిప్రాయం.

చర్యలు చేపట్టాలి...: ఒమిక్రాన్‌ ముప్పు నేపథ్యంలో జిల్లాలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో మాదిరిగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అనుమానితులకు పరీక్ష చేసేందుకు ఏర్పాట్లు చేయాలని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియనూ వేగవంతం చేయాలని కోరుతున్నారు. అర్హత ఉన్నవారందరికీ టీకా వేసేలా సిబ్బంది కృషి చేయాలి.

18 ఏళ్లు పైబడినవారు : 21,59,471

టీకా మొదటి డోసు వేయించుకున్నవారు : 17,82,131

రెండో డోసు వేయించుకున్నవారు : 12,05,629

నిబంధనలు పాటించాలి

కొవిడ్‌ మూడో దశ పొంచి ఉన్నందున ప్రజలు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించాలి. మాస్కు ధరించడం, శానిటైజర్‌ వినియోగాన్ని కొనసాగించాలి. టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలి. ఇప్పటికే జిల్లాలోని వైద్యాధికారులందరినీ అప్రమత్తం చేశాం. విదేశాల నుంచి ఎవరైనా వస్తే వెంటనే పరీక్షలు జరపాలని, వివరాలు తెలపాలని ఆదేశించాం.

-డాక్టర్‌ బగాది జగన్నాథరావు, డీఎంహెచ్‌వో, శ్రీకాకుళం

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని