logo

పిలిచినా పలకరే..!

జలుమూరు మండలం లుకలాం నుంచి కొమనాపల్లి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. 5 కిలోమీటర్ల మేర దూరం ఉన్న ఈ దారిలో ప్రయాణించాలంటే అవస్థలే. మరమ్మతు కోసం రూ.2 కోట్ల పనులకు ఐదు సార్లు టెండర్లు పిలిచినా ఎవరూ రాలేదు.

Published : 09 Dec 2021 04:22 IST

- ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, జలుమూరు

జలుమూరు: లుకలాం నుంచి కొమనాపల్లికి వెళ్లే రహదారి దుస్థితి ఇది

జలుమూరు మండలం లుకలాం నుంచి కొమనాపల్లి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. 5 కిలోమీటర్ల మేర దూరం ఉన్న ఈ దారిలో ప్రయాణించాలంటే అవస్థలే. మరమ్మతు కోసం రూ.2 కోట్ల పనులకు ఐదు సార్లు టెండర్లు పిలిచినా ఎవరూ రాలేదు.

సారవకోట మండలం కొల్లివలస నుంచి గొల్లివలస మీదుగా వాసుదేవపట్నం వెళ్లే దారి దారుణంగా తయారైంది. పది కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గానికి రూ.1.95 కోట్లతో బాగు చేయాలని నాలుగు సార్లు టెండర్లు పిలిచినా ఒక్కరూ రాలేదు.

జిల్లాలో ఆర్‌అండ్‌బీ రహదారుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలు, అక్కడి నుంచి గ్రామాలకు చేరుకునేందుకు కీలకమైన దారులు ప్రయాణానికి వీలు లేకుండా మారిపోయాయి. 20 నిమిషాల్లో పూర్తయ్యే ప్రయాణానికి కనీసం రెట్టింపు సమయం పడుతోంది. ఆయా రోడ్లపై అనుమతించిన వేగంతో వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. అయితే వీటన్నింటికీ మరమ్మతులు చేయించడానికి అధికారులు టెండర్లు పిలుస్తున్నా గుత్తేదారుల నుంచి స్పందన ఉండటం లేదు.

సాధారణంగా పనులకు టెండర్లు ఎప్పుడు పిలుస్తారని గుత్తేదారులంతా ఎదురు చూస్తుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 38 పనులను రూ.43.69 కోట్లతో చేసేందుకు జిల్లా అధికారులు టెండర్లు పిలిచారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు ఆహ్వానించినా ఒక్క గుత్తేదారు నుంచీ స్పందన లేకపోవడం గమనార్హం.

బకాయిలిస్తేనే..

2019 వరకూ వివిధ పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు నిలిచిపోయాయి. దాదాపు రెండేళ్ల పాటు ఏ ఒక్కరికీ చేసిన పనికి బిల్లులు అందలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గుత్తేదారులంతా ఏకమయ్యారు. పాత బకాయిలు పూర్తిగా చెల్లిస్తే గాని కొత్తవి వేయబోమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల ధాటికి ప్రధాన రహదారులన్నీ బాగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర మరమ్మతుల పేరుతో ఏడు పనులకు సంబంధించి తప్పనిసరి పరిస్థితుల్లో చీఫ్‌ ఇంజినీరు స్థాయిలో టెండర్లు పిలిచారు. అయినా ఒక్కరూ బిడ్‌ దాఖలు చేయలేదు. దీంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.


ధరలు పెంచినా.. స్పందన లేదు

జిల్లాలో కొన్ని రహదారులకు అత్యవసర మరమ్మతులు నిర్వహించాల్సి ఉంది. ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30న జీవో జారీ చేసింది. దానికి అనుగుణంగా టెండరు దాఖలు గడువు కూడా పెంచాం. అయినా ఒక్కరూ బిడ్‌ దాఖలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా బిల్లులు చెల్లిస్తున్న నేపథ్యంలో త్వరలోనే గుత్తేదారులు స్పందించి టెండర్లు దాఖలు చేస్తారని ఆశిస్తున్నాం.

- కాంతిమతి, ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీ


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని