logo

ఇక చాలు..కట్టేయండి!

చేయని పనులు చేసినట్లు..ఇవ్వని కూలీ ఇచ్చినట్లు..కొలతల్లో కనికట్టు చేసి నిధులు బొక్కేశారు. ‘ఉపాధి’ పనుల్లో ఏటా జరుగుతున్న ఈ తంతు సామాజిక తనిఖీల్లో వెల్లడవుతోంది. అనంతరం నిర్వహించిన సమావేశాల్లో వీటిని ఖరారు చేసి రికవరీలకు ఆదేశాలిస్తున్నారు. ఇప్పటికి 13 రౌండ్లలో లెక్క కొలిక్కి తెచ్చారు

Published : 09 Dec 2021 04:22 IST

ఉపాధి నిధుల రికవరీకి చర్యలు

- న్యూస్‌టుడే, రాజాం

చేయని పనులు చేసినట్లు..ఇవ్వని కూలీ ఇచ్చినట్లు..కొలతల్లో కనికట్టు చేసి నిధులు బొక్కేశారు. ‘ఉపాధి’ పనుల్లో ఏటా జరుగుతున్న ఈ తంతు సామాజిక తనిఖీల్లో వెల్లడవుతోంది. అనంతరం నిర్వహించిన సమావేశాల్లో వీటిని ఖరారు చేసి రికవరీలకు ఆదేశాలిస్తున్నారు. ఇప్పటికి 13 రౌండ్లలో లెక్క కొలిక్కి తెచ్చారు. ప్రస్తుతం 14వది కొనసాగుతోంది. దాదాపు రూ.కోటి వరకు ఇంకా రాబట్టాల్సి ఉందని తేల్చారు. వీటిని వసూలు చేసేందుకు చర్యలను ముమ్మరం చేశారు. వలసల నివారణ, వనరుల పెంపు లక్ష్యంగా ఉపాధిహామీ పథకం అమలు చేస్తున్నారు. ఈ పనుల్లో పుష్కర కాలంగా అవకతవకలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. 2009-10 నుంచి ఇటీవల వరకూ గుర్తించిన అక్రమాల విలువ రూ.3.11 కోట్లుగా తేల్చారు. ఇందులో 68 శాతమే రికవరీ చేశారు. మిగిలిన 32 శాతం రాబట్టడంలో అంతులేని జాప్యం చోటు చేసుకుంటోంది.

ఆర్‌ఆర్‌ అస్త్రం ఏదీ?

2010-11కు సంబంధించి రూ.34.10 లక్షలు ఇంకా రాబట్టాల్సి ఉంది. ఇలా ఏటా పక్కతోవ పడుతున్న నిధుల చిట్టా పెరిగిపోయింది. రెవెన్యూ రికవరీ చట్టం (ఆర్‌ఆర్‌) ప్రయోగించి నిధులు రాబట్టాలని డ్వామా అధికారులు ప్రతిపాదించినా ఆచరణలోకి రావటం లేదు. ముక్కుపిండి ప్రజాధనం రాబట్టాల్సిన అధికారులు దీనిపై దృష్టి పెట్టడం లేదన్న వాదన వినపడుతోంది. ఆర్‌ఆర్‌ చట్టం ద్వారా రూ.89,09,365 రాబట్టాలని ప్రతిపాదించారు. మిగిలిన రూ.10,90,531 డ్వామా అధికారులు వసూలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అంతర్గత సమావేశాలు నిర్వహించి కొలిక్కి తెస్తున్నారు. ఇప్పటికే రాజాం నియోజకవర్గంలోని బాధ్యులతో సమావేశం నిర్వహించారు.

మళ్లీ మళ్లీ అదే తీరు

ఉపాధి నిధులు ఎవరి వద్ద నుంచి ఎంతెంత మొత్తాలు వసూలు చేయాలన్న లెక్క తేలింది. క్షేత్ర సహాయకులు, మేట్లు, సాంకేతిక సహాయకులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్లు, ఏపీవోల నుంచి ఈ మొత్తాలను వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే కొందరు చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నారు. అన్నీ అక్రమాలుగా చెప్పలేమని, ఇందులో వివిధ తప్పిదాల వల్ల నిధుల రికవరీలకు ఆదేశాలు ఇచ్చిన సందర్భాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.


కొలిక్కి తెస్తున్నాం

రూ.కోటి వరకు నిధులు రికవరీ చేయాల్సి ఉంది. జరిగినవన్నీ అక్రమాలని చెప్పలేం. అందుకే అంతర్గత సమావేశాలు నిర్వహించి వారితో చర్చించి కొంత వెసులుబాటు కల్పిస్తున్నాం. నిక్కచ్చిగా ఎంత మేర రాబట్టాలన్నది తేల్చి కట్టేయమని చెబుతున్నాం. రెవెన్యూ రికవరీ చట్టం కింద రూ.89 లక్షల వరకు రాబట్టాలని నిర్ణయించాం. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాం.

-హనుమంతు కూర్మారావు, పీడీ, డ్వామా, శ్రీకాకుళం


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని