logo

రహదారులా..రాళ్లగుట్టలా!

ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు దుర్భరంగా ఉన్నాయి. గండ్లు పడి కొన్ని, రాళ్లు తేలి మరికొన్ని ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. దశాబ్దాల కిందట వేసిన ఇవి నిర్వహణ లేక ఛిద్రంగా మారాయి. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పలు ప్రాంతాల్లోని రహదారుల దుస్థితి అందుకు అద్దం పడుతోంది

Published : 17 Jan 2022 04:04 IST

మందస, న్యూస్‌టుడే: ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు దుర్భరంగా ఉన్నాయి. గండ్లు పడి కొన్ని, రాళ్లు తేలి మరికొన్ని ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. దశాబ్దాల కిందట వేసిన ఇవి నిర్వహణ లేక ఛిద్రంగా మారాయి. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పలు ప్రాంతాల్లోని రహదారుల దుస్థితి అందుకు అద్దం పడుతోంది.

పలు మండలాల్లో..: ఐటీడీఏ ప్రధాన కార్యాలయం ఉన్న మండలం మందస. పదుల సంఖ్యలో రహదారుల పరిస్థితి దయనీయంగా ఉంది. కడగండి, కుసిమి నుంచి ముత్యాల కూడలి మీదుగా కోతాము, గుమ్మడ, చినబగ్గ రహదారులు మరింత అధ్వానంగా ఉన్నాయి. నందిగాం, భామిని, కంచిలి మండలాల్లోని గిరిజన ప్రాంతాల్లో కొన్ని స్వరూపాన్ని కోల్పోయి ప్రయాణానికి పూర్తిగా పనికిరాకుండా పోయాయి. ఐటీడీఏ అధికారులు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం ద్వారా రహదారులు నిర్మిస్తున్నారు. తరువాత నిర్వహణ చేపట్టక అవి పాడవుతున్నాయి. మరమ్మతులు చేపట్టకుండా నిర్లక్ష్యం వహిస్తుండటం గిరిజనులకు శాపంగా మారింది.

మందస మండలం సాబకోట పంచాయతీలో సింగుపురం నుంచి బిత్తరబంద మీదుగా మాణిక్యపట్నానికి నాలుగేళ్ల కిందట కంకర రోడ్డు నిర్మించారు. తిత్లీ తుపాను వరదలకు మార్గమధ్యంలో గండిపడింది. దీంతో ఆయా గ్రామాల గిరిజనులు ఇదిగో ఇలా వాగులోంచి రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. ఇదే పంచాయతీలో సవరబావణాపురం, బుడార్శింగి పంచాయతీ గుడ్డికోల, మధురగుడియాలి, భోగాపురం పంచాయతీ లలితాపురం, తాళ్లగురంటి పంచాయతీ బలరాంపురం, చీపి పంచాయతీ బెత్తుకోల గ్రామాల రహదారుల పరిస్థితీ దాదాపు ఇలాగే ఉంది.

ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేస్తాం

ఏజెన్సీ ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులను క్షేత్రస్థాయిలో గుర్తిస్తున్నాం. అవసరమైన రహదారులకు మరమ్మతులు చేయిస్తాం. ప్రాధాన్యతా క్రమంలో ఎక్కువ గ్రామాలు, జనాభాకు ఉపయోగపడే రహదారులను అభివృద్ధి చేస్తాం. -మురళి, ఎస్‌ఈ, సీతంపేట ఐటీడీఏ

బండరాళ్లతో దర్శనమిస్తున్న ఇది మెళియాపుట్టి మండలంలో కేరాసింగి రహదారి.. చూస్తేనే దడ పుట్టిస్తున్న ఈ రోడ్డుపై వాహనాల సంగతి దేవునికెరుక.. కనీస నడచి వెళ్లగలమా.. ఈ గిరిజనుల బాధ వర్ణనాతీతం. మండలంలోని అడ్డివాడ, గొడ-అంపురం, చందనగిరి, పెద్దకేదారి, పదనాపురం, మామిడిగుడ్డి గ్రామాల రహదారులు వాహనాలు నడపడానికి వినియోగం లేకుండా తయారయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని