logo

ఎంఐజీ కల.. నెరవేరేదెలా?

రాజాం మధ్య ఆదాయ వర్గాల(ఎంఐజీ) వారికి ఉద్దేశించిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ పథకానికి ఆయా వర్గాలు ఎదురు చూస్తున్నాయి. జిల్లాలోని శ్రీకాకుళం నగరం, పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, రాజాం, పాలకొండ పట్టణాల నుంచి 18,006 మంది ఆసక్తి చూపారు. ఇల్లులేని ప్రభుత్వ ఉద్యోగులకూ ఇప్పుడు ఇందులో

Published : 17 Jan 2022 04:04 IST

న్యూస్‌టుడే- రాజాం మధ్య ఆదాయ వర్గాల(ఎంఐజీ) వారికి ఉద్దేశించిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ పథకానికి ఆయా వర్గాలు ఎదురు చూస్తున్నాయి. జిల్లాలోని శ్రీకాకుళం నగరం, పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, రాజాం, పాలకొండ పట్టణాల నుంచి 18,006 మంది ఆసక్తి చూపారు. ఇల్లులేని ప్రభుత్వ ఉద్యోగులకూ ఇప్పుడు ఇందులో స్థలాలు కేటాయించాలని పీఆర్‌సీ ప్రకటన సందర్భంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి లేఅవుట్‌లో 10శాతం ప్లాట్లు వీరికి కేటాయించి స్థలం విలువలో 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీన్ని మరింతగా విస్తరించి ప్రతి నియోజకవర్గంలో ఒక టౌన్‌షిప్‌ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది.

కాశీబుగ్గ: పలాస మండలం బొడ్డపాడు రెవెన్యూ పరిధిలోని డీ పట్టా భూములివి. ఎంఐజీ గృహాల లేఅవుట్‌ కోసం జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ 151 ఎకరాల భూమిని రైతులు ఎంపికచేశారు. పరిహారం విషయంలో అధికారులకు రైతులకు సుదీర్ఘచర్చలు నడిచాయి. అందిస్తున్న పరిహారం చాలదంటూ రైతులు ససేమిరా అన్నారు. చివరికి కలెక్టర్‌ జోక్యం చేసుకుని పరిహారం విషయంలో నచ్చజెప్పిన మీదట రైతులు ఒకే అన్నారు. ఈ నెల ఏడున అధికారులు సర్వే ప్రారంభించారు. రైతులకు ఇంకా ఈ విషయంలో సందేహాలు ఉండనే ఉన్నాయి. ఇది సర్వే పూర్తయి... రైతులకు పరిహారం చెల్లించేదెప్పుడు.. ప్లాట్లు వేసేదెప్పుడు?

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే..

ఎంఐజీ లేఅవుట్ల కోసం ఇప్పటికే పట్టణాల్లో ఎంతమేర స్థలం అవసరమన్నది ప్రాథమికంగా గుర్తించాం. దీనిపై కసరత్తు జరుగుతోంది. కొన్నిచోట్ల స్థల పరిశీలన గతంలో చేశారు. ప్రతి నియోజకవర్గానికి మున్ముందు జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ పథకాన్ని విస్తరించే అవకాశం ఉండటంతో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపడతాం. ఇందుకు అవసరమైన స్థల సేకరణ చేపడతాం. -ఎం.విజయసునీత, జేసీ(రెవెన్యూ), శ్రీకాకుళం

‘వాయిదా’ల్లో చెల్లింపు

ఎంఐజీ లేఅవుట్ల కోసం ఇప్పటికే రాష్ట్రంలో అనంతపురం, గుంటూరు, కడప, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్లాటు విలువలో పదిశాతం దరఖాస్తు సమయంలోనే లబ్ధిదారులు చెల్లించాలి. ఒప్పందం(అగ్రిమెంట్‌) చేసుకున్న నెలలోపు 30, అర్ధ సంవత్సరం లోపు మరో 30 శాతం కట్టాలి. రిజిస్ట్రేషన్‌ సమయం, లేదా ఏడాదిలోపు(రెండింటిలో ఏది ముందైతే అది) మిగిలిన 30 శాతం చెల్లించి ప్లాటును సొంతం చేసుకోవచ్ఛు కంప్యూటరైజ్డ్‌ లాటరీ ద్వారా పాట్ల కేటాయింపు చేయాలని నిర్ణయించారు.

స్థల సేకరణే కీలకం

అధికారుల అంచనా ప్రకారం ఇప్పటివరకూ వచ్చిన దరఖాస్తుల ప్రాప్తికి 1,585.04 ఎకరాల వరకూ స్థలం కావాలని తేల్చారు. లేఅవుట్‌ మొత్తం స్థలంలో సగం సామాజిక అవసరాలకు కేటాయిస్తారు. వినోద సాధనాలతో పాటు దుకాణాలు, పాఠశాలలు, పార్కులు, క్రీడా మైదానాలు, బ్యాంకులు, సామాజిక భవనాలు ఇలా అవసరమైన అన్నింటినీ ఏర్పాటు చేసేందుకు వీటిని వినియోగిస్తారు. ప్రధాన రహదారులు 60(బీటీ), అంతర్గత రహదారులు 40 అడుగులు(సీపీ)గా తీర్చిదిద్దుతారు. భూగర్భ డ్రైనేజీ, వరదనీటి కాలువల వ్యవస్థ, తాగునీరు, విద్యుత్తు, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తారు.

ఆచరణ సాధ్యమేనా?

జగనన్న కాలనీలకు పెద్దఎత్తున భూసేకరణ చేశారు. అవన్నీ చాలావరకూ గ్రామీణ ప్రాంతాలు కావడంతో ఎలాగోలా నెట్టుకొచ్చారు. తొలి దశలో ఎంఐజీ లేఅవుట్ల కోసం పట్టణాలకు సమీపంలో 2-5 కిలోమీటర్ల లోపే సేకరించాలి. శ్రీకాకుళం నగరం లబ్ధిదారులకు ఎచ్చెర్ల మండలం జరజాం, పలాస పట్టణం లబ్ధిదారులకు బొడ్డపాడు, రాజాం వారికి గార్రాజుచీపురుపల్లి సమీపంలోని స్థలాలను లోగడ పరిశీలించారు. దరఖాస్తులకు సరిపడా స్థలం ఒక్కచోటే లభ్యం కావడం కష్టతరంగా మారింది.

జిల్లాలో వివరాలిలా...

కేటగిరీ స్థలం విస్తీర్ణం దరఖాస్తులు అవసరమైన స్థలం

(చ.గజాలు) (ఎకరాల్లో)

ఎంఐజీ-1 150 2,458 136.53

ఎంఐజీ-2 200 6,376 531.31

ఎంఐజీ-3 240 9,172 917.20

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని