logo

‘20న కలెక్టరేట్‌ ముట్టడి’

పీఆర్సీపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, ప్రస్తుతం ఉన్న హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌ను యథావిధిగా కొనసాగించాలని ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు పి.దాలినాయుడు డిమాండు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ నెల 20న కలెక్టరేట్‌ను ముట్టడించనున్నట్లు తెలిపారు.

Published : 18 Jan 2022 06:20 IST


ప్రసంగిస్తున్న ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు పి.దాలినాయుడు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: పీఆర్సీపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, ప్రస్తుతం ఉన్న హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌ను యథావిధిగా కొనసాగించాలని ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు పి.దాలినాయుడు డిమాండు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ నెల 20న కలెక్టరేట్‌ను ముట్టడించనున్నట్లు తెలిపారు. శ్రీకాకుళంలోని ప్రధానోపాధ్యాయుల సంఘ కార్యాలయంలో సోమవారం ఫ్యాప్టో సమావేశం నిర్వహించారు. 11వ పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను పునఃపరిశీలించాలని, ఐఆర్‌ను 27 శాతం కంటే తక్కువగా ప్రకటించడం సరికాదన్నారు. సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛను విధానాన్ని కొనసాగించాలని డిమాండు చేశారు. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ ఇవ్వాలన్నారు. సెక్రటరీ జనరల్‌ కె.అప్పలరాజు, ప్రతినిధులు పి.అప్పారావు, సీహెచ్‌ రవీంద్ర, ఎస్‌.కిశోర్‌కుమార్‌, వి.నవీన్‌కుమార్‌, టి.చలపతిరావు, ఎస్‌.వి.రమణ, బి.తాతారావు, ఎస్‌.గోవిందరాజులు, సీహెచ్‌ రామారావు పాల్గొన్నారు.

30 శాతానికి తగ్గకుండా ఫిట్‌మెంట్‌: పీఆర్సీలో 30 శాతానికి తగ్గకుండా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఆపస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.ఆనందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నర్సింగరావు డిమాండు చేశారు. కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జి డీఆర్వో సీతారామ్మూర్తికి ఈ మేరకు వినతిపత్రం అందించారు. యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.పాపయ్య, జిల్లా కార్యదర్శి జి.మోహనరావు, సీహెచ్‌.రమణ, పి.గోవిందరావు పాల్గొన్నారు.


‘లోపాలు సవరించండి’

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీీఆర్‌సీ ఫిట్‌మెంట్‌ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దానిపై సమీక్షించి లోపాలను సవరించాలని ఎన్జీవో రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తమనాయుడు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతు సాయిరాం, చల్లా శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో డిమాండు చేశారు. ముఖ్యమంత్రి పీఆర్‌సీ రద్దుపై హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ అంశాన్నే పూర్తిగా పక్కన పెట్టడం ఉద్యోగ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఏళ్ల తరబడి ఎన్నో పోరాటాలతో సాధించుకున్న అదనపు సౌకర్యాలను ఏకపక్షంగా తొలగించాలని భావించడం సరికాదన్నారు. దీనిపై ఈ నెల 19న విజయవాడలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని